తక్షణ పరిష్కారాంశాలపై చర్చించండి 

29 Jun, 2019 02:07 IST|Sakshi

అధికారులకు ఏపీ, తెలంగాణ సీఎంల ఆదేశం

జూలై 15లోగా గోదావరి జలాలపై నివేదికకు సూచన

సీఎంల భేటీ వివరాలను వెల్లడించిన మంత్రులు ఈటల, బుగ్గన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన సమస్యలకు సంబంధించి తక్షణమే పరిష్కరించుకోగల అంశాలపై సమావేశమై చర్చించాలని ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులను తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్‌రావు, వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. శుక్ర, శనివారాల్లో చర్చలు చేపట్టాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థికపర వివాదాలపై ఈ సమావేశాల్లోనే అధ్యయనం జరిపి ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల సీఎస్‌లను కేసీఆర్, జగన్‌ ఆదేశించారని బుగ్గన తెలిపారు.

గోదావరి నదీ జలాల సంపూర్ణ వినియోగంపై జూలై 15లోగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారన్నారు. అన్నదమ్ముల్లా ఇచ్చిపుచ్చుకునే విధానంలో ముందుకెళ్లాలని, దేశానికి ఒక మార్గదర్శకం కావాలనే ఆలోచన చేయాలని అధికారులను కోరారన్నారు. గోదావరి జలాల సంపూర్ణ వినియోగంతోపాటు రాష్ట్ర విభజన సమస్యలపై తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో చర్చించిన అంశాలను రెండు రాష్ట్రాల మంత్రులు ఈటల రాజేందర్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉమ్మడి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ, ఏపీ వ్యవసాయ రంగంలో దేశంలోనే గొప్ప రాష్ట్రాలుగా ఎదగడానికి, నీళ్లు, విద్యుత్‌ కష్టాలు నిర్మూలించుకోవడానికి పటిష్ట పునాది వేసుకోవడంలో ముందడుగు పడిందన్నారు. ఇదే ఒరవడి, సంప్రదాయాన్ని  కొనసాగించాలని భావిస్తున్నామన్నారు.  

విడిపోయినా కలిసే ఉంటాం: ఈటల 
ఒకప్పుడు అన్నదమ్ముల్లా కలసిమెలసి జీవించిన ఆ నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా మళ్లీ అన్నదమ్ముల్లుగా కలసిమెలసి జీవించే సంప్రదాయాన్ని నెలకోల్పాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇరు రాష్ట్రాల ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలనే అభిప్రాయానికి వచ్చారన్నారు. విడిపోయిన రాష్ట్రాలు కలసకట్టుగా, గొప్పగా ఉన్నత స్థితికి వెళ్తున్నాయనే సందేశాన్ని యావత్‌ దేశానికి ఇవ్వాలని సీఎంలిద్దరూ సంకల్పించారన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నీటిపారుదలరంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు.

ఇతర చిన్న అంశాలూ ప్రస్తావనకు వచ్చాయన్నారు. నీళ్ల కోసం ప్రజలు ఎలా తపనపడ్డారో, బోర్లు వేసి బావులు తవ్వి కరెంట్‌ కోసం ఎన్ని కష్టాలు పడ్డారో, కరువు కాటకాల్లో ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో ఆ నాటి ఉద్యమ నేతగా కేసీఆర్‌ కళ్లారా చూశారన్నారు. అందుకే తాగు, సాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ఏపీ, తెలంగాణ మెట్ట ప్రాంతాలైన కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు నీటి తరలింపు కోసం అధ్యయనం జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని ఇరు రాష్ట్రాల ఇంజనీరింగ్‌ నిపుణులు, రిటైర్డ్‌ ఇంజనీర్లను సీఎం కేసీఆర్‌ కోరారన్నారు. తెలంగాణలో సాగు, తాగునీటి సమస్యను అధిగమించేందుకు తీసుకున్న చర్యలను ఏపీ సీఎం జగన్‌కు కేసీఆర్‌ వివరించారన్నారు. దేశంలో ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలన్న ఉద్దేశంలో భాగంగానే గతంలో మహారాష్ట్రతో జల ఒప్పందం కుదుర్చుకున్నామని, కర్ణాటకతో సరిహద్దులు మార్చుకున్నామని ఈటల గుర్తు చేశారు. అదే కోవలో ఏపీతో కలసిమెలసి ఉంటున్నామన్నారు. 

చరిత్రాత్మక రోజు: బుగ్గన 
ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశమైన రోజును చరిత్రాత్మకమైనదిగా ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభివర్ణించారు. ఏపీ, తెలంగాణ సీఎంలు, మంత్రులు, సీఎస్‌లు, సలహాదారులు సమావేశమై రెండు రాష్ట్రాలు కలసిమెలసి నదీ జలాలను వినియోగించడంపై దిశానిర్దేశం చేసుకోవడం జరిగిందన్నారు. ఏపీ సీఎం జగన్‌ గత ఐదేళ్లు ప్రధాన ప్రతిపక్ష నేతగా, అంతకు ముందు నాలుగున్నరేళ్లు ముఖ్యమైన ప్రతిపక్ష నాయకుడిగా ఏపీలో విస్తృతంగా పర్యటించారని బుగ్గన గుర్తుచేశారు. ఓదార్పు యాత్ర, ఎన్నికల పర్యటనలు, గతేడాది 3,600 కి.మీ. పాదయాత్ర నిర్వహించిన జగన్‌కు ఏపీలో ఎక్కడ నీటి ఎద్దడి ఉంది? సాగు, తాగునీటికి ఇబ్బంది ఎక్కడెక్కడ ఉందనే విషయమై బాగా అవగాహన ఉందన్నారు. అందుకే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు కలసి గోదావరి, ఇతర నదుల జలాలను ఏయే ప్రాంతాలకు ఎక్కువ అవసరముందో అక్కడికి తరలించుకోవడానికి పరిశీలించాయన్నారు. నాయకులుగా కాకుండా రాజనీతిజ్ఞులుగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఆలోచించారన్నారు. ‘మనం ఒకరి దగ్గరకు పోవాల్సిన అవసరమేముంది. మనమే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు’అని సీఎంలిద్దరూ అభిప్రాయపడ్డారన్నారు. ఏపీ, తెలంగాణ ప్రజలంతా ఒకటేననే స్ఫూర్తిని అధికారులకు కలిగించారన్నారు.  

మరిన్ని వార్తలు