మహబూబ్‌నగర్‌కు మాయావతి

25 Nov, 2018 13:59 IST|Sakshi
 మాట్లాడుతున్న సయ్యద్‌ ఇబ్రహీం  

ఈ నెల 29న రానున్న బీఎస్పీ అధ్యక్షురాలు

మహబూబ్‌నగర్‌ స్టేడియంలో బహిరంగ సభ

బీఎస్‌పీ అభ్యర్థి సయ్యద్‌ ఇబ్రహీం

సాక్షి, జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): బహుజన సమాజ్‌ వాదీ(బీఎస్పీ) పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఈ నెల 29న మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రానికి రానున్నారని ఆ పార్టీ మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ అభ్యర్థి సయ్యద్‌ ఇబ్రహీం తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. బహుజనులను మోసం చేసే పార్టీలకు ప్రత్యామ్నాయం బీఎస్‌పీ ఒక్కటేనన్నారు. కాన్షీరాం, అంబేద్కర్‌ అశయ సాధనకు ఆ పార్టీ తరఫున పోటీకి దిగిన తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాయామతి రానున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని మాట్లాడుతారని అన్నారు. ఈ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మోసం చేశాయి 

బహుజన సమాజ్‌ పార్టీతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని సయ్యద్‌ ఇబ్రహీం అన్నారు. మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సీటు ఇస్తానని ఒక్కసారి టీఆర్‌ఎస్, రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేశాయన్నారు. ఫ్రెండ్లీ కాంటెక్ట్‌ అని చివర నిమిషం వరకు తనకు బీ ఫాం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు తాజాగా నచవంచన చేశారని పేర్కొన్నారు. టీజేఎస్‌తో పలు సీట్లలో స్నేహపూర్వక పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ తనకు ఎందుకు టికెట్‌ ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాగా, ఇలాంటి చీకటి సమయంలో బహుజన సమాజ్‌ పార్టీ తనకు అండగా నిలిచి టికెట్‌ ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమంలో మహబూబ్‌నగర్‌ నుంచి తాను అనేక పోరాటాలు చేసినా గుర్తింపు ప్రజల్లో ఉందన్నారు. అలాంటి ప్రజలు తనను బీఎస్‌పీ పార్టీ నుంచి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఇబ్రహీం ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బోయపల్లి నర్సిములు, కడం బాలరాజు, రాజు, స్వామి, పాతూర్‌ రమేష్, ధనుంజయ్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు