తల్లీతమ్ముడే చంపేశారు..

11 Nov, 2014 01:41 IST|Sakshi

పరిగి: ఇటీవల పరిగిలో వెలుగుచూసిన ‘అస్థిపంజరం’ కేసు మిస్టరీ వీడింది. హత్యకు గురైంది పరిగికి చెందిన ఆరెకటికె రాకేష్(22)గా పోలీసులు గుర్తించారు. వేధింపులు తాళలేక అతడిని తల్లీ, తమ్ముడే చంపేశారు. సోమవారం పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు తెలిపారు. పరిగి బాహర్‌పేట్ కాలనీకి చెందిన ఆరెకటికే బాలాజీకి భార్య బుజ్జీబాయి, కుమారులు రాకేష్(22), కమాల్ ఉన్నారు.

బుజ్జీబాయి, చిన్నకొడుకు కమాల్‌తో కలిసి పరిగిలోని కల్లు దుకాణం వద్ద బజ్జీలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేది. భర్త, పెద్ద కుమారుడు ఖాళీగా తిరుగుతూ మద్యం తాగుతుండేవారు. డబ్బులు అవసరమైన ప్రతిసారి తండ్రీకొడుకులు బుజ్జీబాయి ని వేధించడమో.. లేక చిన్నచిన్న చోరీలు చేస్తుండేవారు. ఈక్రమంలో వారు గతంలో జైలుకు కూడా వెళ్లివచ్చారు.  

 వేధింపులు భరించలేక..  
 ఆరునెలలుగా తండ్రీకొడుకులు బాలా జీ, రాకేష్‌లు డబ్బుల కోసం బుజ్జీబాయి, కమాల్‌ను తీవ్రంగా వేధించసాగారు. ఈక్రమంలో బాలాజీ ఇటీవల గండేడ్ మండలంలో  మేకల చోరీకి పాల్పడడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. ఆయనకు బెయిల్ ఇప్పించేం దుకు డబ్బులు ఇవ్వాలని రాకేష్ తల్లిని వేధించాడు. దీంతో బుజ్జీబాయి కొంతడబ్బు పోగుచేసి ఇటీవల బెయిల్‌కు సంబంధించిన ఫీజు ఇచ్చింది.

అయినా రాకేష్ డబ్బులు అడుగుతూనే ఉన్నాడు. వేధింపులు భరించలేని కమాల్, బుజ్బీబాయిలు ఎలాగైనా రాకేష్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మనసు మార్చుకున్నారు. మద్యం తాగి వచ్చిన ప్రతీసారి రాకేష్ కుటుంబీకులను వేధించడంతో బుజ్జీబాయి, కమాల్ అతడి కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో ఉన్న టేబుల్‌కు కట్టేసి తమ పనులు చూసుకునేవారు. ఈ విషయం ఇరుగుపొరుగు వారికి కూడా తెలుసు.

 హత్యకు దారితీసిన పరిస్థితి..
 ఈనెల 1న ఉదయం 10 గంటల సమయంలో రాకేష్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తల్లీతమ్ముడిని దూషించి వారిపై దాడికి యత్నించాడు. దీంతో ఎప్పటిమాదిరిగానే బుజ్జీబాయి చిన్నకొడుకు కమాల్‌తో కలిసి రాకేష్ కాళ్లుచేతులు కట్టేసి ఇంట్లో ఉన్న టేబుల్‌కు బిగించి తమ పనుల్లో నిమగ్నమైపోయారు. రాత్రి ఇంటికి వచ్చి భోజనం చేసిన తర్వాత తల్లీకొడుకులు రాకేష్ కట్లు విప్పారు. అనంతరం రాకేష్ తమ్ముడు, తల్లితో గొడవకు దిగాడు. అతడి వేధింపులు భరించలేని వారు రాకేష్‌పై దాడిచేశారు. ఈక్రమంలో అతడు కిందపడిపోవడంతో బుజ్జీబా యి రాకేష్ కాళ్లను గట్టిగా పట్టుకుంది. కమాల్ గొంతు నులిమి చంపేశాడు.  

   అనంతరం అర్ధరాత్రి తల్లీకొడుకులు రాకేష్ శవాన్ని గోనెసంచిలో తీసుకెళ్లి సమీపంలో ఉన్న గుంతలో పడేశారు. మృతదేహంపై కిరోసిన్ పోసి తగులబెట్టారు. మరుసటి రోజు ఉదయం కమాల్ వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో గడ్డి వేసి మరోసారి నిప్పంటించాడు. అప్పటికీ శవం పూర్తిగా కాలిపోకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది.

దీంతో పక్కనే ఉన్న గ్లోబల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ముజీబ్ వెళ్లి చూడగా శవం కనిపించింది. ఏదో జంతువు కళేబరం అయి ఉండొచ్చని భావించిన ఆయన గత మంగళవారం పంచాయతీ కార్మికులతో తగులబెట్టించారు. అయినా దుర్వాసన తగ్గకపోవడంతో ప్రిన్సిపాల్ గత గురువారం ఘటనా స్థలానికి వెళ్లి చూశాడు. కొన్ని ఎముకలు, పుర్రె కనిపించటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
 కేసు ఇలా ఛేదించారు..
  వైద్యులు పుర్రె, ఎముకలు మనిషివేనని నిర్ధారించారు. కాగా దుస్తులు లేకపోవడం.. అప్పటికే కుళ్లిపోవడంతో ఆడా.. ? మగా.. అనే విషయం తెలియలేదు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు ప్రారంభించారు.అస్థిపంజరం బయటపడటంతో అప్రమత్తమైనబుజ్జీబాయి తన కొడుకు కనిపించటంలేదని బంధువులకు, తెలిసిన వారితో చె ప్పటం ప్రా రంభించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈక్రమంలో స్థానికులను విచారించారు. రాకేష్ ప్రవర్తన.. అతడి కుటుంబీకుల గురించి తెలుసుకున్నారు. దీంతో అనుమానించి బుజ్జీబాయి, కమాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం అంగీకరించి పైవిషయాలు తెలిపారు. ఈమేరకు నిందితుల్ని సోమవారం రిమాం డుకు తరలించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐలు కృష్ణ, శంషొద్దీన్, కానిస్టేబుళ్లు పాండుగౌడ్, చంద్రశేఖర్‌లను ఈ సందర్భంగా సీఐ ప్రసాద్ అభినందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా