అష్ట వ్యసనాలతో అడ్డదారులు..!

10 Mar, 2019 18:35 IST|Sakshi

 చెడు స్నేహం, మద్యపానం, అంతర్జాలంతో యువత పెడదారి

 పక్కదారి పడుతున్న భావిపౌరుల జీవితాలు

 ప్రమాదకరంగా మారుతున్న పబ్‌జీ తరహా గేమ్‌లు 

 తల్లిదండ్రులు  దృష్టి పెడితేనే మార్పు

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): చరవాణి, చెడు స్నేహం, అంతర్జాలం, ఫేస్‌బుక్, వాట్సప్, దూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు ఇవన్నీ యువత పాలిట అష్ట వ్యసనాలై పట్టి పీడిస్తున్నాయి. పరిధిలు దాటి వాటిని వినియోగించడంతో భస్మసుర హస్తాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం కాలంలో స్కూల్‌కి వెళ్లే విద్యార్థి సైతం ఇంటర్నెట్‌ సౌకర్యం కలిగి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. కాగా ఈ మధ్య కాలంలో పబ్‌జీ లాంటి వీడియో గేమ్‌లకు ఆకర్షితులై ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

ఇటీవల ఓ విద్యార్థి పబ్‌జీ గేమ్‌ ఆడేందుకు తనకు స్మార్ట్‌ ఫోన్‌ కొనివ్వాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తేగా, ఫోన్‌ కొనివ్వనందుకు ఆత్మహత్య చేసుకున్న విషయం వార్తల్లో రావడం ఆందోళన కలిగిస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ విషయంలోనే కాదు.. చాలా విషయాల్లో యువత పెడదోవ పడుతోంది. అయితే తల్లిదండ్రులు పిల్లన్ని గమనిస్తూ.. స్నేహితులుగా మారి వారిలో మార్పు తీసుకురావడమే ఈ వ్యసనాలకు అసలైన పరిష్కారం. కానీ పట్టించుకునే వారు లేకపోవడంతో విలువైన సమయం వృథా కావడంతో పాటు భావి పౌరుల జీవితాలు పక్కదారి పడుతున్నాయి. 

జీవితాన్నే మార్చేస్తున్న చరవాణి
యువతను పట్టి పీడిస్తున్న భూతం ప్రధానంగా చరవాణే. నిద్ర లేచిన మొదలు నుంచి పడుకునే వరకు చరవాణితోనే జీవిస్తున్నారు. కేవలం చరవాణి వ్యహహారాలు చక్కబెట్టేందుకే సగటున రోజుకు 3 గంటల సమయాన్ని విద్యార్థులు వెచ్చిస్తున్నారని ఇటీవల పలు అధ్యాయనాల్లో వెల్లడైంది. తరగతుల్లో చాటు మాటుగా సెల్‌ఫోన్‌ మాట్లాడటానికి అలవాటు పడుతున్నారని అధ్యాపకులే చెబుతున్నారు. అలాగే ఆధునిక, వినూత్న మోడళ్ల ఫోన్‌ల కోసం అధిక వ్యయాలు చేస్తున్నారు. ఏది చేయాలి..? ఏదీ చేయకూడదో అనే విచక్షణ కొరవడి తాము చూసిన ప్రతిఅంశాన్ని చరవాణిలో చిత్రీకరిస్తూ ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. సెల్ఫీల మోజులో పడి అనుకోని ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

గ‘మ్మత్తు’ జీవితం చిత్తు 
మిత్రుల పొగడ్తల కోసమో, ఫోజులు కొట్టడానికో, సరదాకో.. అసలు అందులో ఏముందో చూద్దామనే మొదలైన మద్యపానం, దూమపానం, ఇవి యువత జీవితాన్ని చిత్తు చేస్తున్నాయి. పాఠశాల స్థాయి పిల్లలు కూడా మద్యపానం, దూమపానాన్ని సరాదాకు ప్రారంభించి కళాశాల స్థాయికి వచ్చే వరకు వాటికి బానిసలుగా మారుతున్నారు. పెళ్లి సంబరాలు, పుట్టిన రోజులు, కళాశాల సంబరాలు, పండుగ పబ్బాలు, ఇలా వేడుక ఏదైనా మద్యపానంతో మొదలయ్యే పరిస్థితి దాపురించింది. మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేస్తూ.. తమ ప్రాణాలను తీసుకోవడమే కాకుండా ఇతరుల విలువైన ప్రాణాలను సైతం హరించడానికి కారణమవుతున్నారు.

అశ్లీలతకు ఊతం.. అంతర్జాలం
అరచేతిలో ఇమిడే చరవాణుల్లోనూ అత్యంత వేగంగా నడిచే అంతర్జాలం అందుబాటులోకి రావడంతో యువత వాటితోనే లోకంగా జీవిస్తోంది. వాస్తవానికి అంతర్జాలం ద్వారా ప్రపంచంలోని సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోవచ్చు. అయితే అవసరాన్ని మించి వినియోగించడమే సమస్యలకు దారి తీస్తోంది. యవ్వనంలో కలిగే ఉద్వేగాలు విద్యార్థు పట్టిస్తున్నాయి. కామోద్రేకాన్ని పెంచే అంతర్జాల గూళ్లకు బానిసలై విచక్షణా, జ్ఞానం కోల్పోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కుటుంబ సభ్యులకు దూరమవుతూ.. జ్ఞాపకశక్తి, ఆలోచన విధానం తగ్గి అంతర్జాలం మీద ఆధారపడుతున్నారు. ఎక్కువ సేపు అంతర్జాలంతో గడపడం వల్ల నిద్రలేమి, నరాలు, కండరాలు సంబంధిత వ్యాధులకు గురవుతున్నారు.

పరిధి దాటుతున్న స్నేహం
చెడు స్నేహాల ముసుగులో ప్రపంచ పరిధిలు దాటి ఊహల్లో జీవిస్తున్నారు. స్నేహితుల ప్రోద్భలంతో బైక్‌ రేసులు, కారు రేసులతో విలువైన ప్రాణాలను పోగోట్టుకుంటున్నారు. కన్న వారితో కూడా పంచుకోలేని ఆవేదనను స్నేహితులతో పంచుకోవడం సహజం. కానీ ఇటీవల స్నేహాల పేరుతో యువత దుర్వ్యసనాలకు అధికంగా బలవుతున్నారు. పార్టీల పేరుతో పబ్బులకు అలవాటు పడుతున్నారు. కాగా కళాశాలలకు గైర్హాజరవుతూ చెడు స్నేహాల ముసుగులో విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.ఆధునిక వ్యసనాలుగా ఫేస్‌బుక్, వాట్సప్‌ యువలోకాన్ని పట్టి పీడిస్తున్న ఆధునిక వ్యవసనాలుగా ఫేస్‌బుక్, వాట్సప్‌లు మారాయి. చేతిలో పుస్తకం లేకపోయినా ఫేస్‌బుక్‌ లేని యువత కనబడదు. ఫేస్‌బుక్, వాట్సప్‌లలో వ్యక్తిగత సంఘటనలు, అశ్లీల వాఖ్యలు, చిత్రాల పోస్టింగులు పెడుతూ.. ఇబ్బందికర జీవితాలను గడుపుతున్నారు. లైక్‌లు, షేర్‌ల మోజులో ఇతర జీవిత చిత్రాలను పోస్ట్‌ చేస్తున్నారు.

డిప్రెషన్‌కు లోనవుతారు
యువత సమయాన్ని సోషల్‌ మీడియా, ఫేస్‌బుక్, వాట్సప్, ఇంటర్నెట్, మత్తుపదార్థాలు, ఆల్కహాల్, గంజాయి, సిగరెట్‌ల ద్వారా వృథా చేసుకుంటున్నారు. ఇంటర్నెట్, సినిమాల ద్వారా నేర ప్రవృత్తిని నేర్చుకుంటున్నారు. అతిగా ఇంటర్నెట్‌కు అలవా టు పడితే ఆందోళన, డిప్రెషన్, ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ కనీసం అరగంట కేటాయించాలి. వారితో స్నేహపూర్వకంగా ఉంటూ చెడు అలవాట్లు ఉంటే మానుకోవాలని స్నేహ పూర్వకంగా చెప్పండి. ఇంటర్నెట్, సోషల్‌ మీడియాకు అలవాటు కాకుండా అవగాహన కల్పించండి. విద్యాసంస్థలలో చదువుతో పాటు విద్యార్థులకు సమయం, విలువలు, సంస్కారం నేర్పించడం వల్ల మార్పు వస్తుంది.
– డాక్టర్‌ విశాల్, మానసిక వైద్య నిపుణులు, నిజామాబాద్‌ 

ఇంటర్నెట్‌తో ఉపయోగమెంతో, ప్రమాదమంతే..
ఇప్పుడున్నది ఇంటర్నెట్‌ యుగం కాబట్టి ఎంతగా ఉపయోగమో, అంతే స్థాయిలో నష్టం కూడా జరుగుతోంది. నేటి కాలంలో ప్రతిఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌లను వినియోగిస్తున్నారు. అవసరాలకు వాటిని వినియోగించుకోకుండా చెడు మార్గాలకు వేదికగా మార్చుకుంటున్నారు. కాబట్టి పిల్లలకు, విద్యార్థి దశలో ఉన్న వారిని సెల్‌ఫోన్‌లకు, ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచడమే మేలు. 
– రవిశ్రీ, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ, వ్యవస్థాపకులు 

మరిన్ని వార్తలు