రెవెన్యూ కార్యాలయం లంచాలకు అడ్డా..

23 May, 2020 12:26 IST|Sakshi
తిరుమలగిరి : డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ మండల రెవెన్యూ కార్యాలయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితురాలి కూతురు

తిరుమలగిరి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది తీరుపై విమర్శలు

ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వారికే వత్తాసు

లంచం తీసుకుని మోసం చేశారని బాధితురాలి ఆవేదన

కార్యాలయానికి వచ్చి నిలదీసిన వైనం

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌) : నాగార్జునసాగర్‌ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండల రెవెన్యూ కార్యాలయంలంచాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ చేయి తడపనిదే పనికాదని... ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించినట్లు చెబుతున్నారు. తాజాగా ఓ మహిళకు వారసత్వంగా వచ్చిన భూమికి డబ్బులు తీసుకుని ధ్రువీకరణపత్రం, పట్టాపాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. ఆమె భర్త బంధువులు రంగప్రవేశం చేసి అధిక డబ్బులు ఆశచూపడంతో సదరు అధికారి ఆ భూమిపై మెలిక పెట్టి వివాదాస్పదంగా ఉందని హక్కుదారుకు నోటీసులు ఇచ్చారు. దీంతో బాధితురాలు కార్యాలయానికి చేరుకుని అధికారిని నిలదీసింది.

దీనికి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. అనుముల మండలం మల్గిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మల్గిరెడ్డి లక్ష్మమ్మకు తిరుమలగిరి శివారులో సుమారు 7 ఎకరాల భూమి ఉంది. దీంతోపాటు సర్వేనంబర్లు 82, 83లో 2.28గుంటల భూమి వంశపారంపర్యంగా సంక్రమించింది. సర్వేనంబర్‌ 84లో 1.20 గుంటలను సొంతంగా కొనుగోలు చేసింది. మొత్తం 4 ఎకరాల 8 గుంటల భూమిని పట్టా చేసేందుకు మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. చివరకు రూ.లక్షకు బేరం కుదిరింది. దీంతో లక్ష్మమ్మకు భూమికి సంబంధించి ప్రొసీడింగ్‌ ఆర్డర్, ధ్రువీకరణపత్రం ఇచ్చారు. మొత్తం 4ఎకరాల8గుంటల భూమిని పట్టా చేయించుకుంది. పాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. విషయం తెలుసుకున్నలక్ష్మమ్మ  బంధువులు రంగంలోకి దిగారు. భూమిపై మెలిక పెట్టేందుకు సదరు రెవెన్యూ అధికారిని కలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే 82, 83 సర్వేనంబర్లలోని 2ఎకరాల 28 గుంటల భూమి వివాదాస్పదంగా ఉందని ఈ నెల 11వ తేదీన మల్గిరెడ్డి
లక్ష్మమ్మకు తహసీల్దార్‌ నోటీసులు అందజేసింది. దీంతో బాధితురాలు తన కూతురుతో కలిసి శుక్రవారం కార్యాలయానికి  వెళ్లి సదరు అధికారిని ప్రశ్నించింది. ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది మీరే కదా అని అడగగా ‘నేను చూడకుండా పెట్టానని, ఆ భూమిపై నీకు హక్కు లేదని, ఎవరికి ఫిర్యాదు చేస్తావో చేసుకో’’ అంటూ దబాయించింది. ఇదే అదునుగా స్థానిక నేతలు రంగంలోకి దిగారు. బేరసారాలకు తెరలేపారు. బాధితురాలు ఎంతకీ  ఒప్పుకోలేదు. తాను రూ.లక్ష నష్టపోవడమే కాకుండా ఉన్న భూమిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని బాధితురాలు అక్కడే ఉన్న అధికారులు, విలేకరుల ఎదుట వాపోయింది. తనకు డబ్బు ముఖ్యం కాదని, తన భూమి తనకు ఉంటే చాలని కన్నీటిపర్యంతమైంది.

మా భూమి మాకే కావాలి
నా భర్త అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో రైతుబంధు సాయం ప్రభుత్వం ప్రకటించడంతో మేము గ్రామానికి వచ్చాం. నా భర్త చనిపోయిన తరువాత భూమి సర్వే నంబర్ల వివరాలు తెలియక రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాం. రూ. లక్ష లంచం తీసుకొని ప్రొసీడింగ్‌ కాపీని అందజేశారు. పట్టాదార్‌ పాస్‌పుస్తకం కూడా వచ్చింది. ఇప్పుడు ప్రొసీడింగ్‌ నేను ఇవ్వలేదంటూ తహసీల్దార్‌ ఇబ్బందులకు గురిచేస్తున్నారు.– మల్గిరెడ్డి లక్ష్మమ్మ, బాధితురాలు, మల్గిరెడ్డిగూడెం

నిబంధనల ప్రకారమే నడుచుకున్నా..
పట్టా్టదారు జమీన్లకు పాస్‌ పుస్తకాలను జారీ చేస్తున్నా. నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. అన్ని పనులు నిబంధనల ప్రకారమే పూర్తి చేస్తున్నా. మల్గిరెడ్డి లక్ష్మమ్మఎవరో నాకు తెలియదు. నాపై నింద వేస్తున్నారు. ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే.– కేసీ ప్రమీల తహసీల్దార్, తిరుమలగిరి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా