నిధులువెనక్కేనా..!

25 Sep, 2014 03:50 IST|Sakshi
  • బీఆర్‌జీఎఫ్ నిధులపై ప్రతిష్టంభన
  •  ప్రతిపాదనలకు చివరి తేదీ ఈనెల 30
  •  నేటికీ సమావేశమవ్వని డీపీసీ
  •  అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం
  • సాక్షి, హన్మకొండ : అధికారుల అలసత్వం కారణంగా వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్‌జీఎఫ్) వెనక్కి మళ్లే ప్రమాదం ఏర్పడింది. ఈ నిధుల కింద చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలు సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది. గడువులోపే జిల్లా ప్రణాళికా కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ పనులపై చర్చ జరగాల్సి ఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రతిపాదనలు నేటికీ ఆమోదం పొందలేదు.  
     
    సరికొత్త మార్గదర్శకాలు

    2012-17 వరకు అమలు కావాల్సి ఉంది. ఈ పథకం ద్వారా కేటాయించే నిధులలో గ్రామ పంచాయతీలకు 50శాతం, మండల పరిషత్‌లకు 30శాతం, జిల్లా పరిషత్‌కు 20శాతం కేటాయిస్తారు. రెండో విడత కింద రూ.33కోట్ల వరకు నిధులు జిల్లాకు కేటాయించగా వీటిలో రూ.22కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, రూ.11 కోట్లు పట్టణ ప్రాంతాల్లో ఖర్చు చేయాల్సి ఉంది. అంతకు ముందు బీఆర్‌జీఎఫ్-1 కింద 2007-12 వరకు మొదటి విడత అమలైంది.

    ఈ సమయంలో హైమాస్ట్‌లైట్లు, మురుగుకాల్వలు, సిమెంట్ రోడ్లకు అత్యధిక నిధులు కేటాయించడాన్ని రాష్ట్ర హైపవర్ కమిటీ తప్పుపట్టింది. హైమాస్ట్‌లైట్ల కొనుగోలుపై ఆడిట్ అభ్యంతరాలు సైతం వ్యక్తమయ్యాయి. దానితో మురుగు కాల్వలు, సిమెంట్ రోడ్లు, హైమాస్ట్‌లైట్లను ప్రతిపాదనల్లో చేర్చవద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల్లో కిచెన్‌షెడ్లు, మూత్రశాలలు, తాగు నీటి సౌకర్యాలు వంటి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేశారు.  
     
    జెడ్పీ అధికారుల నిర్లక్ష్యం

    2012లో బీఆర్‌జీఫ్-2 అమలయ్యే నాటికి కొత్త పాలకవర్గం ఏర్పడ లేదు. అధికారుల పాలనే సాగింది. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2014 ఏప్రిల్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా మే నెలలో ఫలితాలు వెలువడ్డాయి. ఆ వెంటనే బీఆర్‌జీఎఫ్-2 నిధులతో చేపట్టే పనులకు సంబంధించిన ప్రతిపాదనలు జెడ్పీటీసీ సభ్యుల నుంచి తీసుకోవడంలో జిల్లా పరిషత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

    కొత్త సభ్యులకు మార్గదర్శకాలు వివరించకుండా, గత అనుభవాలను పట్టించుకోకుండా ప్రతిపాదనలు తీసుకున్నారు. దానితో జెడ్పీటీసీ సభ్యులు పంపిన ప్రతిపాదనల్లో యాభై శాతానికి మించిన పనులు సీసీ రోడ్లు, డ్రెరుునేజీలకు సంబంధించినవే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యులు పంపించిన ప్రతిపాదనలు బీఆర్‌జీఎఫ్-2 నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే అంశాన్ని మూడు నెలలుగా జిల్లా అధికారులు గుర్తించలేదు. మరోవైపు గడువు తేదీ సెప్టెంబర్ 30 సమీపిస్తుండటంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు. గతంలో జెడ్పీటీసీలు సమర్పించిన పనులను ఏకగ్రీవంగా ఆమోదించారు.
     
    డీపీసీ వాయిదా

    బీఆర్‌జీఎఫ్-2 పనుల ప్రతిపాదనలకు సంబంధిం చి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులకు, జెడ్పీటీసీలకు మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. దీన్ని సరిదిద్దడంపై అటు కలెక్టర్ సైతం దృష్టి సారించక పోవడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. దానితో ఈ ప్రతిపాదనలు విషయంలో ఏం చేయాలనే అంశంపై స్పష్టత రాకుండా పోయింది. జిల్లా కలెక్టర్ సభ్యుడిగా ఉండే జిల్లా ప్రణాళికా కమిటీ(డీపీసీ)లో చర్చించి ఆమోదం పొందేందుకు జెడ్పీటీసీ సభ్యులు బుధవారం యత్నించారు.

    అయితే వీడియో కాన్ఫరెన్స్ ఉందనే కారణంతో డీపీసీ సమావేశాన్ని కలెక్టర్ వాయిదా వేశారు. సమావేశం ఎప్పుడు నిర్వహించే తేదీని సైతం ఖరారు చేయలేదు. జెడ్పీ చైర్‌పర్సన్ అధ్యక్షురాలిగా ఉండే జిల్లా ప్రణాళికా కమిటీ సమావేశాన్ని కలెక్టర్ వాయిదా వేయడం ఏమిటని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇదే తీరున ఆలస్యం జరిగితే నిధులు వెనక్కి మళ్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. బీఆర్‌జీఎఫ్-2 పనుల విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారంటూ సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
     

మరిన్ని వార్తలు