బీసీ రుణాల్లో వసూళ్ల పర్వం

26 Jul, 2018 02:27 IST|Sakshi

  లబ్ధిదారుల ఎంపికలోనే అక్రమాలు

  సర్పంచులు, మున్సిపల్‌ కౌన్సిలర్లపై ఫిర్యాదులు

  లక్ష్యాలు నిర్దేశించకముందే జాబితా తయారీపై ఆరోపణలు

  రాయితీ రుణాలకోసం దరఖాస్తు చేసుకున్న వారు 5.7లక్షలు

సాక్షి, హైదరాబాద్‌: చాలాకాలం తర్వాత బీసీ కార్పొరేషన్‌ రాయితీ రుణాల పంపిణీకి చర్యలు చేపట్టడం కొందరు దళారీలకు వరంలా కలిసొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.1,500 కోట్ల మేర రాయితీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. బీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లకు కలిపి 5.75 లక్షల మంది ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించారు. వాటిని పరిశీలించి అర్హులను గుర్తించాలని బీసీ సంక్షేమ శాఖ సూచనలు చేయడంతో దళారీల కొత్త దందాకు తెరలేచింది.

రాయితీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా విభజించడంతో, గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి దరఖాస్తుదారుల ప్రాథమిక జాబితాలు తయా రు చేస్తున్నారు. ఈక్రమంలో వారి పత్రాలను పరిశీలిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. రాయితీ రుణం ఇప్పిస్తామని చెబుతూ అందినకాడికి దండుకుంటున్నారు. అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు సైతం అండగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లపై తాజాగా బీసీ కార్పొరేషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. రంగారెడ్డి, నల్లగొండ, మేడ్చల్‌ జిల్లాలకు చెందిన పలువురు ఇటీవల సంక్షేమాధికా రులకు ఫిర్యాదు చేయడంతో వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆరా తీస్తున్నారు. 

లక్ష్యాలు నిర్దేశించకముందే... 
బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల నుంచి రాయితీ రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించినా.. వాటిని ఇప్పుడే ఆమోదించే పరిస్థితి లేదు. ఎందుకంటే 2018–19 వార్షిక ప్రణాళికకు ఇంకా ఆమోదం లభించలేదు. బీసీ కార్పొరేషన్‌ రూపొందించిన ప్రణాళికలో ఏమేరకు ఆమో దం వస్తుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు దరఖాస్తుల స్వీకరణతోనే సరిపెట్టారు. ప్రణాళిక ఆమోదం తర్వాత నిర్దేశించిన లక్ష్యాన్ని జిల్లాల వారీగా విభజిస్తారు. మం డలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా విభజించిన తర్వాత లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేస్తారు. వార్షిక ప్రణాళికకు ఇప్పటికిప్పుడు ఆమోదం వచ్చినా.. విభజన ప్రక్రియకు మరో నెల సమయం పడుతుంది. ఇంత తతంగం ఉండగా... గ్రామాల్లో అర్హులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పుకోవడంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అర్హుల ఎంపికలో వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండగా, కొన్ని చోట్ల ఏకపక్షంగా జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపల్‌ చైర్మన్లు రాయితీ రుణాలకు పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపి క ఏకపక్షంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు సర్పంచులు, చైర్మన్‌లు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో పన్నెండు మంది సర్పంచులపై జిల్లా సంక్షేమాధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోనూ దరఖాస్తుల పరిశీలన ఏకపక్షంగా సాగిందం టూ ఆర్జీదారులు అధికారులకు మొరపెట్టు కుంటున్నారు. కొన్నిచోట్ల సమాచారం ఇవ్వకుండానే గ్రామసభలు ముగించేశారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించిన తర్వాత మరోమారు పరిశీలన చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు.

మరిన్ని వార్తలు