కూలీలూ లేరు.. యంత్రాలూ లేవు

4 Nov, 2018 01:25 IST|Sakshi

వరినాటు యంత్రాలపై నీలినీడలు

రబీకి ముందే సరఫరా చేస్తే ప్రయోజనం ఉండేది

ఎన్నికల్‌ కోడ్‌ పేరుతో అన్ని యంత్రాల సరఫరాకు బ్రేక్‌

చిన్నచిన్న యంత్రాలు కూడా కొనుగోలు చేయని దుస్థితి  

సాక్షి, హైదరాబాద్‌: రబీ వరి నాట్లు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. ఉపాధి హామీ పథకం పనుల్లో ఉండటం వల్ల నాట్ల కోసం కూలీలు దొరకడంలేదు. పైపెచ్చు ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో అనేకమంది కూలీలు పార్టీల కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో గ్రామాల్లో నాట్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వరి నాటు యంత్రాలు సరఫరా చేయాల్సి ఉండగా వ్యవసాయశాఖ చేతులెత్తేసింది. ఎన్నికల కోడ్‌ పేరుతో వాటిని నిలుపుదల చేసినట్లు చెబుతున్నారు. ఆ పేరుతో మొత్తం వ్యవసాయ యంత్రాల సరఫరానే నిలిపివేసింది. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా కొనసాగుతున్న కార్యక్రమాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదని చెబుతున్నారు. పైగా దుక్కిదున్నే నాగళ్లు, స్ప్రేయర్లు వంటి చిన్నచిన్న వాటిని కూడా నిలుపుదల చేయాల్సిన అవసరమేంటో అంతుబట్టడంలేదు. ఈ చర్యతో రైతులు తీవ్రం గా నష్టపోతున్నారు. వరి నాటు యంత్రాలు పంపిణీ చేస్తే తమకు కూలీలు దొరక్కపోయినా ఇబ్బంది ఉండేది కాదంటున్నారు.  

మండలానికి 10 చొప్పున..  
రబీలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇకనుంచి నాట్లు పుంజుకోనున్నాయి. రబీకి ముందే అన్ని మండలాల్లో పది చొప్పున వరి నాటు యంత్రాలు అందుబాటులోకి తెస్తామని వ్యవసాయశాఖ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోలేదు. గత ఖరీఫ్‌ సీజన్‌లోనే 50 శాతం సబ్సిడీపై యంత్రాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ కసరత్తు చేసింది. వివిధ కంపెనీల నుంచి యంత్రాలను రప్పించింది. పనితీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. జూన్, జూలై నెలల్లోనే యంత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే అప్పటికి రైతులకు, డ్రైవర్లకు శిక్షణ ఇవ్వలేదు. రైతులకు, వ్యవసాయ అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహించలేదు. యంత్రాల విక్రయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోలేదు. దీంతో ఆలస్యమైపోయింది. అయితే మెదక్‌ జిల్లాలో కొందరు రైతులు సొంతంగా యంత్రాలు కొనుగోలు చేశారు.

మరికొందరు ఎకరానికి రూ.3,500 అద్దె చెల్లించి వరి నాట్లు వేయిస్తున్నారు. కాగా వరి నాటు యంత్రాలను పంపిణీ చేయటానికి ఏడు కంపెనీలు ముందుకొచ్చాయి. కనిష్ట ధర రూ.2.25 లక్షలు ఉండగా... గరిష్ట ధర రూ.18.15 లక్షలు ఉంది. కానీ ఇప్పటివరకు పంపిణీ జరగలేదు. బడ్జెట్‌ రాకపోవడం వల్లే పంపిణీ చేయడం లేదని చెబుతున్నారు. వాస్తవంగా ఇప్పటికే ఏళ్లుగా పంపిణీ చేస్తున్న చిన్నచిన్న యంత్రాలను కూడా నిలుపుదల చేయడంలో అర్థంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రోజువారీ అవసరాలకు ఉపయోగపడే వెయ్యి, రెండు వేల రూపాయల ధర పలికేవాటిని నిలుపుదల చేయడం వల్ల తమకు మరో ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాక్టర్లను కూడా పంపిణీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల తర్వాతే వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది.

మరిన్ని వార్తలు