సరిహద్దుల్లో చేతివాటం!

18 Jul, 2019 08:42 IST|Sakshi
కృష్ణ దగ్గర ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టు

ఆర్టీఏ, ఆబ్కారీ చెక్‌పోస్టుల్లో పెరుగుతున్న వసూళ్ల పర్వం 

చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు 

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లా సరిహద్దులో కృష్ణ చెక్‌పోస్టు మాముళ్లకు అడ్డాగా మారింది. ఇక్కడ ఆర్టీఏ శాఖ, ఆబ్కారీ శాఖల తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం జీఎస్టీ అమల్లోకి రావడంతో ఇక్కడ వాణిజ్య పన్నుల శాఖను ఎత్తివేశారు. ప్రస్తుతం ఉన్న శాఖలు చెక్‌పోస్టులను అడ్డాలుగా మార్చుకొని చేతివాటం ప్రదర్శిస్తున్నాయి. పైకం అందిస్తే చాలు ఏ వాహనమైనా దర్జాగా తరలిపోయే పరిస్థితి కొనసాగుతోంది. చెక్‌పోస్ట్‌లో రవాణాశాఖకు సంబంధించి ఎంవీఐ, ఏఎంవీఐలుతో పాటు ఇతర సిబ్బంది విధులు ని ర్వహిస్తున్నారు. 24గంటలకో ఒక బృందం షిప్ట్‌ల పద్ధతిలో మారుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి అటు ఇటు సరకులు తీసుకెళ్లే వాహనాలు తప్పనిసరిగా ఇక్కడ ఆగి పత్రాలపై ముద్ర వేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది. వాహనాల్లో ఏ సరుకు, ఎంత మేర సామర్థ్యంతో రవాణా అవుతుందో తనిఖీ చేయడం, పత్రాలు సరిచూడటం ఇక్కడివారి బాధ్యత. 

అసలు ఏం చేస్తున్నారు.. 
తనిఖీ కేంద్రం వద్ద వాహనం ఆగగానే సంబంధిత డ్రైవర్‌ అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి కాగితాలు చూపుతాడు. స్థాయిని బట్టి సొమ్ము చేతిలో ఉంచగానే వాహనాన్ని ముందుకు పంపిస్తారు. ఇందుకు ప్రైవేట్‌ వ్యక్తులు సహాయంగా ఉంటారు. సహకరించినందుకు వారికి కొంత వాటా ఇవ్వడం జరుగుతుంది.

 ఆబ్కారీ ఆగడాలే వేరు 
ఆబ్కారీ ఆగడాలకు అదుపేలేకుండా పోతోంది. మహారాష్ట్ర, రాయిచూర్, యాదగిరి తదితర పట్టణాల నుంచి తెలంగాణలో మద్యం తయారీకి సంబంధించిన ముడి సరకు ట్యాంకర్లు వస్తుంటాయి. వీటికి అన్ని అనుమతులు ఉన్నా ఇక్కడ ఎంతో కొంత రాబడుతుంటారు. దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి చేస్తున్న సమయంలో కూడా అధికారులు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా జిల్లాను సారా రహిత జిల్లాగా మార్చిన తర్వాత జిల్లాలో సారా తయారీ చాలా వరకు తగ్గించారు. కానీ సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లాకు నాటుసారాను తరలిస్తున్నారు. ఈ క్రమంలో చెక్‌పోస్టు దగ్గర అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక్కడ పోస్టింగ్‌కు భలే డిమాండ్‌.
కృష్ణ చెక్‌పోస్టు వద్ద పని చేసేందుకు ఎక్కవ మంది అధికారులు ఆసక్తి చూపుతారు. ఇక్కడ విధుల నిర్వహణ అదృష్టంగా భావిస్తారు. పోస్టింగ్‌ రావడానికి లేదా డిప్యూటేషన్‌పై పని చేయడానికి పై అధికారులను ప్రసన్నం చేసుకొని మరీ పోస్టింగ్‌లు పొందుతుంటారు.  

మరిన్ని వార్తలు