యువతి శరీరంలో మూడేళ్లుగా బుల్లెట్‌!

22 Dec, 2019 22:33 IST|Sakshi

కారణం తెలియదంటున్న కుటుంబీకులు

దర్యాప్తు చేస్తున్న పోలీసులు 

బాధితురాలి వయసు 18 ఏళ్లు

సాక్షి, హైదరాబాద్‌ : వెన్నునొప్పి చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి శరీరంలో బుల్లెట్‌ బయటపడటం నిమ్స్‌ ఆస్పత్రిలో కలకలం రేపింది. వివరాలు.. ఫలక్‌నుమా జహ్నుమా ప్రాంతంలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె(18) స్థానికంగా కుట్టుమిషన్‌ పనిచేస్తోంది. 3 నెలలుగా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో చికిత్స కోసం ఆమె నిమ్స్‌లో చేరింది. వైద్యులు ఎక్స్‌రేతోపాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి వెన్నుపూస, ఉదర కోశం భాగంలో గాయమున్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో సదరు యువతికి శస్త్రచికిత్స నిర్వహించగా బుల్లెట్‌ బయటపడింది. దీంతో కంగుతిన్న వైద్యులు బుల్లెట్‌ ఎక్కడ నుంచి వచ్చిందని యువతి కుటుంబ సభ్యులను ప్రశ్నించగా వారు తెలియదని సమాధానం ఇచ్చారు. యువతి శరీరంలో బుల్లెట్‌ రెండు, మూడేళ్ల క్రితం నుంచి ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. దీనిపై నిమ్స్‌ ఉన్నతాధికారులు పంజగుట్ట పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు ఫలక్‌నుమా పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో వీరు ఎక్కడ నివాసం ఉన్నారు..? ఆ ప్రాంతంలో ఏదైనా ఫైరింగ్‌ పాయింట్‌ ఉందా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

మరిన్ని వార్తలు