గోదావరి వరదతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

4 Oct, 2016 03:04 IST|Sakshi
గోదావరి వరదతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్

* మేడిపల్లి ఓసీపీలో నిలిచిన పనులు
* పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తి బంద్

 
గోదావరిఖని: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల వరద నీటిని వదులుతుండడంతో నది ఒడ్డున గల సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి పనులను అధికారులు సోమవారం నిలిపివేశారు. ప్రాజెక్టులో నడిచే యంత్రాలు, వాహనాలను ఉపరితలానికి తీసుకువచ్చారు. గోదావరినదిలో వరద ఉధృతి సముద్రమట్టానికి 831.40 మీటర్లకు చేరుకుంటే ‘డేంజర్ లెవల్ ’గా గుర్తించి పనులన్నీ నిలిపివేస్తారు. అయితే, సోమవారం ఉదయం ఏడు గంటల సమయంలో నదిలో వరద ప్రవాహం 831.70 మీటర్లకు చేరుకోవడంతో డేంజర్ లెవల్‌గా గుర్తించి పనులను నిలిపివేశారు.

 దీంతో సుమారు 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి పనులతో పాటు 40 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు బ్రేక్ పడింది. అయితే, గతంలో తొలగించిన బొగ్గును మాత్రం కొంతవరకు ఉపరితలానికి చేరవేసే చర్యలు తీసుకున్నారు. అలాగే, జీడీకే 1వ గనికి సమీపం నుంచి గోదావరినది వరద ప్రవాహం కొనసాగుతుండడంతో గని అధికారులు అప్రమత్తమయ్యారు.

 ఇక్కడ సముద్రమట్టానికి 830 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం ఉంటే ‘వార్నింగ్ లెవల్’గా భావిస్తారు. ఉదయం 9 గంటల సమయంలో 830.40 మీటర్లుగా నమోదు అయింది. గోదావరిఖనిలోని సింగరేణి పవర్‌హౌస్‌లో నీరు లేక ఆదివారం నుంచి విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. నదిలో ఉన్న రెండు మోటార్లను పైకి తీసుకురావడంతో నీటిని అందించే వీలు లేకుండా పోయింది.
 
 నీటమునిగిన గుళ్లు
 
గోదావ రినదిలో నీటి మట్టం పెరగడంవల్ల గోదావరిఖనిలోని ఇంటెక్‌వెల్, బ్రిడ్జి, పుష్కరఘాట్ వద్ద గల గంగాదేవి, శివాలయాలు పూర్తిగా నీట మునిగాయి. కాగా సింగరేణి ఇంటెక్‌వెల్‌నుంచి పుష్కరఘాట్‌కు వెళ్ళే రహదారిలో వచ్చిన వరద నీటిలోనే భక్తులు స్నానమాచరించారు.

మరిన్ని వార్తలు