నాన్నా.. అని పిలువు బిడ్డా!

4 May, 2016 15:23 IST|Sakshi
  • గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు
  • పూణె నుంచి దామరగిద్ద తండాకు చేరిన
  • చిన్నారులు వైష్ణవి, విరాట్‌ మృతదేహాలు
  • ఎక్కడ చావుకేక వినిపించినా.. రోదనలు మాత్రం పాలమూరువే. ఎక్కడ ఏ ఘోరం జరిగినా ఉలిక్కిపాటుకు గురయ్యేది ఇక్కడివారే..! పొట్టకూటి కోసం వెళ్లినవారు ఎక్కడో ఓ చోట చనిపోతున్నారు. లేదంటే తమ పిల్లలను కోల్పోతున్నారు. హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్‌లో పడి ఊపిరాడక ఇద్దరు వలసకూలీలు చనిపోయారు. పూణేలో పిల్లర్‌ గుంతలోపడి ప్రాణాలొదిన ఇద్దరు పసిహృదయాల మరణవేదన ఇలాంటి ఉదంతాలకు సజీవసాక్ష్యమే..!


    దామరగిద్ద :
    ‘నాన్నా.. అని ఒక్కసారి పిలువు బిడ్డా.. మీ అమ్మను చూడు! తమ్ముడిని కాపాడబోయి చనిపోయవా.. తల్లీ!’ అంటూ విగతజీవులుగా మారిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వలస పనులకు తల్లిదండ్రులు మహారాష్ట్రలోని పూణేకు వెంట తీసుకెళ్లిన తమ ఇద్దరు పిల్లలు పిల్లర్‌ గోతిలోపడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. చిన్నారులు వైష్ణవి(5), విరాట్‌(4) మృతదేహాలను దామరగిద్ద తండాకు తీసుకొచ్చారు. అక్క, తమ్ముడి మృతదేహాలను చూసి ప్రతిఒక్కరూ చలించిపోయారు.

    తండాకు చెందిన శాంతాబాయ్, కిష్టానాయక్‌ దంపతులు నెలరోజుల క్రితం బతుకుదెరువుకోసం పూణెకు వలసవెళ్లారు. తమతోపాటు ఇద్దరు పిల్లలకు వెంట తీసుకెళ్లారు. సోమవారం భవన నిర్మాణ  పనుల్లో నిమగ్నమై పిల్లలను అక్కడే వదిలిపెట్టారు. అక్కడే ఆడుకుంటున్న అక్కాతమ్ముళ్లు వైష్ణవి, విరాట్‌ భవన నిర్మాణం కోసం తవ్విన పిల్లర్‌గుంతలో పడిపోయారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తమ్ముడిని కాపాడేందుకు ప్రయత్నించిన వైష్ణవి కూడా నీళ్లలోనే ప్రాణాలు విడిచింది. ‘ చిన్నారుల తల్లిదండ్రులు శాంతాబాయ్, కిష్టానాయక్‌ ఆవేదనను చూసిన ప్రతిఒక్కరూ చలించిపోయారు.

మరిన్ని వార్తలు