అమ్మో చిరుత!

23 Jan, 2019 05:59 IST|Sakshi
క్యాంపస్‌లో మృతి చెందిన గేదె

హెచ్‌సీయూలో మళ్లీ పుకార్లు  

క్యాంపస్‌లో మరణించిన గేదె  

కుక్కల దాడేనని అధికారుల స్పష్టీకరణ  

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో చిరుత ఉందని మళ్లీ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి క్యాంపస్‌లోని గోప్స్‌ ప్రాంతంలో గేదె మృతి చెంది ఉండడంతో, దాన్ని చిరుతే చంపిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం ఉదయం వర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్‌లెన్స్‌ బృందం గమనించి, కుక్కలే దాడి చేసి ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే గేదె ముఖం భాగంలో గాయాలుండడం, భారీ రక్తస్రావం కావడంతో పలువురు చిరుతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గేదె మరణించిన ప్రదేశానికి సమీపంలోని బురదలో కాలి గుర్తులు పడ్డాయి. అవి చిరుతవని పలువురు అనుమానిస్తుండగా, కాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు. 

నమ్మొద్దు...  
క్యాంపస్‌లోకి చిరుత ప్రవేశించిందని గత కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, వైల్డ్‌లైన్‌ బృందం ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి గమనించినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో చిరుత క్యాంపస్‌లో లేదని అధికారులు పేర్కొంటున్నారు. వదంతులను నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు.

వేటగాళ్ల బెడద...  
హెచ్‌సీయూ క్యాంపస్‌లో కుక్కల బెడదను తీర్చేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. అన్యాయంగా మూగజీవాలు బలవుతున్నా పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వేటగాళ్లు తరచూ క్యాంపస్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలోకి చొరబడి జంతువులను వేటాడుతున్నారని పేర్కొంటున్నారు. ఎవరూ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు