సబ్సిడీ బర్రెల పథకానికి బ్రేక్‌!

24 Oct, 2018 01:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సబ్సిడీ పాడి పశువుల పథకానికి తాత్కాలికంగా బ్రేక్‌ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటివరకు తమ వాటా సొమ్ము చెల్లించిన రైతులు తప్ప కొత్త వారి నుంచి ఎలాంటి డీడీలు తీసుకోకూడదని అధికారులకు అంతర్గత ఆదేశాలు వెళ్లాయి. అనేకచోట్ల బర్రెలు, ఆవులు కొనకుండానే కొన్నట్లు చూపుతుండటం, అధికారుల అవినీతి నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పైగా ఎన్నికల సమయంలో పర్యవేక్షణ లేకపోవడం కూడా అక్రమాలకు కారణంగా భావిస్తున్నారు.

రైతులకు ఇదే విషయాన్ని పశుసంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో అటు కొత్తగా డీడీలు చెల్లించాలనుకున్న రైతులు, ఇటు ఇప్పటికే డీడీలు చెల్లించి పాడి పశువులు పొందని వారిలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు 52,491 మంది లబ్ధిదారులు డీడీలు చెల్లించగా అందులో 32,175 మందికి పాడి పశువులను సరఫరా చేశారు. మిగిలిన రైతులు కూడా చాలామంది డీడీలు చెల్లించేందుకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు వద్దనీ ఎన్నికల తర్వాత ఇవ్వండని పశు సంవర్థకశాఖ అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు