‘ఓటాన్‌ అకౌంట్‌’పై ఆశలు

22 Feb, 2019 08:26 IST|Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం నుంచి జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ... లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టె ఈ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై అందరు దృష్టి సారించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు నిధుల కేటాయింపు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారి శాసనసభలో నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండగా, శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టనున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌పై ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు. లోక్‌సభకు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే ఊహా గానాల నేపథ్యంలో బడ్జెట్‌ ప్రజాకర్షణగా ఉంటుం దని భావిస్తున్నారు.

బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అన్ని వర్గాల ప్రజలను దష్టిలో పెట్టుకొని ఆకర్షణీయ బడ్జెట్‌ను రూపొందించినట్లుగా ఇదివరకే ప్రకటించగా, బడ్జెట్‌ను ఓట్లుగా మలుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తికి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో మిగిలిన చివరి అవకాశాన్ని సద్వినియోగం  చేసుకునేందుకు నిధుల కేటాయింపులు చేసినట్లుగా తెలుస్తోంది, సంక్షేమంతో పాటు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని వృద్ధిలోకి తెచ్చేందుకు రైతు ఆర్థిక సాయంపై దృష్టి సారించినట్లు సమాచారం.

వ్యవసాయానికి ప్రాధాన్యం..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రైతాంగానికి వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉంది. ఈసారి ఎన్నికల హామీ ప్రకారం ఉమ్మడి జిల్లాలో 13,42,045 ఎకరాలు సాగుభూమి ఉండగా, 6.62 లక్షల మంది రైతులకు రెండు పంటలకు కలిసి ప్రతి ఏటా రూ.1074 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. ఈ మేరకు రైతుల రుణమాఫీ, పెట్టుబడి సాయం, పంట రుణాల కింద అత్యధిక నిధులు కేటాయించాలని ఉమ్మడి జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించగా, బడ్జెట్‌లో ఏ మేరకు నిధులు వస్తాయన్న చర్చ జరుగుతోంది. అలాగే విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతుల కోసం ఏ మేరకు కేటాయింపులు ఉంటాయన్న ఉత్కంఠ కనిపిస్తోంది.
 
ప్రాజెక్టులపై నిధుల వర్షం కురిసేనా...
ప్రభుత్వం 2018–19 బడ్జెట్‌లో జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.7,484 కోట్లు కేటాయించి పెద్దపీట వేసింది. ప్రభుత్వం ప్రతిష్ట్మాతకంగా తీసుకున్న కాళేశ్వరానికి రూ.6,094.41 కోట్లు కేటాయించగా, ఇందిరమ్మ వరదకాల్వకు రూ.689.93 కోట్లు, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్‌కు రూ.300 కోట్లు, ఎస్సారెస్పీ–1, ఎస్సారెస్పీ–2లకు రూ.400 కోట్లు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అత్యవసరం రూ.25 వేల కోట్లు కావాలంటున్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి కోసం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

కరీంనగర్‌కు ‘వైద్య కళాశాల’ వస్తుందా...
సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం వివిధ వ్యాధులతో బాధపడేవారిలో అత్యధికులు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వే తర్వాత సీఎం హోదాలో మొదటిసారి కరీంనగర్‌ వచ్చిన కేసీఆర్‌ కరీంనగర్‌కు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామని ప్రకటించారు. అంతకుముందు బడ్జెట్‌లో ఏడు, 2018–19 బడ్జెట్‌లో నల్గొండ, సూర్యాపేటలకు వైద్య కళాశాలలను కేటాయించిన ప్రభుత్వం కరీంనగర్‌కు మొండిచెయ్యి చూపింది. ఐదు పర్యాయాల బడ్జెట్‌లు పూర్తయినా రూ.వెయ్యి కోట్లతో కరీంనగర్‌కు ‘సూపర్‌స్పెషాలిటీ’ వైద్యకళాశాల కలగానే మిగిలింది. ఉమ్మడి జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పలు ప్రాంతాల ప్రజలకు పెద్ద దిక్కుగా కరీంనగర్‌ పెద్దాసుపత్రి ఉంది. వైద్య కళాశాల మంజూరు చేయకపోవడం, గత బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపి నిమ్స్‌ స్థాయికి పెంచుతామని ప్రకటించినా.. ఇప్పటికీ ఆ హోదా దక్కలేదు.

మానేరు రివర్‌ఫ్రంట్‌కునిధులేవి....
సబర్మతీ తీరాన్ని మించి మానేరు రివర్‌ ఫ్రంట్‌ నిర్మిస్తామని రెండేళ్లుగా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే గుజరాత్‌ వెళ్లి వచ్చారు. మొత్తంగా రూ.506 కోట్ల వ్యయమయ్యే ప్రాజెక్టుకు 2017–18 బడ్జెట్‌లోనే రూ.199 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మానేరు రివర్‌ఫ్రంట్‌ పనులు వేగం అందుకుంటాయని అందరూ భావించారు. అయితే ఇప్పటికీ భూ సేకరణే పూర్తి కాకపోగా, పైసా ఖర్చు పెట్టలేదు. ఈ బడ్జెట్‌లో కనీసం రూ.300 కోట్లు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించకుంటే ఇది వైద్య కళాశాల, నిమ్స్‌ కథలానే మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి పెద్ద మొత్తంలో కేటాయిస్తారని ఆశిస్తున్నారు. 

కొత్త మంత్రులపై ‘అభివృద్ధి’ భారం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల తరువాత పూర్తిస్థాయి మంత్రివర్గంతో జరుగనున్న బడ్జెట్‌ సమావేశాలపై జిల్లా ప్రజలు భారీ ఆశలు పెంచుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే రెండు పంటలకు నీరందడంతో పాటు ప్రస్తుతం రబీ పంటకు సంబంధించి కనీసం వారానికి రెండు తడులైనా నీటి సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో పాటు రైతులకు సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు అందించే దిశగా చర్చలు సాగాలని కోరుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిరుద్యోగుల సంఖ్యకు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన జరగకపోవడంతో ఉమ్మడి జిల్లాలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఎంతో మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో పాటు బొగ్గు ఆధారిత పరిశ్రమలు, వస్త్రోత్పత్తి రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మిషనరీ ఏర్పాటు తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెడితే ఉమ్మడి జిల్లాకు భారీగా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సీనియర్‌ నేతలకు మంత్రి పదవులు దక్కడంతో భారీ ఆశలు నెలకొన్నాయి. ఈటల రాజేందర్‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా, కొప్పుల ఈశ్వర్‌ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారి అసెంబ్లీలో వారి గళాన్ని విప్పనున్నారు. వీరికి తోడు జిల్లాకు చెందిన మరో 10 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లా సమస్యలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, సంక్షేమంపై ప్రాధాన్యత పెరిగేలా మన ప్రజాప్రతినిధులు రాబోయే బడ్జెట్‌లో జిల్లాకు పెద్దపీట వేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.   

దేవాలయాలకు అరకొరే.. 
వేములవాడ ఆలయప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటు చేసి రూ.వందల కోట్లు కేటాయించినట్లు ప్రకటించిన ప్రభుత్వం.. గత బడ్జెట్‌లో మాత్రం రూ.100 కోట్లను కేటాయించింది. ధర్మపురి ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు ఇచ్చింది. కొండగట్టులో రోప్‌వే కోసం ఈసారి నిధులు దక్కలేదు. ఇదిలా వుంటే కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలకు ఒక్కోదానికి రూ.100 కోట్ల చొప్పున రూ.200 కోట్లు బడ్జెట్‌లో కేటాయిం చారు. శాతవాహన యూనివర్సిటీకి కేవలం రూ.20 కోట్లతో సరిపెట్టారు. 


నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు
తెలంగాణ ప్రభుత్వం మూడు రోజుల పాటు చేపట్టనున్న సమావేశాలకు హాజరయ్యేందుకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున నిధుల మంజూరు అవసరం ఉంది. ప్రాజెక్టు పూర్తి కావాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయించడంతో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనులకు ప్రాధాన్యత కల్పించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు గళం విప్పాల్సిన అవసరం ఉంది. 

మరిన్ని వార్తలు