విరిగిన మూసీ ప్రాజెక్టు గేటు

6 Oct, 2019 02:41 IST|Sakshi

వృథాగా దిగువకు నీరు

గేటును సరిచేసేందుకు చర్యలు చేపట్టిన అధికారుల

కేతేపల్లి:నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఉన్న మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఓ రెగ్యులేటరీ గేట్‌ విరిగిపోయింది. దీంతో దిగువకు 5వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. 20 రోజులుగా హైదరాబాద్‌తో పాటు వరంగల్, జనగాం ప్రాంతాలలో కురిసిన వర్షాలకు మూసీ బిక్కేరు, వసంత వాగు ద్వారా మూసీ ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరదనీరు వచ్చింది. ప్రాజె క్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులకు చేరడంతో 2 గేట్లను కూడా ఎత్తారు. నీటిమట్టం 644.5 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూసి మూసివేశారు. శనివారం సాయంత్రం 1,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా నీటిమట్టం 644.8 అడుగులకు చేరుకుంది. కాగా, రాత్రి 7 గంటల సమయంలో 6వ నంబర్‌ రెగ్యులేటరీ గేటు విరిగిపోయింది. ఈ గేటు ఇరువైపులా ఉన్న గొలుసు ఆధారంతో వేలాడుతోంది. గేట్‌ విరగడంతో దాదాపు 5వేల క్యూసెక్కుల మేర నీరు వృథాగా దిగువకు పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెల్లవారే సరికి ప్రాజెక్టులో ఐదారడుగుల మేర నీటిమట్టం తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మూసీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. నీటిపారుదల శాఖ ఈఈ భద్రునాయక్, ఇతర ఇంజనీరింగ్‌ సిబ్బందితో సమావేశమై గేటును సరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు