కోడ్‌ అతిక్రమిస్తే సీ విజిల్‌లో పడతారుగా...

21 Nov, 2018 08:44 IST|Sakshi

సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు

అనుమతులు లేని ప్రచారంపై కేసు నమోదు

జనగామ జిల్లాలో ఇప్పటివరకు 56 ఫిర్యాదులు

ఒక చోట కేసు నమోదు ఉల్లంఘనకు పాల్పడితే శిక్షలు

సాక్షి, జనగామ: ముందస్తు ఎన్నికలపై ఎలక్షన్‌ కమిషన్‌ అనేక ఆంక్షలు విధిస్తుంది. సాంకేతికతను వినియోగిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా అభ్యర్థుల ప్రచార కదలికలపై కన్నేసింది. కోడ్‌ ఉల్లంఘనలపై అధికారులు పర్యవేక్షిస్తుండగా ఈసారి పనిలో పనిగా సామాన్యపౌరులకు ఆ బాధ్యతలు అప్పగించింది. దీంతో ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతుంది. కోడ్‌ అతిక్రమిస్తున్న రాజకీయపార్టీలపై సీ విజిల్‌ యాప్, ఈసీ వెబ్‌సైట్, ఈ మెయిల్‌ ద్వారా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొస్తున్నారు. కోడ్‌ అమలులోకి వచ్చిన నాటినుంచి జనగామ జిల్లావ్యాప్తంగా సీ విజిల్‌ యాప్‌లో 56 ఫిర్యాదులు అందాయి. వీటిలో 55 కేసులకు సంబంధించి విచారణ జరుపుతుండగా ఒకటి మాత్రం ఎఫ్‌ఐఆర్‌ బుక్‌చేశారు. 

ఓటింగ్‌ రోజు జాగ్రత్త

  • పోలింగ్‌ స్టేషన్‌ దగ్గరలో కోడ్‌కు వ్యతిరేఖంగా ప్రచారం చేస్తే ఏ పోలీస్‌ అధికారి అయినా సామగ్రిని స్వాధీనం చేసుకోవచ్చు, మూడు నెలల జైలు లేదా జరిమానా విధించవచ్చు. 
  • ఓటు వేసే సమయంలో నియమ నిబంధనలు పాటించని వారికి మూడు నెలల జైలలు శిక్ష లేదా జరిమానా పడుతుంది. 
  • పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరవేసేందుకు అక్రమంగా వాహనాలు సమకూర్చడం నేరమే. అధికార దుర్వినియోగం చేస్తే శిక్షార్హులే. అందుకు రూ.500 జరిమానా విధిస్తారు. 
  • పోలింగ్‌రోజు, కౌంటింగ్‌రోజు మద్యం అమ్మడం, అందించడం నేరం. అందుకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండు వేల రూపాయల వరకు జరిమానా పడుతుంది. 


ముందే అవగాహన.. పెద్ద ఎత్తున ప్రచారం..
ఎలక్షన్‌ నియమావళి ఉల్లంఘనపై సీ విజిల్, వెబ్‌సైట్, ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదుచేసే విధానంపై ఎన్నికల అధికారులు జిల్లావ్యాప్తంగా ప్రచారం చేశారు. సీ విజిల్‌ కోసం నియమించిన నోడల్‌ అధికారుల ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నిత్యం అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. 

సత్వర పరిష్కారం..
సీ విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేసిన 100 నిమిషాల్లో సమస్యను పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. యాప్‌ ద్వారా ఫిర్యాదులు చేసే వారి వివరాలు అడ్రస్‌ తెలుసుకుంటారు. దీంతో సంబంధిత అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారు. యాప్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాస్తవమయితే కేసు నమోదు చేయడంతో పాటు  ఫిర్యాదుచేసిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచేందుకు సంబంధిత అధికారులకు ఎలక్షన్‌ కమిషన్‌ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.   

మరిన్ని వార్తలు