కుంగిన బహుళ అంతస్తుల భవనం 

22 Aug, 2018 02:19 IST|Sakshi
భవానీనగర్‌ కాలనీలో కుంగిపోయిన భవనం

భారీ శబ్దంతో సెల్లార్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తిగా భూమిలోకి..  

రూ.1.50 కోట్లకు పైగా ఆస్తి నష్టం  

వరంగల్‌లో కలకలం 

కాజీపేట: నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయిన ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. కాజీపేట పట్టణంలోని 35వ డివిజన్‌ భవానీనగర్‌ కాలనీలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్‌–4 భవనం మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ శబ్దంతో ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. సెల్లార్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ పూర్తిగా భూమిలోకి కనిపించకుండాపోయాయి. దీంతో నాలుగంతస్తుల భవనం కాస్తా రెండంతస్తుల భవనంగా మారిపోయింది. వివరాల ప్రకారం...కొత్త రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి జీ ప్లస్‌–4 పద్ధతిలో కొత్త ఇంటి నిర్మాణ పనులు చేయిస్తున్నాడు. ఏడాది నుంచి పనులు కొనసాగుతున్నాయి. కూలీలు మంగళవారం ఉదయం భవనానికి ప్లాస్టరింగ్‌ పనులు చేసి ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే, రాత్రి 10 గంటల ప్రాంతంలో భవనం ఒక్కసారిగా భూమిలోకి కుంగిపోయింది. నాణ్యత ప్రమాణాలను పాటించని కారణంగానే భవనం భూమిలోకి కుంగిపోయి ఉంటుందని మేస్త్రీలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఎడతెరిపి లేని వానలు కూడా ఓ కారణమని అంటున్నారు. ఈ ఘటనలో దాదాపు రూ.1.50 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.  

కదిలి వచ్చిన అధికార యంత్రాంగం... 
భవనం కుంగిపోయిందనే సమాచారంతో జిల్లా అధికార యంత్రాంగం అరగంటలో భవానీనగర్‌కు చేరుకుని వివరాలను సేకరించడంలో నిమగ్నమయ్యారు. పోలీసు అధికారులు, ఫైర్‌స్టేషన్, మున్సిపల్‌ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఏసీపీ సత్యనారాయణ, సీఐలు శ్రీలక్ష్మి, సంతోష్, అజయ్‌ పూర్తి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి స్థానికులెవరినీ భవనం దరిదాపులకు వెళ్లకుండా పర్యవేక్షణ చేస్తున్నారు.  

వాచ్‌మన్‌ ఆచూకీపై అనుమానాలు...  
ఏడాది కాలంగా ఈ భవన నిర్మాణ పనుల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న వాచ్‌మన్, ఘటన తర్వాత కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళ కావడంతో కుటుంబంతో ఆ భవనంలో నిద్రిస్తున్నాడా.. లేక బయట ఉన్నాడా అని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.   

మరిన్ని వార్తలు