వెదర్‌ రిపోర్ట్‌ ఇక ఈజీ 

3 Feb, 2019 03:29 IST|Sakshi

అన్ని జిల్లాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డుల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల్లో, గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) జోనల్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్‌) ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేయనుంది. శనివారం ఈ మేరకు సచివాలయంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా జిల్లాల అధికారులు ప్రజలకు సూచనలు చేస్తారన్నారు. ఈ ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులతో రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులే కాకుండా వచ్చే 3 రోజుల ముందస్తు వాతావరణ పరిస్థితులను సైతం తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 924 ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్ల ద్వారా అన్ని ప్రాంతాల వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు రికార్డు చేసి, టీఎస్‌డీపీఎస్‌ అధికార వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంచనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు.   

మరిన్ని వార్తలు