పన్నుల శాఖలో బదిలీలకు బ్రేక్‌

7 Jun, 2018 00:56 IST|Sakshi

శాఖ పునర్‌ వ్యవస్థీకరణ పేరుతో నిలిపివేత 

సాక్షి, హైదరాబాద్‌: పన్నుల శాఖలో ఉద్యోగుల బదిలీలకు బ్రేక్‌ పడింది. శాఖ పునర్‌ వ్యవస్థీకరణ సాకుతో బదిలీలను అధికారులు నిలిపేశారు. ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న పునర్‌ వ్యవస్థీకరణ చేపడుతున్నందున అది పూర్తయ్యేవరకు బదిలీలుండవని తేల్చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పనిభారం పెరగడంతో సర్కిళ్లను పునర్‌ వ్యవస్థీకరించాలని నిర్ణయించిన అధికారులు.. ఒక్కో సర్కిల్‌లో 1,500–2,200 మంది డీలర్లు ఉండేలా ప్రస్తుత 91 సర్కిళ్లకు అదనంగా మరో 5 కలిపి 96 సర్కిళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

కానీ డివిజన్ల పెంపుపై మాత్రం ప్రతిపాదన చేయలేదు. 8 నుంచి 10 సర్కిళ్లు కలిపి ఓ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని, అవసరమైతే డివిజన్ల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. బదిలీల నిలిపివేతపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు.. పునర్‌ వ్యవస్థీకరణ చేయడంలో తమకు ఇబ్బంది లేదని, కానీ ఆ కారణంతో బదిలీలు నిలిపేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి.  

జీఎస్టీ నాటి ప్రతిపాదన 
గతేడాది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చింది. దీని వల్ల పన్నుల శాఖ పరిధిలోని ఉద్యోగులపై అదనపు భారం పడుతుందని.. వెంటనే సర్కిళ్లు, డివిజన్లను పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేశాయి. 120 సర్కిళ్లు, 15 డివిజన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాయి. అయితే అప్పటి నుంచి ఆ ఫైలు పెండింగ్‌లో ఉంది. అదే సాకుతో పదోన్నతులనూ అధికారులు నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ పునర్‌ వ్యవస్థీకరణ అంటూ బదిలీలు ఆపుతుండటంతో ఉద్యోగుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఐదేళ్లుగా బదిలీల్లేవని, ఈ సాకుతో మళ్లీ నిలిపితే ఇప్పట్లో బదిలీలు జరగవేమోనని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు