నీకోసం నీవే చదివి ఎదగాలి

20 Apr, 2018 12:56 IST|Sakshi
పాల్గొన్న విద్యార్థులు, నగరవాసులు ప్రసంగిస్తున్న బ్రదర్‌ షఫీ

ఒకశాతం మంది మాత్రమే లక్ష్యాలను సాధిస్తున్నారు

99 శాతం మంది కారణాలు చెప్పితప్పించుకుంటున్నారు

మోటివేషన్‌ స్పీచ్‌ నిపుణుడు బ్రదర్‌ షఫీ

నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్‌): నీ కోసం నీవే చదివి జీవితంలో ఎదగాలని, అమ్మానాన్నల కోసమో, స్నేహితుల కోసమో, బంధువుల కోసమో, చుట్టు పక్కల వారికోసమో చదవొద్దని మోటివేషన్‌ స్పీచ్‌ నిపుణుడు, ఉత్తమ యువసారథి అవార్డు గ్రహీత బ్రదర్‌ షఫీ సూచించారు. ప్రపంచంలో కేవలం ఒకశాతం మందిమాత్రమే లక్ష్యాలను సాధిస్తున్నారని, మిగతా 99శాతం మంది కారణాలు చూపుతూ లక్ష్యసాధనను పక్కనపెడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ మైదానంలో గురువారం రాత్రి మైనారిటీ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కీ – సక్సెస్‌’ సదస్సుకు ఆయన హాజరై విద్యార్థులు, నగరవాసులనుద్ధేశించి ప్రసంగించారు. సృష్టిలో అన్ని జన్మలకంటే మానవ జన్మ గొప్పదని, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి నిరంతరం సాధన చేయాలన్నారు.

ఈ ప్రపంచంలో విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంతో మంది మహనీయులు నిరూపించారన్నారు. సమస్యలు ఎదురవగానే జీవితం ఇంతే అని అనుకోకూడదని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారని, మైనారిటీ గురుకులాల ఏర్పాటు అభినందనీయమన్నారు. షఫీ కూతురు తంజీలా ప్రసంగిస్తూ నీవు చెప్పదలుచుకున్న విషయం నిజమైతే ఎవరికి భయపడవల్సిన అవసరం లేదన్నారు. సదస్సులో  అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, బోధన్‌ ఎమ్మెల్యే షకీల్,  ఆర్డీవో వినోద్‌కుమార్, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ అలీం, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు