విశ్రాంతి.. పెద్ద భ్రాంతి!

26 May, 2016 01:08 IST|Sakshi

పంట తీసుకొచ్చే రైతులకు నిలువనీడ కరువు
రూ.2000 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్నా.. ఫలితం సున్నా

బస్తాలపై, చెట్ల నీడలో సేదతీరుతున్న అన్నదాతలు

 

ఆసియూ ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌లో విశ్రాంతి భవనాల లేమి

 

వరంగల్ సిటీ: ఆసియూ ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అది. దేశంలోనే ఏకైక రెగ్యులేటరీ మార్కెట్ కూడా అదే. అధికారిక లెక్కల ప్రకారం.. సంవత్సరానికి రూ.2000 కోట్ల వ్యాపార లావాదేవీలకు నెలవు. అనధికారికంగా మరో రూ.2000 కోట్ల వ్యాపార కార్యకలాపాలు జరుగుతుంటారుు. ఇంత గొప్ప ‘ఘణా’ంకాలు,  ఘన కీర్తి ఉన్నా.. వరంగల్ మార్కెట్‌లో అన్నదాతలకు మండుటెండల్లో నిలువ నీడ దొరకడం లేదు. దీంతో దాని పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్న చందంగా తయూరైంది. అభివృద్ధి పనులకు ఎన్నో నిధులు వెచ్చించినా.. ఇప్పటిదాకా మార్కెట్లో రైతుల కోసం విశ్రాంతి భవనాలను నిర్మించలేదు. ఈ కారణంగా ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ తాము మార్కెట్‌కు తీసుకొచ్చే పంట బస్తాలపైన, చెట్ల నీడన రైతులు సేదతీరుతున్నారు. అందరికీ కూడుపెట్టే అన్నదాతల సౌకర్యార్ధం విశ్రాంతి భవనాలను నిర్మించాల్సిన అవసరముందని రైతులోకం అభిప్రాయపడుతోంది.

 

గౌరవించే సంస్కారం లేదు
రైతులతో అటు ప్రభుత్వానికి, ఇటు మార్కెట్ అధికారులకు ఏం అవసరం ? మా పంట వ్యాపారులకు కావాలి. అందులో అందరికీ వాటాలు కావాలి. అంతే తప్ప రైతులను గౌరవించే సంస్కారం మార్కెటింగ్ శాఖలో లేదు. అందుకే మార్కెట్‌లో విశ్రాంతి భవనాలు కట్టడం లేదు. - అరికాల రాజలింగం, పత్తి రైతు

 

నీళ్లు కొనుక్కోవాలి.. నీడ వెతుక్కోవాలి
అందరికి అన్నం పెట్టే రైతులం వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు పంట తీసుకొచ్చినప్పుడు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. నీరు కొని తాగాల్సి వస్తోంది. ఈ మండుటెండల్లో నీడనిచ్చే ప్రదేశం మార్కెట్‌లో లేదు. దీంతో చెట్లు ఎక్కడున్నాయూ అంటూ వెతుక్కోవాల్సి వస్తోంది. చెట్ల నీడనే సేదతీరుతున్నాం. విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

 - ఎలకంటి సుదర్శన్‌రెడ్డి, మక్క రైతు

 

వారిది స్వార్ధం.. మాది నిస్వార్ధం
మేం తెచ్చిన పంట కొని వ్యాపారులు లాభపడుతారు. వ్యవసాయ మార్కెట్‌లో పనిచేసే అధికారులకు వేలాది రూపాయల జీతాలు వస్తారుు. మేం మట్టిని నమ్ముకొని.. రాత్రనక, పగలనక కష్టపడి, నిద్రాహారాలు మాని పండించిన పంట మాత్రం వాళ్లకు కావాలి. మా సంక్షేమం అక్కర్లేదు. వాళ్లది కచ్చితంగా స్వార్ధమే. మాది నిస్వార్ధం. - ముదిరి మల్లయ్య, వేరుశనగ రైతు

 

విశ్రాంతి భవనం, మహిళా రైతు భవనం నిర్మాణానికి ప్రయత్నాలు
వరంగల్ మార్కెట్‌లోని అన్ని యార్డుల్లో రైతులకు విశ్రాంతి భవనం, మహిళా రైతు భవనం నిర్మించాలని భావిస్తున్నాం. ఇందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. మరుగుదొడ్లు, మంచినీటి వసతిని త్వరలో అందుబాటులోకి తెస్తాం.  - అజ్మీరా రాజు, మార్కెట్ కార్యదర్శి

 

ప్రజాప్రతినిధులు చొరవచూపాలి
మా చెమట చుక్కలతోనే వ్యవసాయ మార్కెట్ వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయూన్ని విస్మరించి అధికారులు,వ్యాపారులు ప్రవర్తిస్తున్నారు. కనీసం ప్రజాప్రతినిధులైనా చొరవ చూపి రైతుల కోసం వరంగల్ మార్కెట్‌లో విశ్రాంతి భవనం నిర్మాణం జరిగేలా చూడాలి.  - ఆర్.శంకర్‌రావు, పత్తి రైతు

మరిన్ని వార్తలు