ఊపిరిలూదిన ‘ఉచిత కాల్స్’

26 May, 2015 03:36 IST|Sakshi
ఊపిరిలూదిన ‘ఉచిత కాల్స్’

* బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్లకు రికార్డుస్థాయి స్పందన
* 25 రోజుల్లోనే 8,350 కనెక్షన్లు

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ విభాగానికి ‘ఉచిత కాల్స్’ పథకం మళ్లీ ఊపిరిలూదింది. శరవేగంగా పతనం దిశగా సాగుతున్న ఆ విభాగాన్నీ ఈ పథకం ఆపద్భాందవునిలా ఆదుకుంది. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ కనెక్షన్ల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. ఒక్క ఏపీ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పరిధిలోనే సాలీనా లక్ష కనెక్షన్లను సంస్థ కోల్పోతోంది. ఇదే కొనసాగితే ల్యాండ్ లైన్ విభాగాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని గుర్తించిన సంస్థ దిద్దుబాటు చర్యలకు దిగింది.

ఈ క్రమంలో రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఏడు వరకు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్లకు ఉచితంగా కాల్స్ చేసుకునే కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నెల 1వ తేదీన ప్రారంభించిన ఈ పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. తొలి 25 రోజుల్లో సంస్థ ఏపీ సర్కిల్ పరిధిలో కొత్తగా 8,350 ల్యాండ్‌లైన్ కనెక్షన్లను పొందింది.

ఏప్రిల్‌లో 25 రోజుల్లో సంస్థ పొందిన కనెక్షన్లు 4,500. ఆ నెలలో ఏకంగా 9 వేల కనెక్షన్లను సంస్థ కోల్పోయింది. కానీ కొత్త పథకం కారణంగా మేలో 25 రోజులకు 8,350 కనెక్షన్లు నమోదైతే.. కోల్పోయింది 6 వేలు మాత్రమే. నికరంగా 2,350 కనెక్షన్లు పెరిగాయన్నమాట. ఇలాంటి సానుకూల ఫలితాలను గడచిన ఐదేళ్లలో సంస్థ పొందలేకపోయింది. దీంతో ఉచిత పథకం ఇచ్చిన ఉత్సాహంతో జూన్ నుంచి కనెక్షన్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు