ఈ‘సారీ’ కూత లేదు

6 Jul, 2019 07:22 IST|Sakshi

కలగానే మారిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ నిర్మాణం 

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు శూన్యం 

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లా మీదుగా ప్రతిపాదించిన గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ కోసం ఎదురుచూస్తున్నజిల్లా ప్రజలకు మరోమారు నిరాశే మిగిలింది. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా..ఈ బడ్జెట్‌లోనూ కేంద్ర ప్రభుత్వం కలను కలగానే మిగిల్చింది. తెలంగాణలోని గద్వాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్‌ కోసం నిధులు కేటాయిస్తారని అంతా అనుకున్నామరోమారు మొండిచేయి చూపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమన్వయం లేకపోవడం వల్లనే శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో నాగర్‌కర్నూల్‌ నుంచి కల్వకుర్తి, అచ్చంపేట గుండా మాచర్ల వరకు రైల్వేలైన్‌ వస్తుందనుకున్న ప్రజల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు.

1980లో రైల్వేలైన్‌కు బీజం 
1980లో అప్పటి ఎంపీ మల్లు అనంతరాములు గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ వేయడం వల్ల కలిగే లాభాలను వివరి స్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. దీంతో అప్పట్లో రూ.919 కోట్ల బడ్జెట్‌తో 184.2 కి .మీ. మేర రైల్వేలైన్‌ కోసం ప్రతిపాదనలు తయారు చేయారు. ఈ రైల్వేలైన్‌ వనప ర్తి, నాగర్‌కర్నూల్, మిర్యాలగూడ మీ దుగా మాచర్ల వరకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్‌ వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అప్పటి నుంచి మరుగున పడిపోయిన ఈ అంశంపై 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి డీటైల్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌) తయారు చేసి కేంద్రానికి అందించారు.

దీంతో 2015లో కేంద్రం కంటి తుడుపు చర్యగా కేవలం నల్లగొండ– మాచర్ల వరకు సర్వే నిర్వహించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఇది మినహా ఇప్పటి వరకు ఈ రైల్వేలైన్‌కు సంబంధించి కేంద్రం తీసుకున్న చొరవ ఏమీ లేదు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంపైనే ఈ అంశం ఆధారపడి ఉందనేది అందరి వాదన. రైల్వేలైన్‌ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం ఒప్పుకుంటే ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. భూ సేకరణ, ఇ తర అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చెల్లింపులు చేయాలి. ఫలితంగా రాష్ట్ర ప్ర భుత్వం చొరవ తీసుకుంటే తప్ప కేం ద్రం ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. 

మొదటి దశ పూర్తి.. రెండో దశ? 
ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ, తెలంగాణ రాష్టాలను కలుపుతూ రాయచూర్‌ నుంచి మాచర్లకు రైల్వేలైన్‌ కోసం ప్రతిపాదించారు. దీని వల్ల వ్యాపార పరంగా ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందడమే కాకుండా మూడు రాష్ట్రాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. దీంతో 2002లో అప్పటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి హోదాలో దత్తాత్రేయ రాయచూర్‌– గద్వాల రైల్వేలైన్‌కు శంకుస్థాపన చేశారు. గత రెండేళ్ల క్రితం డెమో కూడా పూర్తి చేసుకుని రాకపోకలు సైతం ప్రారంభమయ్యాయి.

ఇక రెండో దశకు సంబంధించి గద్వాల నుంచి మాచర్ల వరకు రైల్వేలైన్‌ కోసం 151 నుంచి 154 కిలోమీటర్ల మేర ఉండే ఈ రైల్వే లైన్‌ కోసం దాదాపు రూ.1,160 కోట్లు అవుతుందని రైల్వేశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. సగం వాటా భరిస్తే కొత్త లైన్లు వేస్తామని కేంద్ర విధించిన నిబంధన మేరకు రాష్ట్రానికి చెందిన నేతలు, ఇక్కడి ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు రైల్వేలైన్‌కు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజకీయ నాయకులు రైల్వే లైన్‌ కోసం మరో ఉద్యమం చేస్తే తప్ప సాధ్యం కాదని ఇక్కడి ప్రజల అభిప్రాయం. ఏదేమైనా గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ కోసం ఇంకెన్ని దశాబ్దాలు వేచి చూడాలనేది ఈ ప్రాంత ప్రజల ప్రశ్న.

ముఖ్యమంత్రి లేఖ ఇవ్వాలి 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆమోదం పొందేలోపు రాష్ట్ర Ðముఖ్యమంతి గద్వాల– మాచర్ల రైల్వేలైన్‌ కోసం లేఖ ఇవ్వాలి. సప్లిమెంటరీ కింద కేంద్ర నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వేలైన్‌ కోసం అయ్యే ఖర్చులో 50 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కాబట్టి ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒప్పించి సమస్యను పరిష్కరించాలి.
-సుధాకర్‌రెడ్డి, రైల్వే సాధన సమితి జిల్లా చైర్మన్‌ 

మరిన్ని వార్తలు