నిర్లక్ష్యంపై జీహెచ్‌ఎంసీకి బ్రిటిష్‌ కమిషనర్‌ ట్వీట్‌ 

29 Oct, 2018 02:27 IST|Sakshi

హైదరాబాద్‌: భవన నిర్మాణంలో జరుగుతున్న అంతులేని నిర్లక్ష్యంపై బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ జీహెచ్‌ఎంసీ అధికారులకు ట్వీట్‌ చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లో తాను నివసిస్తున్న ప్రాంతంలో గతేడాది కాలం నుంచి నిరంతరాయంగా ఓ భవన నిర్మాణం జరుగుతోందని, రేయింబవళ్లు జరుగుతున్న ఈ నిర్మాణం వల్ల స్థానికంగా శబ్ద, వాయు కాలుష్యం ఏర్పడుతోందని తెలిపారు. ఇవన్నీ నిబంధనల ఉల్లంఘన కిందే వస్తాయని ఆయన ట్వీట్‌ చేశారు. అలాగే ఆదివారం కూడా పనులు చేస్తూ నిబంధనలు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై జీహెచ్‌ఎంసీకి ఆన్‌లైన్‌లో పలుమార్లు తాను ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదన్నారు.

తన నివాసం శబ్ద కాలుష్యానికి దూరంగా ఉండటంతో పెద్దగా ఇబ్బంది పడటం లేదని, అయితే చుట్టుపక్కల వారు మాత్రం  శబ్ద, వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు మార్బుల్‌ తీసుకొచ్చే లారీలతోపాటు అన్‌లోడింగ్‌ చేసే సిబ్బంది అరుపులు, కేకలు చుట్టుపక్కల వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని అన్నారు. తాను ఒక హోదాలో ఉన్నాను కాబట్టి ఈ విషయాలు చెప్పగలుగుతున్నానని, ఒక సామాన్యుడు ఎలా చెప్పగలుగుతాడని అన్నారు. అసలు జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం పనులు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలుండవా అని నిలదీశారు. ఆదివారం ఉదయం ఆయన ట్వీట్‌ చేయగా.. సాయంత్రం వరకు కూడా ఏ ఒక్క అధికారి స్పందించకపోవడం గమనార్హం. 

మరిన్ని వార్తలు