‘నయా జోష్’పై నజర్

25 Dec, 2014 23:36 IST|Sakshi
‘నయా జోష్’పై నజర్

చేవెళ్ల/మొయినాబాద్ రూరల్: పోలీసు నిఘా నీడన కొత్త సంవత్సరం వేడుకలు జరుగనున్నాయి. ఇప్పటికే నయా సాల్ వేడుకలకు పలు ఫాంహౌస్‌లు, రిసార్టులు సిద్ధమవుతున్నాయి. వేడుకలు నిర్వహించేందుకు సంబంధిత యజమానులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంది. చేవెళ్ల నియోజకవర్గం రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో అనేక రిసార్టులు, ఫాంహౌస్‌లు ఉన్నాయి.

ముఖ్యంగా హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న మొయినాబాద్ మండలంలో సుమారుగా 130 ఫాంహౌస్‌లు, 10 రిసార్టులు, 100కు పైగా వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. కొన్ని ఫాంహౌస్‌లు, రిసార్టుల్లో తరచూ అసాంఘిక కార్యకలాపాలు కూడా ఇటీవల వెలుగుచూశాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసులు వాటిపై ప్రత్యేక నిఘా వేశారు.  

హద్దు దాటితే కఠిన చర్యలు..  
కొత్త సంవత్సరం వేడుకలకు ఆయా ఈవెంట్ల నిర్వాహకులు పోలీసుల అనుమతులు తీసుకున్నా హద్దులు మీరితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వేడుకల్లో భాగంగా పేకాట, వ్యభిచారం, రేవ్‌పార్టీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు. హుక్కా, డ్రగ్స్, బెట్టింగ్, డీజే సౌండ్, క్యాబరే డ్యాన్సులు తదితర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ఫాంహౌస్, రిసార్ట్స్‌ల నిర్వాహకులు పోలీసుల అనుమతి పొందాకే వేడుకలు నిర్వహించాల్సి ఉంటుంది.  
 
అనుమతులు తప్పనిసరి..
నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించుకునేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరి. వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడొద్దు. ఈవెంట్ల నిర్వాహకులు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలి. మద్యం వినియోగించేందుకు సంబంధిత ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసుల అనుమతి కూడా ఉండాలి. తిరుగు ప్రయాణంలో మద్యం మత్తులో వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తాం. వేడుకలు రాత్రి ఒంటిగంట వరకు ముగించాల్సి ఉంటుంది. లేదంటే నిర్వాహకులపై చర్యలు తప్పవు.

మరిన్ని వార్తలు