తండ్రి,కొడుకుల దారుణహత్య

13 Jun, 2018 12:13 IST|Sakshi
మృతదేహాలు తరలించొద్దంటూ ఆందోళన చేస్తున్న బంధువులు  

భూ వివాదమే కారణం..

కంట్లో కారం చల్లి..గొడ్డళ్లతో నరికి..

ఇల్లంతకుంట మండలం కిష్టారావుపల్లిలో ఘటన 

పరిశీలించిన ఎస్పీ రాహుల్‌హెగ్డే 

సాక్షి, ఇల్లంతకుంట (మానకొండూర్‌) : భూ వివాదం తండ్రీకొడుకుల దారుణహత్యకు దారితీసింది. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టారావుపల్లి గ్రామ శివారులోని సర్వేనంబర్‌ 540లో ఉన్న 39గుంటల వ్యవసాయభూమి కిష్టారావుపల్లి గ్రామానికి చెందిన మామిండ్ల దేవయ్య అతడి సోదరుడు మామిండ్ల స్వామి పేర్లతో భూ రికార్డుల్లో ఉండగా, కాస్తులో కందికట్కూర్‌కు చెందిన సావనపెల్లి ఎల్లయ్య ఉన్నాడు. భూమి మాదంటే.. మాదంటూ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఇదే భూమిలో సోమవారం మామిండ్ల స్వామి, దేవయ్య విత్తనాలు వేశారు. మంగళవారం వేకువజామున సావనపెల్లి ఎల్లయ్య, అతడి కుమారుడు శేఖర్‌ వెళ్లి అదే వ్యవసాయ భూమిలో ట్రాక్టర్‌తో దుక్కిదున్నడం మొదలుపెట్టారు. సమీపంలోనే ఉన్న మామిండ్ల దేవయ్య, స్వామి, దేవయ్య భార్య పద్మ, కుమారుడు వెంకటేశ్‌ వ్యవసాయ భూమి వద్దకు చేరుకున్నారు.

 
కారం చల్లి.. గొడ్డళ్లతో నరికి.. 
సావనపెల్లి ఎల్లయ్య(50), అతడి కుమారుడు శేఖర్‌(21)లపై మామిండ్ల దేవయ్య భార్య పద్మ కారంపొడి చల్లింది. దేవయ్య, అతడి సోదరుడు స్వామి గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. అక్కడే ఉన్న ఎల్లయ్య భార్య ఎల్లవ్వ కేకలు వస్తూ మృతదేహాల వద్దకు వచ్చేలోపే నిందితులు పారిపోయారని ఎల్లవ్వ తెలిపింది.  


పరిశీలించిన ఎస్పీ.. 
విషయం తెలుసుకున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే, డీఎస్పీ వెంటరమణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. పథకం ప్రకారమే హత్యలు జరిగాయని, కొన్నేళ్లుగా భూవివాదం కేసు కోర్టులో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే మూడు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తండ్రీకొడుల హత్యకేసులో నలుగురి పాత్ర ఉందని, నింధితు లు పరారీలో ఉన్నట్లు వివరించారు. మృతుడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 


మృతదేహాలు తరలించొద్దంటూ బంధువుల ఆందోళన.. 
హత్య ఘటనలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించే వరకు మృతదేహాలను సంఘటనా స్థలం నుంచి తరలించొద్దంటూ బంధువులు ఆందోళనకు దిగారు. మృతదేహాలను తరలించేందుకు తీసుకొచ్చిన ట్రాక్టర్‌ ఎదుట బైటాయించారు. డీఎస్పీ వెంకటరమణ, సీఐలు అనిల్‌కుమార్, రవీందర్‌లు వచ్చి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ 39 గుంటల భూమి మృతుల కుటుంబానికే చెందేలా చూస్తామని హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని పట్టుబట్టారు. భూవివాదం కోర్టులో ఉందని, కోర్టు చూసుకుంటుందని చెప్పడంతో శాంతించారు. 


పోలీసుల అదుపులో నిందితులు 
హత్యకేసులో నిందితులైన మామిండ్ల దేవయ్య, మామిండ్ల స్వామి, పద్మ, వెంకటేశ్‌ ఇల్లంతకుంట పోలీసుస్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి సిరిసిల్ల సీఐ కార్యాలయంలో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు మాత్రం నిందితులు పరారీలోనే ఉన్నారని చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు