దక్షిణ సమర్పయామి..!

6 Dec, 2017 02:56 IST|Sakshi

అర్చకులు, ఆలయ ఉద్యోగుల నుంచి భారీగా వసూళ్లు

‘చదివింపు’ జరిగితేనే వేతన సవరణలో చోటంటూ బెదిరింపులు

ఇప్పటికే రూ. 2 కోట్ల వరకు వసూలు చేసిన దందా రాయుళ్లు

సాక్షి, హైదరాబాద్‌ : దేవాలయ ఉద్యోగులు, అర్చకుల వేతన సవరణను ఆసరాగా చేసుకుని దళారులు దండెత్తారు. క్లిష్టమైన ఆ అంశాన్ని కొలిక్కి తెస్తామని, సవరణ పరిధిలోకి రాని వారికి భవిష్యత్‌లో వేతన సవరణ జరిపిస్తామని భారీగా దండుకుంటున్నారు. డబ్బులిచ్చిన వారి జాబితానే సర్కారుకు చేరుతుం దని.. వారికి మాత్రమే వేతనాలు పెరుగుతాయని, క్రమబద్ధీకరణ జరుగుతుందని బెదిరించి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఒక్కో ఉద్యోగి, అర్చకుడి నుంచి రూ.10 వేల వరకు.. మొత్తంగా రూ.2 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. దేవాలయ ఉద్యోగుల నుంచి ఓ గుంపు, అర్చకుల నుంచి మరో గుంపు ఈ వసూళ్ల వేటలో నిమగ్నమై ఉన్నట్లు తెలిసింది.  

మెలికలను ఆసరాగా చేసుకుని..
అర్చకులు, దేవాలయ సిబ్బందికి దేవాలయాల ఆదాయం నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లిస్తూ వచ్చారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని అధికారులు వేధిస్తున్నారని.. ఆదాయం లేదంటూ, తగ్గిందంటూ సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా కోత పెడుతున్నారని ఆలయ ఉద్యోగులు, అర్చకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం.. సెక్షన్‌ 65ఏ ప్రకారం వేతన నిధి ఏర్పాటుచేసి ప్రభుత్వోద్యోగుల తరహాలో ఒకటో తేదీనే బ్యాంకు ఖాతాలకు వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రూ.50 వేలకు పైబడి ఆదాయం ఉన్న దేవాలయాలను వేతన సవరణ పరిధిలోకి తేవాలని నిర్ణయించగా.. ఆ లెక్కన ఉద్యోగులు, అర్చకుల సంఖ్య 6 వేల వరకు చేరింది. అయితే 2015 పీఆర్‌సీ, కన్సాలిడేటెడ్‌ పే, ఎన్‌ఎంఆర్‌.. ఇలా రకరకాల అంశాలను తెరపైకి తెచ్చి ఆ సంఖ్యను సగానికి కంటే తక్కువ చేశారు. దీంతో అర్చకులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. దీన్ని అనుకూలంగా మలుచకున్న వసూళ్ల బృందాలు.. ఆయా ఉద్యోగులను వేతన సవరణ కిందకు తీసుకురావాలంటే సొమ్ములు చెల్లించాలని డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక రూ.50 వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాలనూ సవరణ పరిధిలోకి తెస్తామంటూ రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారు.  

వసూళ్ల రాయుళ్లకు టెన్షన్‌..
దేవాలయ ఉద్యోగులు, అర్చకుల నుంచి భారీగా దండుకున్న వసూళ్ల రాయుళ్లకు తాజాగా ఓ విషయంలో టెన్షన్‌ పట్టుకుంది. ఉద్యోగుల నియామకంపై నిషేధం ఉన్నా.. దేవాదాయ శాఖలో 1,700 మంది అక్రమంగా చేరినట్లు అధికారులు ఇటీవల తేల్చారు. వారికి వేతన సవరణ సాధ్యం కాదని దేవాదాయ శాఖ కమిషనర్‌ తేల్చడంతో ప్రస్తుతానికి వారి విషయం గందరగోళంలో పడింది. ఆ ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినందున.. వారందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని సంబంధిత ముఠా వ్యక్తులు పట్టుపడుతున్నారు. దీంతో కమిషనర్‌ను కాదని రాజకీయ కోణం వైపు నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో వసూళ్ల అంశం వివాదాస్పదమై ప్రభుత్వానికే మచ్చతెచ్చేలా తయారైంది.  

మంత్రికి ఫిర్యాదు చేయండి..
వేతన సవరణ వసూళ్ల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాగా.. వేతన సవరణ అంశం వివాదాల చుట్టూ తిరుగుతున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెప్పారు. వసూళ్లకు, తమకు సంబంధం లేనందున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు