జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించండి

7 Oct, 2018 02:00 IST|Sakshi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి

సాక్షి, హైదరాబాద్‌: ఘనవ్యర్ధాల నిర్వహణకు సంబంధించి మేజర్‌ గ్రామ పంచాయతీలను, పట్టణాభివృద్ధి సంస్థలను దృష్టిలో ఉంచుకుని జిల్లా స్థాయి కార్యచరణ ప్రణాళికలను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి ఆదేశించారు. శనివారం సచివాలయంలో ఘనవ్యర్థాల నిర్వహణ 2018 నిబంధనల అమలుపై సీఎస్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘనవ్యర్థాల నిర్వహణకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)ఆదేశాల మేరకు డంపింగ్‌ యార్డులను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలన్నారు. నిర్ణీత కాల వ్యవధి ప్రణాళికలు ఉండాలని, జిల్లాల్లో అవసరమైన డంపింగ్‌ సైట్లను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు.

రాష్ట్రంలో 72 మున్సిపాలిటీలకు డీపీఆర్‌లు తయారుచేశామని, నూతనంగా ఏర్పడిన మరో 68 మున్సిపాలిటీల డీపీఆర్‌లు తయారు చేయాలని ఆదేశించారు. ఘనవ్యర్థాల నిర్వహణకు రూల్స్‌ 2016 అమలుకు అవసరమైన నిధుల ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్జీటీ ఆదేశాల ప్రకారం గత నెల 28న చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ పర్యవేక్షణ కమిటీ సమావేశం చైర్మన్‌ జ్యోతిమణి అధ్యక్షతన జరిగిందని, మన రాష్ట్రంలో ఘనవ్యర్థాల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించామని సీఎస్‌కు తెలిపారు.

ఎన్జీటీ ఆదేశాల అమలుకై స్వచ్ఛ ఆటోలు, ఈ–ఆటోలు, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, జవహర్‌ నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ క్యాపింగ్‌ పనులను చేపట్టినట్లు వివరించారు. పీసీబీ, మున్సిపల్‌ శాఖ సమన్వయంతో ఎన్జీటీ ఆదేశాల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌కు చెప్పారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, పీసీబీ కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, సీడీఎంఏ టి.కె.శ్రీదేవి, ఈపీటీఆర్‌ఐ, డీజీ కల్యాణ చక్రవర్తి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు