అంతుచిక్కని తూటా రహస్యం!

24 Dec, 2019 02:02 IST|Sakshi

నోరు మెదపని ఆస్మాబేగం కుటుంబీకులు

సైబరాబాద్‌ ఉదంతంతో లింకులపై అనుమానం

ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న సిటీ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో/పంజగుట్ట /చాంద్రాయణగుట్ట: పాతబస్తీలోని జహనుమ ప్రాంతానికి చెందిన ఆస్మాబేగం శరీరం నుంచి బుల్లెట్‌ బయటపడిన ఘటన మిస్టరీగా మారింది. దీనిపై ఆస్మా కుటుంబీకులు నోరిప్పడం లేదు. శాంతిభద్రతల విభాగం, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా తూటాను పేల్చినప్పుడు దానిపై రైఫ్లింగ్‌ మార్క్స్‌ పడతాయి. వీటి ఆధారంగా సదరు ఆయుధం ఎటువంటిదనేది తెలుస్తుంది. అయితే తూటా సుదీర్ఘకాలం ఆస్మాబేగం శరీరంలో ఉండిపోవడంతో దానిపై ఎలాంటి రైఫ్లింగ్‌ మార్క్స్‌ లేవు. దీంతో బుల్లెట్‌ను పరిశీలించిన నిపుణులు .32 క్యాలిబర్‌కు చెందినదని అభిప్రాయపడుతున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించి బాలిస్టిక్‌ నిపుణులతో పరీక్ష చేయించాలనీ అంటున్నారు.

నాటి కాల్పుల ఘటనతో లింకు? 
తూటా గుట్టు తేల్చేందుకు పోలీసులు ఆస్మా కుటుంబీకుల కాల్‌ డిటైల్స్‌ను సేకరిస్తున్నారు. మరోపక్క రెండేళ్ల క్రితం మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో చోటు చేసుకున్న హత్యా యత్నం కేసుతో ఈ ఉదంతానికి ఉన్న లింకును పోలీసులు అధ్యయనం చేస్తున్నారు. ఆస్మాబేగం తండ్రి 20 ఏళ్లుగా పాతబస్తీకి చెందిన ఓ బడాబాబు వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ బడాబాబు కుమారుడు, మరొకరు కలిసి నగర శివార్లలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. కింగ్స్‌ కాలనీలో ఉన్న బడాబాబు కుమారుడి కార్యాలయంలో 2017 నవంబర్‌లో విందు జరిగింది. అప్పుడు కాల్పులు జరిగి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

కేసు నమోదు చేసిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు బడాబాబు కుమారుడితో పాటు అతడి తుపాకీ కోసం కొన్ని రోజులు గాలించారు. అప్పట్లో అతగాడు తన తుపాకీని తన తండ్రి వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆస్మా తండ్రి ఇంట్లో దాచి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన మిస్‌ఫైర్‌తోనే తూటా ఆస్మాబేగం శరీరంలోకి దూసుకుపోయి ఉంటుందని, ఘటన బయటపడకుండా ఆస్మాకు రహస్యంగా వైద్యం చేయించి ఉండొచ్చని అనుకుంటున్నారు. తాజాగా ఆమె నొప్పితో నిమ్స్‌లో చేరగా, శస్త్రచికిత్సలో తూటా బయటపడిందని భావిస్తున్నారు. కాగా, బడాబాబు కుమారుడి ఆయుధాన్ని మళ్లీ బాలిస్టిక్‌ పరీక్షలకు పంపాలని భావిస్తున్నారు.

జహనుమాలో కలకలం 
ఆస్మాబేగం ఘటనతో ఫలక్‌నుమా జహనుమాలో కలకలం రేగింది. జహనుమాలో ఉండే వజీర్, నూర్జహా దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఆస్మాబేగం (18) సంతానం. మూడేళ్లుగా ఆస్మా వెన్నునొప్పితో బాధపడుతోంది. శనివారం నిమ్స్‌కు వెళ్లగా, సర్జరీ చేసి తూటాను బయటకు తీసిన విషయం తెలిసిందే. కాగా వైద్యులు చెప్పినట్లు ఆస్మాబేగం కడుపులో ఎలాంటి బుల్లెట్‌ లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. అయితే, యువతి తల్లిదండ్రులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సోమవారం విచారించారు.

ఘటనపై కేసు నమోదు 
మొదట సాధారణ పేషంట్‌ కింద ఆస్మాకు సర్జరీ చేసిన నిమ్స్‌ వైద్యులు.. ఆమె వెన్నుపూస (ఎల్‌ 1, ఎల్‌ 2) ప్రాంతంలో బుల్లెట్‌ ఉండడంతో వెంటనే కేసును మెడికో లీగల్‌ కేసు (ఎమ్‌ఎల్‌సీ) కింద మార్చి ఉన్నతాధికారులకు, పోలీసులకు తెలిపారు. పోలీసులు ఐపీసీ 307 హత్యాయత్నం, 27 ఆఫ్‌ ఆరŠమ్స్‌ యాక్ట్‌ ఆయుధ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సర్జరీ అయిన మర్నాడే ఆస్మాబేగంను నిమ్స్‌ వైద్యులు డిశ్చార్జ్‌ చేయడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు