బాలింత రక్తనాళంలో విరిగిన సూది

10 Nov, 2018 05:32 IST|Sakshi
బాలింత రక్తనాళం నుంచి బయటికి తీసిన సూది

అతికష్టం మీద సర్జరీ చేసి తొలగించిన ఉస్మానియా వైద్యులు

నాసిరకం సెంట్రల్‌ వీనస్‌ కేథటర్లే కారణమంటున్న డాక్టర్లు

సాక్షి, హైదరాబాద్‌: అత్యవసర రోగులకు ఇంజక్షన్లు, సెలైన్‌ ఎక్కించేందుకు అమర్చే సెంట్రల్‌ వీనస్‌ కేథటర్లు రక్తనాళంలోనే విరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సెలైన్‌ బాటిళ్లలో బ్యాక్టీరియా బయటపడిన విషయం మరిచిపోక ముందే ఈ ఘటన వెలుగు చూడటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న మందులు, సెలైన్‌ బాటిళ్లతోపాటు సెంట్రల్‌ వీనస్‌ కేథటర్ల, ఇంట్రా కేథటర్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో రోగికి మత్తుమందు, యాంటిబయాటిక్‌ ఇంజక్షన్లు, సెలైన్‌ ఎక్కించేందుకు ప్రధాన రక్తనాళానికి వీటిని అమర్చుతారు. కొంతమందికి చేతి నరానికి అమర్చితే.. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి మరికొంత మందికి గొంతు దగ్గర ఉన్న ప్రధాన రక్తనాళానికి అమర్చుతుంటారు. సాధారణంగా ఇవి విరిగిపోవడం అనేది జరగదు. కానీ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా అవుతున్న ఈ కేథటర్లు తొలగించే సమయంలో రక్తనాళంలోనే విరిగి పోతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

రక్తనాళంలో విరిగిపోయిన సూది..
మహబూబ్‌నగర్‌కు చెందిన గర్భిణి (21) ప్రసవం కోసం గత నెల 27న పేట్లబురుజు ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఒక్కసారిగా హైబీపీ రావడంతో ఈ నెల 3న ఆమెకు ఆస్పత్రి వైద్యులు మెడ వద్ద సెంట్రల్‌ వీనస్‌ కేథటర్‌ను అమర్చారు. దీని ద్వారా మత్తుమందు ఇచ్చి ఆమెకు సిజేరియన్‌ డెలివరీ చేశారు. అయితే కేథటర్‌ను తొలగించే సమయంలో సూది మధ్యకు విరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సదరు బాలింతను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రి వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా ఉస్మానియాకు తరలించారు.

బాధితురాలిని ఉస్మానియా ఆస్పత్రి కార్డియోథొరాసిక్‌ వైద్యులు ఐసీయూలో అడ్మిట్‌ చేసుకున్నారు. సీటీ, ఎంఆర్‌ఐ పరీక్షలు చేశారు. విరిగిపోయిన నీడిల్‌ ఏ వైపు వెళ్లిందో గుర్తించారు. సర్జరీ చేస్తే బాలింత ప్రాణాలకే ప్రమాదమని భావించి ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో కార్డియోథొరాసిక్‌ వైద్య బృందం శుక్రవారం ఉదయం ఆమెకు సర్జరీ చేసి, దవడ కింది భాగంలోని ప్రధాన రక్తనాళానికి అడ్డుగా ఉన్న నీడిల్‌ను విజయవంతంగా తొలగించింది.  

నాణ్యతపై అనుమానాలు: ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాల పరిధిలో పేట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నిలోఫర్‌ ఆస్పత్రి, చెవి, ముక్కు, గొంతు (ఈఎన్‌టీ), సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఫీవర్‌ ఆస్పత్రి, చాతి ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం ఉన్నాయి. ఉస్మానియా, గాంధీ జనరల్‌ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 300పైగా సర్జరీలు అవుతుంటాయి. నగరంలోని వివిధ ప్రసూతి ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు అవుతుంటాయి. అత్యవసర చికిత్సలు అవసరమైన రోగులతోపాటు ప్రసవం కోసం వచ్చిన గర్భిణులకు రోజుకు నాలుగైదు ఇంజక్షన్లు, సెలైన్‌ బాటిళ్లు ఎక్కించాల్సి వస్తుంది.

ఇంజక్షన్ల కోసం పదేపదే నీడిల్‌తో గుచ్చడం వల్ల రోగికి నొప్పితో ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో ఐవీ కేథటర్లను అమర్చుతుంటారు. ఆస్పత్రి నుంచి రోగిని డిశ్చార్జ్‌ చేసే సమయంలో చేతికి, మెడ భాగంలో ఉన్న కేథటర్లను తొలగిస్తుంటారు. అయితే నాణ్యతా లోపం వల్ల కేథటర్‌ను తొలగించే సమయంలో రక్తనాళంలో నీడిల్‌ మధ్యకు విరిగి రక్తంతోపాటే ఇతర భాగాలకు చేరుతుంది. రోగుల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. నాసిరకం కేథటర్లను సరఫరా చేస్తుండటం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 

మరిన్ని వార్తలు