విను వీధిని తాకిన విశ్వంభర నాదం

13 Jun, 2017 00:41 IST|Sakshi
విను వీధిని తాకిన విశ్వంభర నాదం

అస్వస్థతతో సి. నారాయణరెడ్డి కన్నుమూత
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సారస్వతమూర్తి..
చిన్నతనం నుంచే కవితాసేద్యం.. మారుమూల పల్లె నుంచి ప్రస్థానం..
అలంకరించిన పదవులు ఎన్నో..  వరించిన పురస్కారాలు మరెన్నో..
సినారె కన్నుమూతపై సినీ, రాజకీయ, సాహితీవేత్తల దిగ్భ్రాంతి..
ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో రేపు అంత్యక్రియలు


అవును...
నీవు పుట్టకముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ల కింద ధూళి పొర...

 కానీ...
నీవు పుట్టాకే..
ఆ నీలి తెర అక్షర పరిమళాలను అద్దుకుంది..
ఆ ధూళి పొర జ్ఞానపీఠాలను అందుకుంది..
ఇప్పుడు ఆ నింగీ నేలా ప్రశ్నిస్తున్నాయి..
విశ్వంభరుడు ఎక్కడని..?
మళ్లీ వసంతరాయలుగా వస్తావా..?
తరతరాల తెలుగు వెలుగై పల్లవిస్తావా..??


సాక్షి, హైదరాబాద్‌/సిరిసిల్ల: సాహితీ శిఖరం నేలకొరిగింది. విశ్వ కవనమూర్తి నిష్క్రమించారు. సెలయేరులా మొదలై జీవనదిలా పరుచుకున్న కవితాఝరి ఇక సెలవంటూ దిగంతాలకు పయనమైంది. తెలుగు మాటను, పాటను, పద్యాన్ని పండించి సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సారస్వతమూర్తి సింగిరెడ్డి నారాయణరెడ్డి(86) అస్తమించారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో కన్నుమూశారు. ఉదయం 6 గంటలకు వ్యక్తిగత సహాయకుడు ఆయన్ను నిద్రలేపేందుకు వెళ్లినా కదలిక లేకపోవటంతో కుటుంబీకులకు సమాచారమిచ్చాడు. వారు వెంటనే కేర్‌ హాస్పిటల్‌ వైద్యుడిని రప్పించి, 7.30 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సినారె మరణవార్త క్షణాల్లోనే తెలియడంతో అభిమానులు, సాహితీ ప్రియులు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉదయం 9 గంటల నుంచే మణికొండలో సినారె ఇళ్లు డాలర్‌హిల్స్‌ ప్లాట్‌ నంబర్‌–61కి తరలి వచ్చి నివాళులు అర్పించారు. సినారెకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, క్రిష్ణవేణి ఉన్నారు. మనమళ్లు చైతన్య, కాంత్రి, లయచరణ్, అన్వేష్, మనమరాళ్లు మనస్వినీ, మౌతికతోపాటు మునిమనమళ్లు, మనమరాళ్లు ఉన్నారు. అమెరికాలో ఉంటున్న ఆయన మనవళ్లు క్రాంతి, అన్వేష్‌రెడ్డి హుటాహుటిన అక్కడ్నుంచి బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున వారు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. అదేరోజు ఉదయం 11 గంటల సమయంలో ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాల మధ్య సినారె అంత్యక్రియలు జరగనున్నాయి.

మారుమూల పల్లె నుంచి ప్రస్థానం..
కవిగా, రచయితగా, విమర్శకుడిగా, సినీ గేయ రచయితగా, మహా వక్తగా, గజల్‌ కవిగా, గాయకుడిగా, సాహిత్య బోధకుడిగా, పరిశోధకుడిగా తనదైన ముద్రవేసుకున్న సినారె రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హన్మాజీపేటలో జన్మించారు. 1931 జూలై 29న సింగిరెడ్డి మల్లారెడ్డి, బుచ్చమ్మ రైతు దంపతుల ఏకైక సంతానం ఆయన. అసలు పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి.ప్రాథమిక విద్య హన్మాజీపేటలో పూర్తి చేసిన ఆయన వేములవాడలో నాలుగు, ఐదు తరగతులు చదివారు. సిరిసిల్లలో ఆరు, ఏడు తరగతులు అభ్యసించారు. ఎనిమిది నుంచి పదో తరగతి వరకు కరీంనగర్‌లో చదువుకున్నారు.

తెలుగు, ఇంగ్లిష్‌ ఐచ్ఛికాలుగా ఉర్దూ మీడియంలో చదివారు. హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పూర్తిచేశారు. ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాలలో ఉర్దూ మీడియంలోనే తెలుగు, సోషియాలజీ, ఎకనామిక్స్‌లతో బీఏ పూర్తి చేశారు. 1952–54లో ఉస్మానియా యూనివర్సిటీలోనే ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ఆ తరగతిలో అప్పట్లో సినారె ఒక్కరే విద్యార్థి కావడం విశేషం. సినారెది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. సాహితీ ప్రవాహాన్ని తలపింపజేస్తూ కాబోలు వారికి గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి అని పేర్లు పెట్టారు. సినారె సతీమణి సుశీల 30 ఏళ్ల క్రితమే ఆయన్ను వదిలి వెళ్లింది. ఆమె పేరిట ‘సుశీల నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించారు.

తొలి రచన.. నవ్వని పువ్వు
1953లో ‘నవ్వని పువ్వు’సినారె తొలి రచన. పరమాణువుగా ప్రస్థానాన్ని ప్రారంభించి మహాపర్వతమై ఎదిగిన ఆయన.. కలం శక్తివంతం. గళం సమ్మోహనం. సుమధురమైన తెలుగు భాషలో ఆయన చేసే ప్రసంగాలు ఇట్టే ఆకట్టుకునేవి. భాషలో శబ్ద మాధుర్యం, భావ గాంభీర్యం, కవితా పరిమళం నిక్షిప్తమై ఉండేవి. చిన్నప్పట్నుంచే కవిత్వం పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పర్చుకున్న సినారె ఆరేడు తరగతుల వయస్సులోనే కవితలు రాశారు.

జానపదాలు, హరికథలు, బుర్రకథలు ఆలపించారు. మానవ పరిణామక్రమంపై ‘విశ్వంభర’ను సంధించారు. ‘నన్ను దోచుకుందువటే ’అంటూ గులేబకావళి కథతో ప్రారంభించి ‘అరుంధతి’వరకు పాటల పూదోటై విస్తరించారు. ‘సినారె గజల్స్‌’తో గానామృతం పంచారు. సామాజిక చైతన్య ప్రబోధాన్ని తన కవిత్వ ప్రధాన లక్ష్యంగా ప్రగతిశీల మానవతావాదాన్ని కవిత్వీకరించారు.

అలా ‘సినారే’అయ్యారు..
చందస్సు అంటే ఏంటో తెలియని రోజుల్లోనే సినారే పద్యాలు రాశారు. ‘ఒకనాడు ఒక నక్క ఒక అడవి లోపల పొట్టకోసర మెటో పోవుచుండె...’అంటూ ఏడో తరగతిలోనే పద్య రచనకు పూనుకున్నారు. సినారె కంటే ముందు తల్లి బుచ్చమ్మకు ఒక పిల్లవాడు పుట్టి చనిపోయాడట. ఆ తర్వాత ఆరేళ్ల వరకు ఆమెకు కాన్పు కాలేదు. తనకు సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేయిస్తానని ఆమె మొక్కుకుందట.

అలా సినారె పుట్టాక ఆయనకు ‘సత్యనారాయణరెడ్డి’అని పేరు పెట్టారు. కానీ స్కూల్‌లో చేర్పించేటప్పుడు వాళ్ల నాన్న ‘సి.నారాయణరెడ్డి’అని రిజిస్టర్‌లో రాయించారు. దీంతో ఆ పేరే స్థిరపడిపోయింది. 1948లో కరీంనగర్‌ ప్రభుత్వోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న రోజుల్లోనే నైజాం రాష్ట్రానికి స్వాతంత్య్రం రావాలని ఆకాంక్షిస్తూ కవిత్వం రాశారు. ‘మారాలి మారాలి మారాలిరా కరడుగట్టిన నేటి కరకు సంఘపు రంగు మారాలి మారాలి మారాలిరా..’అంటూ రాశారు.

కవివరేణ్యుల బాటలో...
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న చాదర్‌ఘాట్‌ కాలేజీలో ఇంటర్‌ చదివే రోజుల్లో జువ్వాడి గౌతమరావు సంపాదకత్వంలో వెలువడే ‘జనశక్తి’పత్రికలో ఆయన మొదటి కవిత ప్రచురితమైంది. ఇంటర్, డిగ్రీ కూడా ఆయన ఉర్దూ మీడియంలోనే చదివారు. ‘‘ఆ రోజుల్లోనే హైదరాబాద్‌ను చూడగానే ఒక మహానగరాన్ని సందర్శించిన గొప్ప అనుభూతి కలిగింది. సుల్తాన్‌బజార్‌లోని శ్రీకృష్ణదేవరాయంధ్ర భాషా నిలయంలో చేరాను. తొలిసారిగా ఆధునిక కవిత్వంలో శిఖరప్రాయులైన గురజాడ, రాయప్రోలు, విశ్వనాథ, కృష్ణశాస్త్రి, జాషువా, శ్రీశ్రీ వంటి భావకవుల, అభ్యుదయ కవుల రచనలు చదివాను..’’అంటూ ఆయన అప్పుడప్పుడు తన అనుభూతులను పంచుకొనేవారు. ‘ప్రహ్లాద చరిత్ర’, ‘సీతాపహరణం’వంటి పద్యనాటికలు,‘భలేశిష్యులు’వంటి సాంఘిక నాటికను ఆ రోజుల్లోనే రాశారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ చదివే రోజుల్లో (1952) కాలేజీ నుంచి ‘శోభ’అనే సాహిత్య సంచిక వచ్చేది.

దానికి కొంతకాలం సినారె సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ‘రోచిస్‌’, ‘సింహేంద్ర’పేర్లతో ఆ పత్రికకు కవితలు రాశారు. ఎంఏ చదివే రోజుల్లో ‘సినీకవి’అనే నాటికను రాసి ప్రదర్శించారు. దాంట్లో ఆయన వేసిన ‘మకరందమూర్తి’పాత్రకు ఉత్తమ బహుమతి లభించింది. యూనివర్సిటీ తెలుగు విద్యార్థి సమితికి, ఆ తర్వాత తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. ఆ రోజుల్లో ఆబిడ్స్‌లోని రెడ్డి హాస్టల్లో జరిగిన ఓ కవి సమ్మేళనంలో విద్యార్థి కవిగా పాల్గొన్నారు. ‘‘ఆ సమ్మేళనంలోనే మహాకవి దాశరథి కృష్ణమాచార్య పరిచయ భాగ్యం లభించింది. ఆయన నాకు గొప్ప ఆదర్శప్రాయులు. ఆ రోజుల్లో మా ఇద్దరిని ‘తెలంగాణ నయన యుగళం’అని పిలిచేవారు. నేను రాసిన ‘జలపాతం’కావ్యాన్ని ఆ మహాకవికే అంకితం ఇచ్చాను’’అని సినారె తరచూ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొనేవారు.

పదవులకే వన్నె...
ఎంఏ పూర్తయ్యాక కొంతకాలం సికింద్రాబాద్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌గా సినారె పనిచేశారు. అక్కడే 1955లో ఆంధ్రోపన్యాసకుడిగా ఉద్యోగ జీవితం ఆరంభమైంది. 1958లో నిజాం కాలేజీలో ఉపన్యాసకుడిగా చేరారు. ఆ సమయంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి సూచన మేరకు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వం –సంప్రదాయములు, ప్రయోగములు’అంశంపై పరిశోధన చేశారు. 1962లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆ మరుసటి ఏడాదే ఓయూ తెలుగు శాఖలో ‘రీడర్‌’గా చేరారు. 1976లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. 1981 వరకు అధ్యాపక వృత్తిలోనే కొనసాగారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా 1981 నుంచి 1985 వరకు పని చేశారు. ఆ తర్వాత అంబేద్కర్‌ ఓపెన్‌ వర్సిటీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985 నుంచి 1989 వరకు ఈ పదవిలో ఉన్నారు. అనంతరం తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులుగా చేరి 1992 వరకు కొనసాగారు.

పబ్లిక్‌గార్డెన్స్‌లో వర్సిటీ భవనం కట్టించడంతోపాటు, యూజీసీ గుర్తింపు తేవడం, కూచిపూడి కళాక్షేత్రాన్ని తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకురావడంతోపాటు అనేక కార్యక్రమాలు చేపట్టారు. భాషా సాంస్కృతిక సలహాదారుడిగా కొంతకాలం, రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా 1987 నుంచి 2004 వరకు విధులు నిర్వహించారు. ప్రతిష్టాత్మక ‘హంస’పురస్కారాలు సినారె హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఈ సమయంలోనే నవల, కథానిక, పద్యం, గేయం, వచన నాటకం, సాహిత్య విమర్శ, ప్రసారమాధ్యమ రచనా విధానాలపై అధ్యయన శిబిరాలు ఏర్పాటు చేశారు. ‘సమైక్య రాగాత్మ’పేరుతో కర్ణాటక, హిందుస్తానీ, అరబిక్, పాశ్చాత్య సంగీత సంప్రదాయ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక మండలి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే 1997లో రాజ్యసభ సభ్యుడిగా సినారెకు అవకాశం లభించింది. ఆరేళ్లు ఆ పదవిలో కొనసాగారు.

రచనలు.. అనేక భాషల్లోకి
సినారె రాసిన గ్రంథాలు, రచనలు ఇంగ్లిషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడ మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. మొత్తం 18 రకాల సాహిత్య ప్రక్రియల్లో 90కి పైగా గ్రంథాలు రాశారు. ‘కర్పూర వసంతరాయలు’, ‘నాగార్జున సాగరం’, ‘తెలుగు గజళ్లు’, ‘కావ్యగానాలు’ప్రముఖంగా చెప్పవచ్చు. ‘విశ్వనాథ నాయకుడు’, ‘రుతుచక్రం’పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. సినారె స్వయంగా హిందీ, ఉర్దూల్లో కవితలు, గజల్స్‌ కూడా రాశారు. అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాలను సందర్శించారు.

1990లో యుగోస్లేవియాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిధిగా పాల్గొన్నారు. ‘విశ్వంభర’వచన కావ్యానికి 1988లో జ్ఞానపీఠ అవార్డు వరించింది. దానితోపాటు కలకత్తా భారతీయ భాషా పరిషత్‌ అవార్డును, కేరళ కుమారన్‌ ఆసన్‌ పురస్కారాన్ని, సోవియట్‌ ల్యాండ్‌ నెహ్రూ అవార్డునూ అందుకుంది. ‘ఋతుచక్రం’కావ్యానికి సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. 1977లో పద్మశ్రీ పురస్కారం లభించింది. 1992లో పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. సినారె గజల్స్‌ని బాగా ఇష్టపడేవారు. ఏ సభల్లో పాల్గొన్న తాను గజల్స్‌ పాడుతూ ఇతరులచే పాడించేవారు.

పాటలతో మనసు దోచుకున్నారు..
ఎన్టీఆర్‌ ఆహ్వానం మేరకు 1962 నుంచి సినారె సినీ పాటలు రాయడం ప్రారంభించారు. ‘గులేబకావళి కథ’సినిమాలోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని.. కన్నులలో దాచుకుందు నిన్నే నా సామి..’అనే పాటతోపాటు ఆ సినిమాలోని అన్ని పాటలు ఆయనే రాశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘అరుంధతి’, ‘మేస్త్రీ’సినిమాల వరకు మొత్తం 3 వేల వరకు పాటలు రాశారు.

‘ఏకవీర’‘అక్బర్‌ సలీమ్‌ అనార్కలీ’సినిమాలకు మాటలు రాశారు. ‘గున్న మామిడీ కొమ్మమీదా..గూళ్లు రెండున్నాయి..’‘పగలే వెన్నెలా.. జగమే ఊయలా..’, ‘వస్తాడు నా రాజు ఈ రోజు..’, ‘అమ్మను మించి దైవం ఉన్నదా..’, ‘కంటేనే అమ్మ అని అంటే ఎలా...’, ‘ఓ ముత్యాల కొమ్మ.. ఓ.. మురిపాల రెమ్మా...’, అరుంధతిలో ‘జేజమ్మా.. మాయమ్మా...’అంటూ వచ్చిన పాటలన్నీ సినారె కలం నుంచి జాలువారిన ఆణిముత్యాలే.

సినారె వారసత్వంలో ‘వరేణ్య’
సినారె కుటుంబమంతా కలసి 30 మందికి పైగానే ఉంటారు. అందరూ రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు. కానీ ఆయన ముని మనమరాలు (పెద్ద కూతురు గంగ మనుమరాలు) వరేణ్య మాత్రం తాత బాటలో పయనిస్తోంది. ఆమె ఇప్పుడు పన్నెండో తరగతి చదువుతోంది. ఆంగ్లంలో అద్భుతంగా రాస్తోంది. సినారెను ఆకట్టుకొనే ఎన్నో కవితలు రాశారు. ఆమె ‘త్రూ డెమన్‌ ఐ’అనే కథల సంపుటి రాశారు. అలాగే ‘టెండర్‌ రేస్‌’అనే కవిత్వం రాశారు. దీన్ని సినారె ‘లేత కిరణాలు’అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.

శిఖరాలు అధిరోహించినా.. ఊరిపైనే ప్రేమ..
జీవితంలోనే ఎన్నో శిఖరాలను అధిరోహించినప్పటికీ సినారెకు తన ఊరిపై ఉన్న ప్రేమను మాత్రం ఏ రోజూ వీడలేదు. ఏటా స్వగ్రామానికి వచ్చి.. ఒకరోజంతా తన చిన్నతనంలో తిరిగిన ప్రదేశాలను, ఆటలాడిన మూలవాగును గుర్తుచేసుకునే వారు. గ్రామంలో ఆయనకంటే చిన్నవారిని ప్రేమతో పిలుస్తూ.. ఆ రోజంతా గ్రామంలో గడిపేవారు. తన చదువు కోసం పడిన కష్టాలు మరెవ్వరికీ ఎదురుకాకూడదని తన ఇంటిని గ్రంథాలయానికి అప్పగించారు. అందులోకి కావాల్సిన సామగ్రి, పుస్తకాలను ఏర్పాటు చేశారు. తాను రాసిన ప్రతీ రచన మొదటి సంచికను ముందుగా ఈ గ్రంథాలయానికి పంపించే వారని అక్కడి అభిమానులు చెబుతున్నారు.

అలాగే తన సొంత స్థలంలో పాఠశాల భవనం నిర్మించడమే కాకుండా పిల్లలు ఆడుకునేందుకు రెండెకరాలు కేటాయించారు. వివిధ కులాలకు చెందిన 20 మంది కులస్తులకు దాదాపు కోటి రూపాయలకు పైగా వెచ్చించి సంఘ భవనాలు నిర్మించి ఇచ్చారు. గ్రామస్తులంతా శుభకార్యాలు చేసుకునేందుకు తల్లి బుచ్చమ్మ పేరిట కల్యాణ మండపాన్ని నిర్మించారు. హన్మాజీపేట–లింగంపల్లి గ్రామాల మధ్య మూలవాగుపై బ్రిడ్జి నిర్మించారు. కళాకారుల కోసం రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో సినారె కళాభవనాలను నిర్మించారు.

ఇదీ ప్రస్థానం..
పేరు: సింగిరెడ్డి నారాయణరెడ్డి
పుట్టిన తేదీ : 29 జూలై, 1931
సొంతూరు: హన్మాజీపేట, రాజన్న సిరిసిల్ల జిల్లా
తల్లిదండ్రులు: బుచ్చమ్మ, మల్లారెడ్డి
భార్య: సుశీల
కూతుళ్లు: గంగ, యుమున, సరస్వతి, కృష్ణవేణి

అలంకరించిన పదవులు..
– ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షులు
– డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు
– పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు
– ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల సలహాదారు
– రాజ్యసభ సభ్యులు
– ఆంధ్ర(తర్వాత ‘తెలంగాణ’అయింది) సారస్వత పరిషత్తు అధ్యక్షులు

వరించిన పురస్కారాలు
– జ్ఞానపీఠ్‌ అవార్డు
– పద్మశ్రీ, పద్మవిభూషణ్‌
– కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు
– ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడెమీ అవార్డు
– రాజాలక్ష్మీ పురస్కారం
– సోవియట్‌–నెహ్రూ పురస్కారం
– ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో డాక్టరేట్‌
– కళాప్రపూర్ణ
– సినీకవిగా నంది పురస్కారాలు
– పలు యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు
– 2014లో సాక్షి ‘జీవన సాఫల్య పురస్కారం’

రచనలు...
నవ్వని పువ్వు (1953)
జలపాతం (1953)
విశ్వగీతి (1954)
అజంతాసుందరి (1955)
నారాయణరెడ్డి గేయాలు (1955)
నాగార్జునసాగరం (1955)
స్వప్నభంగం (1957)
కర్పూర వసంతరాయలు (1957)
వెన్నెలవాడ (1959)
దివ్వెల మువ్వలు (1959)
విశ్వనాథ నాయకుడు (1959)
రామప్ప (1960)
సమదర్శనం (1960)
రుతుచక్రం (1964)
అక్షరాల గవాక్షాలు (1965)
వ్యాసవాహిని (1965)
ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయోగాలు (1967)
జాతిరత్నం (1967)
మధ్యతరగతి మందహాసం (1968)
మరో హరివిల్లు (1969)
గాంధీయం (1969)
మంటలూ మానవులూ (1970)
ముఖాముఖి (1971)
మనిషిచిలక (1972)
మీరాబాయ్‌(1972)
మందార మకరందాలు(1973)
ఉదయం నా హృదయం(1973)
మార్పు నా తీర్పు(1974)
శిఖరాలు లోయలు(1974)
తేజస్సు నా తపస్సు (1975)
తరతరాల తెలుగువెలుగు(1975)
ముచ్చటగా మూడువారాలు మలేషియాలో తెలుగువాణి (1975)
పగలే వెన్నెల(1976)
ఇంటిపేరు చైతన్యం(1976)
భూమిక(1977)
నారాయణరెడ్డి నాటికలు (1978)
మథనం(1978)
ముత్యాల కోకిల(1979)
విశ్వంభర(1980)
సోవియట్‌ రష్యాలో పదిరోజులు (1980)
మా ఊరు మాట్లాడింది(1980)
సమీక్షణం(1981)
పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు(1981)
రెక్కలు(1982)
అమరవీరుడు భగత్‌సింగ్‌(1982)
సోవియట్‌ యూనియన్‌లో మరోసారి(1983)
నడక నా తల్లి(1983)
కాలం అంచుమీద(1985)
తెలుగు గజళ్లు(1986)
కవితా నా చిరునామా(1988)
ఆరోహణ(1991)
ప్ర‘పంచ’పదులు(1991)
నిరంతరం(1991)
తెలుగు కవితా లయాత్మకత(1992)
జాతికి ఊపిరి స్వాతంత్య్రం(1993)
దృక్పథం(1994)
సినారె గజళ్లు(1995)
కలం సాక్షిగా(1995)
భూగోళమంత మనిషి బొమ్మ(1996)
పాటలో ఏముంది.. నా మాటలో ఏముంది–1(1996)
మట్టి..మనిషి..ఆకాశం(1997)
పాటలో ఏముంది.. నామాటలో ఏముంది–2(1998)
గదిలో సముద్రం(1998)
వ్యక్తిత్వం(1999)
సినారె గీతాలు(1999)
దూలాలను దూసుకొచ్చి(2000)
ముచ్చటగా మూడు వారాలు(2001)
పాశ్చాత్య దేశాల్లో 50 రోజులు(2001)
సప్తతి ఒక లిప్తగా(2001)
దట్‌ ఈజ్‌ వాట్‌ ఐ సెండ్‌(2002)
రెక్కల సంతకాలు(2003)
మూవింగ్‌ స్పిరిట్‌(2003)
జ్వాలగా జీవించాలని(2004)
కొనగోటిమీద జీవితం(2005)
కలిసినడిచే కాలం(2006)
ఏవీ ఆ జీవ నదులు(2007)
సమూహం వైపు(2008)
మనిషిగా ప్రవహించాలని(2009)
విశ్వం నాలో ఉన్నప్పుడు(2010)
నా చూపు రేపటి వైపు (2011)
వాక్కుకు వయసులేదు(2012)

మరిన్ని వార్తలు