వివాహ వేడుకలో ఘర్షణ

2 Nov, 2019 13:06 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : వివాహ వేడుక అనంతరం నిర్వహించే బరాత్‌లో వరుడు తరఫువారు డీజే సాంగ్స్‌ పెట్టి డ్యాన్స్‌లు వేద్దామని, వధువు తరఫు వారు వద్దని అనడంతో చిన్నగా మొదలైన ఘర్షణ చినికిచినికి గాలి వానలా మారింది.  ఈ ఘర్షణను కొందరు వీడియోలు తీసి వాట్సప్, ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో  అది వైరల్‌గా మారి హల్‌చల్‌ చేస్తోంది. వివరాలు..మూడు రోజుల క్రితం మండల పరిధిలోని తొగర్రాయిలో బొంతలు కుట్టి జీవనం సాగించే వారి కుటుంబంలో వివాహం జరిగింది. వరుడిది కోదాడ కాగా వధువుది ప్రకాశం జిల్లా. వివాహ అనంతరం డిజే ఏర్పాటు చేసి బరాత్‌ నిర్వహించేందుకు వరుడు బంధువులు, స్నేహితులు సిద్ధమయ్యారు. వధువు తరఫు వారు మాత్రం తమ ఊరు చాలా దూరమని డీజే వద్దని అనడంతో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది.

ఈ క్రమంలో మాటామాటా పెరిగి అక్కడ ఉన్న కుర్చీలు, కర్రలు తీసుకుని ఒకరిపై దాడి చేసుకోవడం ప్రారంభించారు. మహిళలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంత వరకు వెళ్లారు. దీంతో స్థానికులు 100కు కాల్‌ చేసి సమాచారం ఇవ్వడంతో రూరల్‌ పోలీసులకు అక్కడకు చేరుకుని ఘర్షణ చేస్తున్న వారిని చెదరగొట్టారు. సినిమాలో జరిగే ఫైట్‌ మాదిరిగా జరుగుతున్న ఈ ఘర్షణను అక్కడే ఉన్న కొందరు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌ అయింది. ఈ ఘర్షణలో ఇరు వర్గాలకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి.  ఈ విషయంపై రూరల్‌ పోలీసులను సంప్రదించగా ఘర్షణ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఎవరు ఫిర్యాదు కూడా చేయలేదని తెలిపారు.  

మరిన్ని వార్తలు