వృత్తి చెత్త సేకరణ.. ప్రవృత్తి బైక్‌ రైడ్‌

27 Aug, 2019 12:15 IST|Sakshi
సాహసయాత్రలో అన్నదమ్ములు రమేష్, మహేష్‌

బతుకమ్మకుంట నుంచి మంచుకొండల దాకా..

బుల్లెట్‌ వాహనాలపై వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు

12 రోజులు.. 6,300 కిలోమీటర్ల ప్రయాణం

వృత్తి చెత్త సేకరణ.. ప్రవృత్తి బైక్‌ రైడ్‌  

వారిద్దరు అన్నదమ్ములు. వారి జీవనశైలి విభిన్నం. సాధారణ బస్తీలో పుట్టి పెరిగిన వీరు బైక్‌పై సాహస ప్రయాణం చేసి స్ఫూర్తిగా నిలిచారు. బైక్‌ రైడింగ్‌లో వారేమైనా శిక్షణ పొందారా అంటే అదేమీలేదు. వారికికావాల్సిన పరికరాలు లేవు. నైపుణ్యం అంతకంటే లేదు. ధైర్యాన్నే నమ్ముకున్నారు.జమ్మూ కశ్మీర్, లదాక్‌లకు వెళ్లివచ్చారు. బుల్లెట్‌ రైడ్‌తో మంచుకొండలనుచుట్టివచ్చారు. బస్తీ కుర్రోళ్లు భలే సాహసగాళ్లుఅనిపించుకున్నారు. యువతకుఆదర్శంగా నిలిచారు.

అంబర్‌పేట :నగరంలోని బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంట చెంచు బస్తీకి చెందిన ఎన్‌.రమేష్, ఎన్‌. మహేష్‌లు అన్నదమ్ములు. వీరు చెత్త సేకరిస్తూ జీవనోపాధి పొందుతుంటారు. జీహెచ్‌ఎంసీ ఇచ్చిన చెత్త సేకరణ ఆటో, రిక్షాలను నడుపుతూ జీవనం సాగిస్తారు. ఇంటింటికీ తిరిగి సేకరించిన చెత్త ద్వారా వచ్చే డబ్బులే వీరికి ప్రధానం ఆదాయం. బైక్‌రైడ్, దూరప్రాంతాలను సందర్శించాలనే అభిరుచి వారిని కశ్మీర్‌ మంచు కొండలను చుట్టి వచ్చేలా చేసింది. నెలరోజుల క్రితం వీరిద్దరూ రెండు బుల్లెట్‌ వాహనాలపై హైదరాబాద్‌ నుంచి జమ్మూ కశ్మీర్, లదాక్‌ ప్రాంతాల్లో పర్యటించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

సాహస  ప్రయాణం..
బుల్లెట్‌ వాహనాలపై అన్నదమ్ములిద్దరూ 12 రోజుల పాటు 6,300 కిలో మీటర్ల ప్రయాణం చేశారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ, అమృత్‌సర్, వాఘా సరిహద్దును సందర్శించి దేశభక్తిని చాటుకున్నారు. అక్కడి నుంచి శ్రీనగర్, కార్గిల్‌ మీదుగా లదాక్, కార్‌దుంగ్లా, మనాలీ, చండీగఢ్‌ నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రతలో వీరు బుల్లెట్‌ వాహనాలపై మంచుకొండల్లో ప్రయాణించారు. ఒళ్లు గడ్డకట్టే చలి, ఆక్సిజన్‌ కొరత ఉండే ప్రాంతాల్లో బైక్‌రైడ్‌ చేసి ఔరా అనిపించారు. దారిలో ఎదురైన ఆంక్షలను సైతం ఎదుర్కొని ప్రయాణం సాగించారు. 

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో..
ప్రతియేటా ఏదో సాహస యాత్ర చేస్తాం. గత ఏడాది ముంబైని చుట్టి వచ్చాం. ఈ ఏడాది జమ్మూ కశ్మీర్, లదాక్‌ ప్రాంతాలకు వెళ్లి వచ్చాం. పెట్రోల్‌కే రూ.10 వేల ఖర్చు అయ్యింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. మాలోని లాంగ్‌ డ్రైవ్‌ ఆసక్తే సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. చెత్త సేకరణ ఆటో ఆగకుండా ఇతరులకు బాధ్యత అప్పగించి 12 రోజులపాటు సాహస యాత్ర చేశాం.   – రమేష్‌

నేపథ్యానికి భిన్నంగా...
బతుకమ్మకుంట చెంచు బస్తీ అంటేనే స్థానికంగా ప్రత్యేక అభిప్రాయం ఉంది. వీరంతా నిరక్షరాస్యులు. ఎవరి మాటా వినరనే ప్రచారం ఉంది. అంతా చెత్త సేకరించే కుటుంబాలు అనే దృష్టి కూడా ఉంది. ఈ ఇద్దరు యువకులు తమకు జీవనోపాధిని ఇచ్చే వృత్తిని చిన్నచూపు చూడకుండానే దేశాన్ని చుట్టి వచ్చే సంకల్పానికి దిగారు. తెల్లవారుజామున 5 గంటలకే చెత్త ఆటోతో బయలుదేరేవారు బుల్లెట్‌ వాహనాలపై కశ్మీర్‌ లోయకు వెళ్లిరావడం విశేషం. కేవలం తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వెళ్లి వచ్చినట్లు వారు పేర్కొన్నారు. 12 రోజుల పాటు చెత్త సేకరణకు సెలవిచ్చి దేశాన్ని చుట్టి రావడం గమనార్హం. చిన్న సాహసం చేసి ప్రచారం చేసుకునే ఈ రోజుల్లో వీరు సరదాగా సాహసం చేయడం విశేషం. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా