బడిలో ఇక అల్పాహారం!

4 Jul, 2019 10:49 IST|Sakshi

అమలు చేసేందుకు ప్రభుత్వ యోచన

వివిధ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలుకు ఏర్పాట్లు

జిల్లాలో లక్షా 45 వేల మంది విద్యార్థులకు చేకూరనున్న లబ్ధి

సదాశివనగర్‌ (కామారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మరింత పటిష్ట పరచడానికి ప్రభుత్వం వినూత్నంగా అడుగులు వేస్తోంది. విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ముందుకు సాగుతోంది. పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్యను తీర్చడంతో పాటు, పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి తోడు ఉదయం పూట అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్‌)ను ఇవ్వాలని యోచిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం అమలు చేస్తుండడంతో కొన్నేళ్లుగా విద్యార్థుల హాజరుశాతం కూడా పెరుగుతూ వస్తోంది. దీనికి తోడు పిల్లల్లో పౌష్టికాహారలోపం సమస్య కూడా కొంత వరకు తీర్చగలుగుతున్నారు.

ఉదయం పూట అల్పాహారం కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో జిల్లాలోని లక్షా 45 వేల 443 విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మధ్యాహ్న భోజనం వల్ల విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం సమస్య తీర్చడానికి తోడు విద్యార్థుల హాజరుశాతం పెరిగేందుకు దోహదపడుతుంది. ఆయా పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులు తీవ్ర పౌష్టికాహార లేమితో బాధ పడుతున్నారు. ఒకపూట ఆహారం అందించడం వల్ల కొంత సమస్య తగ్గింది. రెండుపూటలా ఆహారం అందిస్తే వారిలో పౌష్టికాహార లేమి చాలావరకు దూరం చేయవచ్చు. ఉచితంగా ఆహారం అందించడం వల్ల పేదకుటుంబాల పిల్లలు పాఠశాలలకు వచ్చే అవకాశం ఉంటుంది.

అల్పాహారంలో భాగంగా విద్యార్థులకు పాలు, పండ్లు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ దీనిపై కసరత్తు చేస్తోంది. అల్పాహారం అందించడం వల్ల ఎంతోమంది విద్యార్థులకు లబ్ధి చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 718 ప్రాథమిక పాఠశాలలు, 213 ప్రాథమికోన్న త పాఠశాలలు, 321 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా ఈ పాఠశాలల్లో సుమారు లక్షా 45వేల 443 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

పెరిగిన భోజనం ధరలు ఇలా..
ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటివరకు ఒక్కొక్కరికి మధ్యాహ్నభోజనం కోసం రూ. 4.13 ఇచ్చే వారు. దానిని రూ. 4.35లకు పెంచారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు రూ. 6.18 ఇచ్చేవారు ప్రస్తుతం రూ. 6.51కి పెంచారు. విద్యార్థులకు వారంలో రెండు రోజుల పాటు గుడ్డును అందిస్తున్నారు. గతంలో ఒక్కో గుడ్డుకు రూ. 4 చెల్లించగా, ఇప్పుడు రూ. 2 పెంచి రూ. 6 చెల్లించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులకు సన్న బియ్యం భోజనం అందిస్తున్నారు. పెరిగిన ధరలతో విద్యార్థులందరికి నాణ్యమైన భోజనం అందనుంది.

రేటు పెంపుతో భోజనం మెరుగు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్నభోజనం మెనూ చార్జీలు పెరిగాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందనుంది. గతంలో భోజనం ధరలు తక్కువగా చెల్లించడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం నిర్వాహకులకు కష్టంగా మారేది. అంతే కాకుండా రోజు రోజుకు కూరగాయల ధరలు పెరిగిపోతుండడం, దానికి అనుగుణంగా మధ్యాహ్నభోజన ధరలు పెరగక పోవడంతో నాణ్యమైన ఆహారాన్ని అందించలేని పరిస్థితి ఉండేది.

ఉత్తర్వులు రాలేదు
ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ మరింత మెరుగవుతుంది. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అనే యోచన చేస్తుంది. ఇది అమలయితే మరింత బాగుంటుంది. అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఒకవేళ వస్తే అమలు చేస్తాం.
–యోసెఫ్, ఎంఈవో, సదాశివనగర్‌

మరిన్ని వార్తలు