‘ఆయిల్‌ఫెడ్’లో అధికారుల ఇష్టారాజ్యం

19 Sep, 2016 02:20 IST|Sakshi
‘ఆయిల్‌ఫెడ్’లో అధికారుల ఇష్టారాజ్యం

- అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి పాత బాయిలర్ కొనుగోలు
- ప్రారంభించి నెల దాటినా పనిచేయని వైనం
- కీలక సమయంలో 4 నెలలు ఫ్యాక్టరీ మూసివేత... రూ.12 కోట్లు నష్టం
 
 సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణ వివాదంగా మారింది. పామాయిల్ ఫ్యాక్టరీ ఆధునికీకరణ, విస్తరణను గత నెల 16న స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ ప్రారంభించారు. పనిచేయని పాత బాయిలర్‌ను ఏర్పాటు చేయడంతో అది ఇంకా పనిచేయడం లేదు. తాజాగా శనివారం బాయిలర్ అధిక ఉష్ణోగ్రత కారణంగా అందులోని గోడలు విరిగి పడిపోయాయి. దీంతో అది పని చేస్తుందా లేదా అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో పామాయిల్ తోటలు అధికంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఉన్నాయి. వాటిని రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన బాధ్యత అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీదే.

రోజు రోజుకూ పామాయిల్ సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో అదే జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేటలో మరింత సామర్థ్యంతో సుమారు రూ.75 కోట్లతో మరో కొత్త ఫ్యాక్టరీకి రంగం సిద్ధం చేశారు. అది సిద్ధమయ్యేలోగా ప్రస్తుతం అశ్వారావుపేటలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని విస్తరించాలని నిర్ణయించారు. గంటకు 30 టన్నులకు పెంచాలనేది దీని ఉద్దేశం. అందుకోసం జాప్రో అనే కంపెనీకి విస్తరణ యంత్రాలను అందించేందుకు టెండర్ అప్పగించారు. సరఫరా చేసే యంత్రాల్లో కీలకమైన బాయిలర్‌ను ఆ కంపెనీకి అప్పగించలేదు. ముంబయిలో ఒక పాత దాన్ని రూ.1.90 కోట్లకు కొనుగోలు చేశారు. వాస్తవంగా కొత్త బాయిలర్ ఖరీదు రూ.2.50 కోట్లు ఉండగా పాతదాన్ని అంతధరకు ఎందుకు కొనుగోలు చేశారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ బాయిలర్‌కు బదులు కోల్ బాయిలర్ కొనుగోలు చేయడం గమనార్హం. కొందరు అధికారులు కమీషన్ల కోసమే ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆయిల్‌ఫెడ్ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. నెల రోజులుగా విస్తరణ విభాగం పనిచేయడంలేదు. విస్తరణ కోసం నాలుగు నెలలపాటు ఫ్యాక్టరీని మూసేశారని, దీనివల్ల 40 వేల టన్నుల పామాయిల్ గెలలను ఇతర చోట్లకు పంపారని, ఫలితంగా ఆయిల్‌ఫెడ్‌కు రూ. 12 కోట్లు నష్టం వచ్చిందని  ఆరోపించారు.

 నాలుగైదు రోజుల్లో మరమ్మతులు పూర్తి: మురళి, ఎం.డి., ఆయిల్‌ఫెడ్
 బాయిలర్ అధిక వేడి కారణంగా అందులోని గోడలు పగిలిపోయిన మాట వాస్తవమేనని ఆయిల్‌ఫెడ్ ఎం.డి. మురళి  అశ్వారావుపేటలో విలేకరులకు తెలిపారు. త్వరలో బాగు చేసి నడిపిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు