వారిద్దరూ మాటల మాయగాళ్లు

22 Nov, 2018 12:36 IST|Sakshi
ముదిగొండ బహిరంగ సభలో మాట్లాడుతున్న బృందాకారత్‌

దేశం, రాష్ట్రాన్నిదోచుకుంటున్న మోదీ, కేసీఆర్‌ 

ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన ఘనులు 

ప్రత్యామ్నాయం కోసమే సీపీఎం, బీఎల్‌ఎఫ్‌

కొణిజర్ల, ముదిగొండ బహిరంగ సభల్లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌  

సాక్షి, కొణిజర్ల/ముదిగొండ: ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇద్దరూ మాటలతో గారడీ చేసే మాయగాళ్లని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ వైరా, మధిర నియోజకవర్గాల పరిధిలోని కొణిజర్ల, ముదిగొండ మండల కేంద్రాల్లో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న పరిస్థితులు ఉన్నాయని, అధికారం, సొంత ప్రయోజనాల కోసమే మహాకూటమి ఏర్పడిందన్నారు. కేసీఆర్‌.. ప్రధాని మోదీని, ఢిల్లీలో తన స్నేహితులను ప్రసన్నం చేసుకునేందుకు ఎనిమిది నెలల ముందుగానే ఎన్నికలకు పోయారన్నా రు. భవిష్యత్‌లో తెలంగాణ ప్రజలు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలంటే మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలను ఓడించాలన్నారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు గుప్పించి.. అధికారం చేపట్టిన తర్వాత వాటిని తుంగలో తొక్కారని, మళ్లీ ఎన్నికలు రాగానే కొత్త హామీలతో ప్రజల ముందుకొస్తున్నారన్నారు.

ముదిగొండ సభకు హాజరైన కార్యకర్తలు

కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రుణమాఫీ చేస్తే, కేసీఆర్‌ నాలుగున్నరేళ్లయినా చేయలేకపోయాడన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో కేసీఆర్‌ వంద గదుల ఇల్లు కట్టుకున్నాడని, రాష్ట్రంలోని నిరుపేదలకు మాత్రం రెండు గదుల ఇల్లు కూడా కట్టించి ఇవ్వలేకపోయాడన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా, దళితులు, మైనార్టీలు, ఆదివాసీలు, మహిళల హక్కుల కోసం, ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల కోసం సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ కూటమి పోరాడుతుందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు అనుసరిస్తున్న విధానాలను తిప్పికొట్టాలని, టీఆర్‌ఎస్‌ ద్రోహిగా నిలిచి పేదలను మోసం చేసిన వ్యక్తికి ఓట్లు వేయొద్దని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకుల మొసలి కన్నీరును నమ్మొద్దన్నారు. వితంతువులకు రూ.5వేల పింఛన్‌ ఇవ్వాలని, యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలు బీఎల్‌ఎఫ్‌తోనే సాధ్యమని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో మార్పు గాలి వీస్తోందన్నారు. వైరా, మధిర సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు భూక్యా వీరభద్రం, కోట రాంబాబుకు ఓటు వేసి గెలిపిస్తే పోడు సాగుదారుల సమస్యలు, మహిళా, కూలీల సమస్యలపై పోరాడుతారన్నారు. 

కొణిజర్ల సభకు హాజరైన కార్యకర్తలు 
వడ్లమూడి నాగేశ్వరరావు, వాసిరెడ్డి వరప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థులు భూక్యా వీరభద్రం, కోట రాంబాబు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరారావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు పొన్నం వెంకటేశ్వర్లు, సామాజిక కార్యకర్త దేవి, వ్యవసాయ కార్మిక సం«ఘం రాష్ట్ర అధ్యక్షుడు బుర్రి ప్రసాద్, నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, బొంతు రాంబాబు, తాళ్లపల్లి కృష్ణ, వైరా, కొణిజర్ల ఎంపీపీలు బొంతు సమత, వడ్లమూడి ఉమారాణి, కొణిజర్ల మండల ఇన్‌చార్జి గట్టు రమాదేవి, కొప్పుల కృష్ణయ్య, బండి పద్మ, ఇరుకు నాగేశ్వరరావు, భట్టు పురుషోత్తం, ప్రభావతి, ఎం.వెంకటేశ్వర్లు, దామోదర్‌ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు