మధిర మున్సిపాలిటీలోఅవినీతి తిమింగలాలు..!

30 Aug, 2018 13:35 IST|Sakshi
 ఇటీవల మున్సిపల్‌ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడిన దృశ్యం (ఫైల్‌) 

మధిర ఖమ్మం : మధిర మున్సిపాల్టీలో ఏదైనా పని కావాలంటే అధికారులకు, సిబ్బందికి ముడుపులు చెల్లించుకోవాల్సిందేనన్న విమర్శలు వినవస్తున్నా యి. ఇటీవల ఏసీబీ అధికారులు దాడిచేసి పట్టపగలే అక్రమంగా డబ్బులు తీసుకున్న ఇద్దరు ఉద్యోగులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ కార్యాలయంలో మరికొన్ని అవినీతి తిమింగలాలు ఉన్నాయని ప్రజల నుంచి ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక్కడ ఒక్కో పనికి ఒక్కో రేటును సిబ్బంది నిర్ణయించినట్టు తెలిసింది. జనన, మరణ ధృవీకరణ పత్రాలతోపాటు ఎల్‌ఆర్‌ఎస్, విద్యుత్‌ మీటరు కనెక్షన్‌ పొందాల న్నా, తల్లిదండ్రుల వారసత్వపు ఆస్తిని పిల్లల పేరు మీదకు బదలాయించాలన్నా ముడుపులు చెల్లిం చాల్సిందేనట. ముడుపులు ఇస్తేనే ఫైలు కదులుతుందని దరఖాస్తుదారులకు సిబ్బంది ప్రత్యక్షంగానే చెబుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. 

కొన్ని ఉదాహరణలు 

సుమారు మూడు నెలల క్రితం గుంటూరుకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు మధిర రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరికి డెత్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. మరొకరికి ఇవ్వకుండా ఆపి, ఆ ఒక్కరికి పోస్టుమార్టం రిపోర్టు రాలేదని చెప్పారు. దీంతో బాధిత కుటుంబానికి చెందిన బంధువులు గుంటూరు నుంచి పలుమార్లు మధిర మున్సిపల్‌ కార్యాల యం చుట్టూ తిరిగారు. పైసలిస్తేనే ఆ డెత్‌ సర్టిఫికె ట్‌ ఇస్తామంటున్రాని వారు విలేకరులతో చెప్పా రు. దీనిపై మున్సిపల్‌ కార్యాలయ సిబ్బందిని విలేకరులు.. ‘‘పోలీసులు ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌ ఉండ గా పోస్టుమార్టం రిపోర్టుతో సంబంధమేమిటి? కాజ్‌ ఆఫ్‌ డెత్‌ లేకుండా ఇచ్చే డెత్‌ సర్టిఫికెట్‌కు పోస్టుమార్టం రిపోర్టు ఎందుకు?’’ అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. రెండు మూడు రోజులు తరువాత కొందరు రాజకీయ నాయకులు ఒత్తిడి చేసిన తరువాతనే వారికి డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. 

శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో ఒక ఇల్లు ఉంది. అతని కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్స్‌ తీసుకొచ్చి మున్సిపల్‌ కార్యాలయంలో ఇచ్చారు. మృతుని పేరు మీద ఉన్న ఇంటిని కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చాలని కోరారు. ఇందుకోసం అక్కడి సిబ్బంది రెండువేల రూపాయలు లంచంగా తీసుకున్నారట. డబ్బులు ఇచ్చి నెల దాటినప్పటికీ ఈ రోజుకు కూడా ఆ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు. 
 రెడ్డి గార్డెన్స్‌ కల్యాణ మండపం సమీపంలో ఒకరు నూతనంగా భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం రూ.12వేలు లంచం డిమాండ్‌ చేశారట. 

నూతన కట్టడాల సంగతి చెప్పనక్కరలేదు. రేకుల షెడ్డు నిర్మాణానికి, భవన నిర్మాణానికి, దుకాణం ఏర్పాటుకు, బడ్డీకొట్టు నడుపుకునేందు కు రేట్లు చేసినట్టుగా ఆరోపణలు వినవస్తున్నాయి. పలుకుబడిగల వారికి ఇంటి పన్ను తగ్గిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇంటిపన్ను ఎక్కువ వస్తున్న దని సాధారణ వ్యక్తులు ఫిర్యాదు చేస్తే... ‘‘అందు లో మేము చేసేదేమీ ఉండదు. కంప్యూటర్‌లో కొలతలు నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా పన్ను నిర్థారణతో రశీదు వస్తుంది’’ అని చెబుతున్నారని కొందరు చెప్పారు. అవినీతి తిమింగలాలకు డబ్బులు ముట్టచెప్పలేక కొంతమంది ఇల్లు కట్టుకోలేకుండా, దుకాణాలు నడపలేక చేతులెత్తేసిన దాఖలాలు ఉన్నాయి. 

కమిషనర్‌ వివరణ 

పై ఉదాహరణలను, ఆరోపణలను మున్సిపల్‌ కమిషనర్‌ దేవేందర్‌ దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లింది. ఆయన వివరణ కోరింది. ‘‘ఇక్కడ అవినీతి అనేదే లేదు. కొంతమంది బురద జల్లుతున్నారు. ఎవరైనా అడిగితే నాతో చెప్పండి’’ అని అన్నారు.  

 ప్రక్షాళన చేయాలి 

మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. అధికారులు, సిబ్బంది అడుగుతున్న లంచాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ పని కావాలన్నా డబ్బులు ముట్టచెప్పాల్సిందే. అదేమిటని ప్రజాప్రతినిధులమైన మేము ప్రశ్నిస్తే.. నిబంధనలు అడ్డం వస్తున్నాయని చెబుతున్నారు. కానీ పైసలిస్తే మాత్రం వారికి నిబంధనలు అడ్డురావు. పరిస్థితి దారుణంగా ఉంది. 

– ములకలపల్లి వినయ్‌కుమార్, 15వ వార్డు సభ్యుడు.

మరిన్ని వార్తలు