సంప్రదాయానికి భిన్నంగా నేడూ సభ..

23 Feb, 2019 02:55 IST|Sakshi

బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ.. ఎల్లుండి వరకు అసెంబ్లీ సమావేశాలు

రేపు ఇరు సభలకు సెలవు.. చివరిరోజు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. శాసనసభ, శానసమండలిలో శనివారం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు. ఆదివారం సెలవుగా ఖరారు చేశారు. సంప్రదాయం ప్రకారం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు అధ్యయనం కోసం అసెంబ్లీకి సెలవు ఉంటుంది. అయితే ఉభయసభలను శనివారం సైతం నిర్వహించాలని శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ)లు నిర్ణయించాయి.

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్‌ బలాల, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హాజరయ్యారు. శాసనమండలి చైర్మన్‌ వి.స్వామిగౌడ్‌ అధ్యక్షతన శాసనమండలి బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమంత్రి మహమూద్‌ అలీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు బోడికుంటి వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌రావు ఇందులో పాల్గొన్నారు. ఈ రెండు సభల బీఏసీలోనూ సోమవారంతో సభను ముగించాలని నిర్ణయించారు. 

సంతాపం అనంతరం చర్చలు 
శనివారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. దివంగత మాజీ గవర్నర్‌ నారాయణ్‌దత్‌ తివారీతోపాటు 15 మంది మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభలో సంతాపం తెలుపుతారు. జీఎస్టీ, పంచాయతీ రాజ్‌ ఆర్డినెన్స్‌ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెడుతుంది. అనంతరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది. ఇటు శాసన మండలిలో నారాయణ్‌దత్‌ తివారీకి సంతాపం ప్రకటించిన అనంతరం బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది.

ఆరోగ్యకరమైన చర్చ జరగాలి: ప్రశాంత్‌రెడ్డి 
ప్రతిపక్షాలు ప్రస్తావించే అన్ని అంశాలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్లు శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. బడ్జెట్‌పై కాంగ్రెస్‌ తరపున ఇద్దరు సభ్యులు చర్చను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ నెల 25 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. అదేరోజు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుందని వెల్లడించారు.   

మరిన్ని వార్తలు