కల్వర్టును ఢీకొట్టిన బస్సు

9 Apr, 2019 15:49 IST|Sakshi
ప్రమాదానికి గురైన బస్సు

33మందికి గాయాలు

చిత్రియాల వద్ద ఘటన

చందంపేట (దేవరకొండ) : బ్రేకులు ఫెయిలైన బస్సు కల్వర్టును ఢీకొట్టడంతో 33 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని చిత్రియాలలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు..  కాంగ్రెస్‌ పార్టీ నల్లగొండ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించేం దుకు కాంగ్రెస్‌ పార్టి నాయకురాలు, సినీ నటి విజయశాంతి దేవరకొండలో నిర్వహించనున్న రోడ్‌షోలో పాల్గొననుండడంతో వివిధ ప్రాంతాల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు దేవరకొండకు వివిధ వాహనాల్లో బయల్దేరి వెళ్లారు.

కాగా ఎటువంటి అనుమతులు లేకుండా కాలం చెల్లిన చిత్రియాల గ్రామానికి చెందిన వివేకానంద యూపీఎస్‌ పాఠశాల బస్సులో సామర్థ్యానికి మించి సుమారు 65 మందిని దేవరకొండకు తరలించారు. కాగా చిత్రి యాల గ్రామ శివారులోని మూలమలుపులు(లోయల ప్రాంతం) ఎల్లమ్మగుడి వద్ద ఒక్కసారిగా బ్రేకులు ఫేల్‌ కావడంతో మూలమలుపులోని కల్వర్టును ఢీకొట్టింది. అదే బస్సులో ప్రయాణిస్తున్న స్థానిక సర్పంచ్‌ కాకనూరి రంగయ్య, కుంభం కాశమ్మ తీవ్ర గాయాలయ్యాయి.

వీంతో పాటు మరో 31 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంత మంది బస్సులోనే ఇరుక్కుపోవడంతో జేసి సహాయంతో క్షతగాత్రులను వెలికితీశారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని కూడా హైదరాబాద్‌కు తరలించాలని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. 

హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి..

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కొంత మంది విధుల్లో లేనప్పటికి ఉన్నత వైద్యాధికారుల ఆదేశాల మేరకు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడే సమాచారం అందడంతో వైద్య సిబ్బంది అన్ని ఏర్పాట్లను చేపట్టారు. క్షతగాత్రులను దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మరికొంత మందిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రామకృష్ణ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. 

ఉలిక్కిపడ్డ చిత్రియాల 

చిత్రియాల గ్రామంలో గత స్థానిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించినప్పటికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కాకనూరి రంగయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నత హోదా, ప్రముఖ వ్యాపార వేత్త అదే గ్రామం కావడంతో గ్రామస్తులంతా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను దేవరకొండకు చేర్చేందుకు, విజయశాంతి రోడ్‌షోను విజయవంతం చేసేందుకు కార్యకర్తలను తరలించేందుకు చర్యలు చేపట్టడంతో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్న ఈ నేపథ్యంలో సుమారు 60 మంది బస్సులో ప్రయాణిస్తుండగా 33 మందికి గాయాలు కావడంతో గ్రామంలో ఏం జరిగిందోనన్న ఆవేదన పెరిగిపోయింది. 33 మందికి గాయాలు కావడంతో చిత్రియాల గ్రామం ఉలిక్కిపడింది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా