ఓటుతో బుద్ధి చెబుతాం 

11 Aug, 2018 12:32 IST|Sakshi
కల్వకుర్తిలో అభివాదం చేస్తున్న బీసీ నాయకులు    

గంపెడు శాతానికి  పిడికెడు ఫలాలు

రాజకీయ గులాంగిరీ మారాలి

బీసీలలో సామాజిక చైతన్యం కోసమే బస్సుయాత్ర

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌

కల్వకుర్తి మహబూబ్‌నగర్‌ : ఓటు అనే వజ్రాయుధంతో బీసీలు రానున్న 2019ఎన్నికలలో అగ్రవర్ణ కులాలకు తగిన బుద్ధి చెబుతామని, రాజకీయ గులాంగిరీ కోసం బీసీలను వాడుకుంటున్నారని.. రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా శ్రీనివాస్‌గౌడ్‌ చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది.

ఈ సందర్భంగా కల్వకుర్తి రఘుపతిపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఏ ఉద్యమం చేసినా బీసీలే ప్రాణత్యాగాలు చేశారని, అన్ని ఉద్యమాలు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. గంపెడు శాతం ఉన్న బీసీలకు రాజకీయంలో పిడికెడు ఫలాలు మాత్రమే అందుతున్నాయని, అదే పిడికెడు శాతం ఉన్న అగ్రవర్ణ కులాల వారికి గంపెడు ఫలాలు దక్కుతున్నాయని అన్నారు. తనను ఎంతో ఆప్యాయంగా పలకరించి, బస్సుయాత్రకు స్వాగతం పలికిన ఉమ్మడి పామూరు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు నేను ఎప్పటికీ మరిచిపోనని తెలిపారు.

కల్వకుర్తి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికలలో బీసీని ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని, అందుకొరకు నియోజకవర్గంలోని బీసీలందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అగ్రకులాల వారు ఎన్ని ప్రయత్నాలు చేసి, వారి కింద పనిచేసే వారిగానే బీసీలను గుర్తించారని వారందరికీ తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని, అప్పటి ముఖ్యమంత్రిని కాదని బీసీ నాయకుడైన చిత్తరంజన్‌ దాస్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి, మంత్రిని చేసిన ఘనత కల్వకుర్తి ప్రజలకు దక్కుతుందని అన్నారు.

ఇలాంటి చైతన్యవంతమైన కల్వకుర్తి ప్రాంతంలో 2019 ఎన్నికలలో బీసీ నాయకుడిని చట్ట సభలకు పంపించాల్సిన అవసరం నా కుల బాంధవులైన బీసీలపై ఉందని పిలుపునిచ్చారు.అనంతరం బీసీల ఐక్యతను చాటాలని బీసీ నాయకులందరితో కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బీసీ నాయకులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఆచారి, బాలాజీ సింగ్, పురపాలిక చైర్మన్‌ రాచోటి శ్రీశైలం, బాలస్వామి గౌడ్, సదానందం, కానుగుల జంగయ్య, రాజేందర్, నాగేష్‌ గౌడ్, రామకృష్ణ గౌడ్, కాశన్న యాదవ్, శ్రీను, బుగ్గయ్య గౌడ్, పెద్దయ్య యాదవ్, యుగంధర్, శేఖర్, బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంట్, అసెంబ్లీలకు వెళ్లాలి

తెలకపల్లి : బీసీలు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచి పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలలో అడుగు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. బీసీల చైతన్య యాత్ర శుక్రవారం తెలకపల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా భారీ ఎత్తున బీసీలు వారికి స్వాగతం పలికారు. అనంతరం నెహ్రూ చౌరస్తాలో మాట్లాడుతూ పిడికెడు జనాభా ఉన్న వారు రాజ్యమేలుతుంటే గుప్పెడు జనాభా ఉన్న వారు పాలితులుగా ఉన్నారని అన్నారు.

రాబోయే ఎన్నికల్లో బీసీలను ఆయా స్థానాలలో నిలబెట్టి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓట్ల ద్వారా వచ్చే ఎన్నికల్లో దొరలు, పటేళ్లకు బుద్ధి చెప్పాలని సూచించారు. పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు అనే నినాదంతో ముందుకెళ్తున్నామని, బీసీలంతా కలిసికట్టుగా రావాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కాశన్న యాదవ్, రాముయాదవ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు