ఇటుక మాఫియా!

12 Feb, 2018 15:13 IST|Sakshi
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ అధికారులు గుర్తించిన బాల కార్మికులు

వలస కూలీల నిర్బంధం

కొట్టినా.. తిట్టినా.. దిక్కు లేదు

బట్టీలు దాటేది లేదు

లోనికి వెళ్లే ధైర్యం లేదు

స్థానిక అధికారులే వత్తాసు

చెలరేగిపోతున్న బట్టీ యజమానులు

‘కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది..యజమానులు మోబైల్‌ ఫోన్లు లాక్కున్నారట.. బయటకు వెళ్లొద్దట.. ఎవరితోనూ మాట్లాడొద్దట.. పనిచేసేది ఎక్కువ...వేతనం తక్కువ.. పైగా తిట్టడం.. కొట్టడం.. పరిస్థితి దుర్భరంగా ఉంది.’ ఇది ఇటీవల పెద్దపల్లికి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లేబర్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ మండలేశ్వర్‌ ఇటుకబట్టీల్లో వలస కూలీల దుస్థితిపై వెలిబుచ్చి న ఆవేదన. రాఘవాపూర్‌లోని ఏబీఎస్‌ బ్రిక్‌ ఇండస్ట్రీ ఒక్క ఇటుకబట్టీని చూసి ఆయన చెప్పిన అభిప్రాయం జిల్లాలోని మెజార్టీ ఇటుక బట్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

సాక్షి, పెద్దపల్లి: సాధారణంగా ల్యాండ్, సాండ్‌ మాఫియాను ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. ఇటుక మాఫియా ఆగడాలు అంతా ఇంతా కావు. జిల్లాలో దాదాపు 70 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఈ బట్టీల్లో కనీసం ఐదు నుంచి ఆరు వేల మంది ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన, స్థానికంగా పలుకుబడి ఉన్న వాళ్లు ఇటుకబట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించే వాళ్లు కొద్ది మందే. కానీ.. మెజార్టీ బట్టీల్లో నిబంధనల ఊసే ఉండదు. కార్మిక చట్టాల మాటే తెలవదు. వలస కార్మికులు కావడంతో వెట్టిచాకిరి ఇక్కడ సర్వసాధారణంగా మారింది. కార్మికులు కుటుంబాలతో వస్తారు కాబట్టి, పిల్లలుంటారని  పైకిచెబుతున్నా.. ఆ బాలలను కార్మికులుగా మార్చే ఘనత ఇటుక బట్టీల యజమానులదే. కనీస వేతనం అనే పదమే ఇక్కడ వినిపించదు. వారిచ్చిందే వేతనం.. చెప్పిందే శాసనం. వినని కార్మికులను చితకబాదడం ఇక్కడి యజమానుల నైజం. దౌర్జన్యాలు నిత్యకృత్యం. గతంలో లైంగిక దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి.

ఇక్కడి ఇటుక ఉభయరాష్ట్రాల మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో, కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా ఇక్కడి నుంచి ఇటుకలు వెళుతుండడం డిమాండ్‌ను తెలియచేస్తోంది. కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుండడం, బట్టీల్లో అకృత్యాలు నిత్య కృత్యం కావడంతో వీరికి స్థానిక నాయకుల నుంచి జాతీయస్థాయి నేతల వరకు అందరితోనూ సత్సంబంధాలుంటాయి. ఇటుకబట్టీలకెవరైనా వెళ్తే ఆ బెదిరింపులు సామాన్యంగా ఉండవు. అసలు ఇటుక బట్టీల లోపలికి వెళ్లడమే అసాధ్యం. లోనికి అడుగు పెట్టగానే, అనుమానపు చూపులు వెంటాడుతుంటాయి. ఆ వెంటనే పదుల సంఖ్యలో వచ్చి చుట్టుముడుతారు. ఎందుకు వచ్చారు? ఏం కావాలంటూ ఉచ్చస్వరంతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఫొటోలు తీస్తే .. ఆ కెమెరాతో బయటకు వెళ్లడం మరిచిపోవాల్సిందే. వెళ్లిన వాళ్లకు సంబంధించిన పైస్థాయి నుంచి క్షణాల్లో ఫోన్లు వస్తుంటాయి. దౌర్జన్యాలకు పాల్పడుతారు.  ఇటుకబట్టీలకు వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు.

అధికారులకు మామూలే...
కార్మిక చట్టాలను అమలు చేస్తూ,  కార్మికుల సంక్షేమాన్ని  చూడాల్సిన, దౌర్జన్యాలను అరికట్టాల్సిన అధికారులు ఇటుక మాఫియాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. నిర్బంధ కార్మికులకు విముక్తి కల్పించడానికి ఛత్తీస్‌గఢ్‌ బృందం వచ్చినప్పుడు, స్థానిక అధికారులు వ్యవహరించిన తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కార్మికులను తీసుకెళ్లకుండా ఛత్తీస్‌గఢ్‌ బృందాన్ని నిలువరించేందుకు ఆ అధికారులు పడినపాట్లు  చూసి ఇతర అధికారులే విస్మయానికి గురయ్యారు. అడ్వాన్స్‌లు తీసుకొన్న కార్మికులను పంపొద్దంటూ ఛత్తీస్‌గఢ్‌ అధికారులను కూడా ఆ అధికారులు ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చివరకు జిల్లా సంక్షేమశాఖాధికారులు వారితో స్వల్ప వాదనకు కూడా దిగడం విశేషం. బాలకార్మికులు కనిపించడంతో ‘వాళ్లు లంచ్‌కు ఇంటికి వచ్చుంటారేమో’ అని నమ్మబలికేందుకు చేసిన ప్రయత్నాన్ని సహచర అధికారులే ఈసడించుకున్నారు. ఇదంతా చూసి, ఇటుకబట్టీ యజమానుల కన్నా... ఆ అధికారులకే ఎక్కువ బాధ ఉన్నట్లుందంటూ వ్యాఖ్యానించడం వినిపించింది. ఇటుకబట్టీల్లో  కార్మికుల నిర్బంధం కొంతమంది అధికారులకు ఎందుకు మామూలో ఊహించడం పెద్ద కష్టం కాదు.

పరాయి రాష్ట్రం చెప్పినా మేల్కొనరా?
జిల్లాలోని  ఇటుకబట్టీల్లో కార్మికులతో నిర్బంధంగా వెట్టిచాకిరి చేయించుకొంటున్నారని పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన బృందం చెప్పినా, ఇక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి అధికారులు, పోలీసులు వచ్చి, ఇక్కడి ఇటుకబట్టీల నుంచి కార్మికులను విడిపించుకొని తీసుకెళ్లడం స్థానిక పాలనకు అవమానకరంగా పలువురు పేర్కొంటున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చి తెచ్చుకున్నాం, బాలలు బడికి వెళుతున్నారు అంటూ యజమానులు ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. బట్టీల్లో వాతావరణానికి వారి మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వ్యాపారానికి కార్మికులు అవసరమే అయినా... వారికి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సౌకర్యాలు, కనీస వేతనాలు, బాలలకు చదువు చెప్పిస్తే ఎలాంటి సమస్యా ఉండదు కదా అని కొంతమంది అధికారులు సలహా ఇస్తున్నారు.
 

మరిన్ని వార్తలు