అప్పుడు ఇచ్చినంత ఇవ్వలేం

21 Dec, 2015 02:01 IST|Sakshi

 వచ్చే బడ్జెట్‌లో ఇరిగేషన్ మినహా శాఖలన్నింటికీ కోతలే
 నీటిపారుదలకు రూ. 17 వేల కోట్లు పెంచాలి
 ఆమేరకు ఇతర శాఖల్లో సర్దుబాటు తప్పదు
 అన్ని విభాగాలకు సందేశమిచ్చిన ఆర్థిక శాఖ

 
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్‌లో నీటిపారుదల రంగం మినహా అన్ని విభాగాలకు భారీగా కోతపడనుంది. ప్రణాళిక పద్దులోనే దాదాపు రూ.17 వేల కోట్ల నిధులకు వాతపడనుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. తాజాగా కార్యదర్శుల స్థాయిలో శాఖల వారీగా జరిగిన సమీక్ష సమావేశాల్లో ఆర్థిక శాఖ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చింది. ‘2015-16 బడ్జెట్‌లో ఇచ్చినన్ని నిధులు ఈసారి ఇవ్వలేం. అంతకంటే తక్కువే కేటాయిస్తాం. ప్రభుత్వ ప్రాధాన్యతల దృష్ట్యా నీటిపారుదల శాఖకు ఎక్కువ వాటా ఇవ్వాల్సి ఉంది. అందుకే మీ విభాగాల్లో ప్రతిపాదనలను వీలైనంత కుదించండి.
 
మునుపటి కేటాయింపుల కంటే తక్కువకు అంచనాలు ఇవ్వండి’ అంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని విభాగాలకు సందేశమిచ్చారు. దీంతో రాబోయే బడ్జెట్‌లో కేటాయింపులపై అన్ని విభాగాల్లోనూ ఆందోళన మొదలైంది. 2015-16లో రూ.1,15,689 కోట్లతో బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం రూ.52,383 కోట్ల ప్రణాళిక వ్యయం, రూ.63,306 కోట్ల ప్రణాళికేతర వ్యయం అంచనా వేసింది. అందులో నీటిపారుదల శాఖకు రూ.8,000 కోట్లు కేటాయించగా, వచ్చే ఏడాది నుంచి రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. దీంతో నీటిపారుదల శాఖకు అదనంగా అవసరమయ్యే రూ.17 కోట్లను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయటం తప్పనిసరని ఆర్థిక శాఖ గుర్తించింది.
 
రెవెన్యూ పెరిగినా...
గత బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 10-15 శాతం పెరిగే అవకాశముంది. కానీ, కచ్చితంగా చెల్లించాల్సిన పద్దులు, వాస్తవ రెవెన్యూ రాబడుల ఆధారంగా నీటిపారుదల శాఖకు ఇచ్చే సింహభాగాన్ని ఇతర శాఖల్లో కత్తెర వేయక తప్పదని ఉన్నతాధికారులు చెప్పారు. రైతుల రుణమాఫీ పథకం మూడో విడతకు రూ.4,250 కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు, ఉచిత విద్యుత్ రాయితీ, ఆసరా పెన్షన్ల చెల్లింపుల్లో కోత పెట్టే పరిస్థితి లేదు. ఇదే సమయంలో ప్రతిష్టాత్మక సన్న బియ్యం పథకం, కళ్యాణ లక్ష్మి, వాటర్ గ్రిడ్, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకాలకు పెద్దపీట వేయాల్సి ఉంటుంది. అందుకే మిగతా శాఖలన్నీ ప్రస్తుత బడ్జెట్‌కు మించి నిధుల అంచనాలు వేసుకోవద్దని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ ఏడాది ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, పెన్షన్లన్నీ అంచనాకు మించి పెరిగిపోయాయి. దీంతో ప్రణాళికేతర వ్యయంలో కోత పెట్టే పరిస్థితి లేదు.
 
గత ఏడాదితో పోలిస్తే అన్ని రంగాల్లో రెవెన్యూ పెరిగింది. నవంబర్ నాటికి రూ.31 వేల కోట్ల ఆదాయం ఆర్జించినట్లు ఆర్థిక శాఖ చెప్పింది. వ్యాట్ సేల్స్‌టాక్స్, ఎక్సైజ్ ఆదాయం 18 శాతం పెరగగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 30 శాతం పెరగడం విశేషం. రవాణా శాఖలో 20 శాతం వృద్ధి కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే దేశంలోనే అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి రేటు కనిపించిందని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కానీ, అంచనాలకు సరిపడే ఆదాయం రాకపోవటంతో ఈ ఏడాది వ్యయం రూ.90 వేల కోట్లకు మించే పరిస్థితి లేదు.
 

మరిన్ని వార్తలు