పేగులు చొక్కాలో దోపుకుని పరుగులు!

27 Jun, 2019 03:44 IST|Sakshi
రిసెప్షన్‌లో కుప్పకూలిన అన్వర్‌

పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో యువకుడి దారుణ హత్య

స్టేషన్‌ రిసెప్షన్‌కు వచ్చి కుప్పకూలిపోయిన వైనం..  

కత్తితో ఠాణాకు వచ్చి లొంగిపోయిన నిందితుడు

హైదరాబాద్‌: పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే దారుణ హత్య..  బయటపడిన పేగులను చొక్కాలో దోపుకుని.. బాధితుడు రోడ్డుపై పరుగులు తీయడం.. అలా పరిగెత్తి.. పరిగెత్తి పోలీసు స్టేషన్‌కే వచ్చి కుప్పకూలడం.. ఇలాంటివన్నీ మనం సినిమాల్లో చూసుంటాం.. అయితే, బుధవారం హైదరాబాద్‌లోని పంజగుట్టలో జనం అంతా చూస్తుండగా జరిగిన ఈ దృశ్యం కలకలం రేపింది..  

పంజగుట్ట ప్రధాన రహదారిపై ఉన్న బడీ మజ్దిద్‌లో నివాసం ఉండే మహ్మద్‌ అన్వర్‌ (32), నాగార్జున హిల్స్‌లోని పంజాబ్‌ పహాడ్‌ వద్ద నివాసం ఉండే మీర్‌ రియాసత్‌అలీ సజ్‌ (35)లు ఆటో డ్రైవర్‌లు. పంజగుట్ట కూడలివద్ద ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఉన్న ఆటో స్టాండ్‌లో తమ ఆటోలు నిలుపుతుంటారు. ఇద్దరూ మంచి స్నేహితులని, అయితే, గత కొంతకాలంగా  పడటం లేదని, ఇప్పటికే 4సార్లు ఆటో స్టాండ్‌ వద్ద గొడవపడ్డారని స్థానికులు చెబుతున్నారు.

వీరిద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరడంతో మహ్మద్‌ అన్వర్‌ను ఎలాగైనా హత్య చేయాలని మీర్‌ రియాసత్‌ అలీ పథకం పన్నాడు.. ముందుగానే తన వెంట ఓ కత్తిని తీసుకువచ్చాడు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆటో స్టాండ్‌లో ఉండగానే వారి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన రియాసత్‌ వెంటతెచ్చుకున్న కత్తితో అన్వర్‌ను పొడిచాడు. పొడవడమే కాకుండా కత్తి కడుపులోకి దిగిన తర్వాత బలంగా చీల్చడంతో అన్వర్‌ కడుపులోని పేగులు బయటకు వచ్చాయి. దాంతో బయటపడ్డ పేగులు చొక్కాలో దోపుకున్న అన్వర్‌ పక్కనే ఉన్న పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పరిగెత్తి గ్రౌండ్‌ఫ్లోర్‌ లోని రిసెప్షన్‌ టేబుల్‌ వద్ద  కుప్పకూలిపోయాడు.  

కత్తితో పోలీసు స్టేషన్‌కు.. 
నిందితుడు రియాసత్‌ అలీ అన్వర్‌ను పొడిచిన కత్తి తో పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. విధుల్లో ఉన్న అడ్మిన్‌ ఎస్సై శ్రీకాంత్‌ చేతిలో కత్తి, రక్తం చూసి ఏం జరిగిందని ప్రశ్నించగా, తన భార్యకు, పిల్లలకు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించిన అన్వర్‌ను పొడిచానని చెప్పడంతో అతన్ని లాకప్‌లో వేసి కిందకు దిగాడు. అక్కడ అప్పటికే బాధితుడు కొన ఊపిరితో ఉండటం చూసి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.  

భయాందోళన చెందిన వాహనదారులు..  
పంజగుట్ట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పక్కనే ఘటన జరగడం, బాధితుడు తీవ్ర గాయాలు, రక్తంతో పరిగెత్తడం, నిందితుడు కూడా కత్తితో పరుగులు తీయడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళన చెందారు. ఏం జరుగుతోందో తెలియక ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని వార్తలు