కాంగ్రెస్‌ను పాతరేస్తేనే బంగరు తెలంగాణ

18 Apr, 2017 00:43 IST|Sakshi
కాంగ్రెస్‌ను పాతరేస్తేనే బంగరు తెలంగాణ

ప్రాజెక్టులు అడ్డుకుంటూ.. రైతుల నోట్లో మట్టికొడ్తున్నరు
► కాంగ్రెస్‌ నాయకులకు రాజకీయ నిరుద్యోగ భృతి ఇస్తాం
► జగిత్యాల జనహిత ప్రగతి సభలో కేటీఆర్‌


సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్‌ను ఉప్పుపాతరేస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని పంచాయతీ రాజ్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. అపురూపమైన కార్యక్ర మాలు, పథకాలు ప్రవేశపెడితే కాంగ్రెసోళ్లకు మనసునపట్టక.. మూడేళ్లు కూడా నిండని ముక్కుపచ్చలారని ప్రభుత్వంపై మాటల యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. మేం అధి కారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తమని కాంగ్రెస్‌ నాయకుడు ఉత్తమ్‌కుమార్‌ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నడు.. కానీ, ‘అన్నా.. పొరపా టున కూడా కేంద్రం కానీ.. రాష్ట్రంలో కానీ మళ్లీ మీరు అధికారంలోకి రారు. రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయే మీకు నిరుద్యో గ భృతి ఇచ్చేది టీఆర్‌ఎస్‌ పార్టీయే’ అన్నారు.

ధర్మపురి, కొండగట్టు అభివృద్ధి...
ధర్మపురిలోని లక్ష్మీనృసింహస్వామి, కొండ గట్టు ఆంజనేయస్వామి దేవాలయాలను యాదాద్రి, వేములవాడ ఆలయాల స్థాయిలో అభివృద్ధి చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రణాళికలు రూపొందు తున్నాయని చెప్పారు. ఎన్నికలు 2018లో వచ్చినా.. దానికి ముందొచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి కరీం నగర్‌ జిల్లాలో ఎమ్మెల్యే సీటు కోల్పోయిన జగిత్యాల నుంచే టీఆర్‌ఎస్‌ జైత్ర యాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ పాల నను సంక్షేమానికి స్వర్ణయుగంగా.. దేశా నికే ఆదర్శంగా అభివర్ణించారు. సోమవారం జగి త్యాలలో జరిగిన జనహిత ప్రగతి సభలో ఆయన ప్రసంగించారు.

కృష్ణా.. గోదావరి నదుల నుంచి న్యాయబద్ధంగా తెలంగాణకు రావల్సిన 1,200 టీఎంసీల జలాల వాటా కోసం సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారన్నారు. నీళ్లు.. నిధులు.. నియామకాల శీర్షిక మీద పని చేస్తోన్న సీఎం.. కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులపై బ్యారేజీల నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. తద్వారా పూర్వ కరీం నగర్‌ జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు ఇక్కడి సగం గోదావరి నీళ్లను ఉత్తర తెలంగాణకు తరలించి, సస్యశ్యామలం చేసేం దుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చనిపోయిన వారి పేర్లతో కోర్టులో కేసులేస్తూ, ప్రాజెక్టులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ.. రైతుల నోట్లో మట్టికొడు తున్నారని చెప్పారు.

2004లో కేంద్రంలో ఉనికిపోయిన కాంగ్రెస్‌ పార్టీ అప్పటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చిందన్నారు. నాడు తెలంగాణ ఇస్తామని మాటిచ్చి ముఖం చాటేసిన యూపీఏ ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. కేంద్ర పదవిని సైతం త్యాగం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రి పదవికి బేరం కుదుర్చుకున్న జీవన్‌రెడ్డి 2006 ఎన్నికల్లో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 2001 వరకు కేవలం రాజమండ్రి వరకే గోదావరి పుష్కరాలు పరిమితమయ్యాయని కేటీఆర్‌ చెప్పారు.

కానీ 2001 ప్రత్యేక ఉద్యమ సమయంలో తెలంగాణలోనూ గోదావరి పారుతుందని చెప్పి... నాటి సీఎం చంద్ర బాబునాయుడిని ధర్మపురికి రప్పించిన ఘనత కేసీఆర్‌దన్నారు. రైతు కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్‌.. ఎరువుల కోసం ఎకరానికి రూ.4వేల చొప్పున ప్రకటించారన్నారు. పోలీస్‌ స్టేషన్లలో పెట్టి ఎరువులను పంపిణీ చేసిన ఘనత మీది కాదా అని కాంగ్రెస్‌ నేతల ను ప్రశ్నించారు. షాదీముబారక్, కల్యాణ లక్ష్మి, నిరుపేద విద్యార్థులకు సన్నబియ్యం పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక సీఎం కేసీఆర్‌ అన్నారు. ఇంటింటికి నల్లానీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన దమ్ము న్న నేత సీఎం కేసీఆర్‌యే అన్నారు.

కాంగ్రెస్‌ది దుర్మార్గపు పాలన
రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. అరవై ఏళ్ల కాంగ్రెస్‌ పాలనను దుర్మర్గపు పాలనగా అభివర్ణించారు. మూడేళ్లలోనే కేసీఆర్‌ రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించారన్నా రు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, నిజామాబాద్, పెద్దపల్లి ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమా, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు