ముట్టజెప్తేనే.. ముందుకు!

15 Feb, 2020 08:57 IST|Sakshi

జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌లో అక్రమాలు   

ఆన్‌లైన్‌ అయినా అంతులేని ఆమ్యామ్యాలు   

ఆర్కిటెక్టులు ఆడిందే ఆట.. పాడిందే పాట

అధికారులతో యథేచ్ఛగా లాలూచీ

చేయి తడిపితేనే దరఖాస్తులకు మోక్షం  

లేనిపక్షంలో షార్ట్‌ఫాల్స్‌ పేరిట బ్రేక్‌  

ముడుపులిస్తే అదనపు అంతస్తులకూ సై

విచ్చలవిడిగా సాగుతున్న అవినీతి వ్యవహారం  

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ సుభాష్‌నగర్‌ పైపులైన్‌ రోడ్డులోఓ ప్రైవేట్‌ స్కూల్‌ పక్కన మూడు పర్మిషన్లు తీసుకొనిఒకే నిర్మాణం చేపట్టారు. అయితే అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. ఈ నిర్మాణం ద్వారా దాదాపు రూ. 20 లక్షల వరకుజీహెచ్‌ఎంసీకిగండిపడింది.

సాక్షి, సిటీబ్యూరో: లంచం.. లంచం.. లంచం..! జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో ఇది ఇవ్వనిదే పనులు జరగని పరిస్థితి. అన్ని విభాగాలదొక ఎత్తయితే టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలోని లంచం మరో ఎత్తు. పేరుకు డీపీఎంఎస్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుల స్వీకరణ, అనుమతుల జారీ అని చెబుతున్నప్పటికీ పైసలు లేనిదే ఫైలు కదలడం లేదు. దరఖాస్తును ప్లాన్‌తో సహా ఎలా అప్‌లోడ్‌ చేయాలో తెలియని ప్రజలు ఆర్కిటెక్టులను ఆశ్రయిస్తున్నారు. అందుకు ఆర్కిటెక్టులు అందినకాడికి దండుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఏదో ఒక లోపంతో అప్‌లోడ్‌ చేస్తూ.. దాన్ని సరిచేసేందుకు అ‘ధనం’ కావాలని, లేదా అధికారులకు ముడుపులు ముట్టజెప్పనిదే  పని కాదంటూ మరింత దండుకుంటున్నారు. అధికారులకు, ఆర్కిటెక్టులకు లోపాయికారీ సంబంధాల వల్లే ఇది అప్రతిహతంగా సాగుతోంది. అధికారులు సైతం మీనుంచి కాదు.. ఫలానా ఆర్కిటెక్టును సంప్రదించండి అంటూ సలహాలిస్తున్నారు. ఒకవేళ ఎలాగోలా దరఖాస్తు అప్‌లోడ్‌ అయినా అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లరు. అదో తంతు.. ఎటొచ్చీ ఆమ్యామ్యాలు ముట్టజెప్పనిదే అనుమతులు రావడం లేదు. గ్రేటర్‌ పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ భవన నిర్మాణాలు జరుగుతున్నా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, ఉప్పల్, అల్వాల్‌ సర్కిళ్లలో నిర్మాణాల జోరు ఎక్కువగా ఉంది.

ముడుపుల దారిలో..  
చెక్‌లిస్టుకనుగుణంగా అన్ని పత్రాలు సవ్యంగా లేవని, షార్ట్‌ఫాల్స్‌ ఉన్నాయంటూ బేరసారాలు మొదలవుతాయి. వివిధ ప్రాంతాల్లో చేతులు మారే లంచాల అంచనాతో చెల్లించుకోవాల్సిన ముడుపులు వివిధ స్థాయిల్లో సగటున ఇలా ఉన్నాయి. దరఖాస్తు ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు ఆర్కిటెక్టు కోరినంత. ఆ తర్వాత సైట్‌ తనిఖీకి రావాలంటే సర్కిల్,జోన్లలో రూ. 50 వేల నుంచి  లక్షరూపాయలు చెల్లించుకోవాలి. లోటుపాట్లున్నాయంటూ మరికొంత దండుకుంటారు. ఇవి అనుమతి పొందేందుకు. ఇక అనుమతి తీసుకోకుండానే జరుగుతున్న నిర్మాణాలకు లెక్కేలేదు. నగరంలో దాదాపు 80 శాతం మంది అనుమతి పొందిన దానికంటే అదనంగాఒకటినుంచి మూడు నాలుగంతస్తుల వరకు నిర్మిస్తున్నారు. ఇలాంటి వాటికి ప్రాంతం డిమాండ్, బిల్టప్‌ ఏరియాను బట్టి లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చేతులు మారుతున్నాయని విషయం తెలిసిన వారుచెబుతున్నారు. 

అపాయానికి తరుణోపాయం..
ఇక అక్రమ సెల్లార్లకు, పెంట్‌హౌస్‌లకు స్పెషల్‌ రేట్లు. అధికారులతో మిలాఖత్‌ అయితే అక్రమ నిర్మాణాలు కూల్చివేయకుండా తరుణోపాయాలు కూడా వారే వివరించడం చాలామందికి  తెలిసిన విషయం. ఫిర్యాదులు రాగానే అప్రమత్తం చేస్తారు. ఫిర్యాదుదారుతో బేరసారాలకు దిగేలా చేస్తారు. వినకపోతే.. కోర్టులకు వెళ్లి ఎలా స్టేలు తెచ్చుకోవచ్చో వివరిస్తారు. సంబంధిత లాయర్‌నూ తామే సూచిస్తారు. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌లలోనూ మెజారిటీ లాయర్లు అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తారనే ఆరోపణలున్నాయి. వారివల్లే భారీ ఆదాయం వస్తుంది కనుక జీహెచ్‌ఎంసీకి అనుకూలంగా వాదించరు. చాలామంది ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు సైతం అక్రమ నిర్మాణాలకే తమవంతు చేయూతనిస్తారు. అధికారులతో మాట్లాడి తమ వాటా తాము తీసుకుంటారు. ఇక గురుకుల్‌ ట్రస్ట్‌ వంటి వివాదాల ప్రాంతాల్లో అధికారులకు ఎప్పుడు డబ్బులవసరమైతే అప్పుడు అవి కామధేనువులవుతాయి. కూల్చివేతలంటూ బెదిరించి అందినకాడికి దండుకుంటారనే ఆరోపణలున్నాయి. ఇలా ఎవరికి అవకాశం ఉన్నంత మేరకు వారు జేబులు నింపుకొంటున్నారు. భారీ నిర్మాణాలు, బహుళ అంతస్తులు తప్ప ఐదంతస్తుల వరకు జోన్లు, సర్కిళ్లలోనే అనుమతుల అధికారం ఉండటంతో అక్కడి అధికారులు ఆడింది ఆటగా.. పాడింది పాటగా సాగుతోంది. మరోవైపు దరఖాస్తును అప్‌లోడ్‌ చేసేటప్పుడు ఆర్కిటెక్టులు యజమాని ఫోన్‌నంబర్‌ బదులు తమ ఫోన్‌నంబర్లే ఇస్తున్నారు. దీంతో తదుపరి సమాచారం వారికే వెళ్తుంది. దీనిని ఆసరా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు.

మాయాజాలం..
ఆన్‌లైన్‌ వచ్చినా అధికారులు, ఆర్కిటెక్టుల మాయాజాలంతో అవినీతి ఆగడంలేదు. జోన్లు, సర్కిళ్లలో పరిస్థితి అలా ఉండగా, ప్రధాన కార్యాలయానికి సాధారణంగా బడా బిల్డర్లే వస్తారు  కనుక అధికారులకు, వారికి నడుమ పరస్పర సహకారం, అవినాభావ సంబంధాలు కొనసాగుతుంటాయి.

అక్రమ నిర్మాణదారులకు అండగా..
ప్రజల కళ్ల ఎదుటే అనుమతి లేని భవనాలు అంతస్తులకు అంతస్తులుగా వెలుస్తుండటం కనిపిస్తున్నా టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు మాత్రం ఇవేవీ పట్టవు. జీహెచ్‌ఎంసీకి అందే ఫిర్యాదుల్లో 90 శాతం ఈ విభాగానివే. మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా ఆదేశిస్తేనో, కోర్టులు అక్షింతలు వేస్తేనో లేదా సామాజిక కార్యకర్తలు వదలకుండా వెంటపడి, విస్తృతంగా ప్రచారం చేస్తేనే తప్ప అక్రమ నిర్మాణాలను కూల్చడం లేరు. హుస్సేన్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌లో ఓ భారీ సంస్థ నిర్మించిన భవనాలను కూల్చడం ఇటీవలి నిదర్శనం. దాని సమీపప్రాంతాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని రెవెన్యూశాఖ ఆదేశాలు ఉన్నా దర్జాగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదులకు స్పందనగా తూతూమంత్రంగా కేవలం చిన్నపాటి రంధ్రాలు చేసి, అక్రమ నిర్మాణాలకు దన్నుగా నిలవడం సంప్రదాయంగా మారింది. ఈ వ్యవహారాల్లో ఉన్నతాధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. ఆన్‌లైన్‌లోనే అనుమతులైనా, నోటీసులు ఆన్‌లైన్‌ ద్వారానే జారీ అయినా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఎక్కడ జరగాల్సిన తతంగం అక్కడ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

మరిన్ని వార్తలు