22న మంత్రివర్గ విస్తరణ?

14 Jun, 2014 00:39 IST|Sakshi
22న మంత్రివర్గ విస్తరణ?

అసెంబ్లీ పదవులతో తగ్గిన ఒత్తిడి  అయినా ఆశావహులు చాలామందే
 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల 22న ఉండే అవకాశముంది. జూన్ 2న ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు, మరో 11 మంది మంత్రులు గా ప్రమాణం చేసినపుడు మరోవారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.   22 వ  తేదీకంటే ముందే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం నిర్ణయిస్తే, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఈ నెల 18 న విస్తరణ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కేసీఆర్ సన్నిహితుడొకరు వెల్లడించారు. మంత్రిపదవుల కోసం ఆశావహుల జాబితా పెద్దగా ఉండడంతో ఒత్తిడిని తగ్గించుకోవడానికి శాసనసభ పదవులను కేసీఆర్ వినియోగించుకున్నారు. తెలంగాణ రాష్ట్రమంత్రివర్గంలో తప్పకుండా స్థానం దక్కుతుందని ఆశించిన పలువురు పార్టీ సీనియర్లకు శాసనసభలోనూ, మండలిలోనూ వివిధ హోదాల్లో అవకాశాలను కల్పిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన ఎస్.మధుసూదనాచారిని అసెంబ్లీ స్పీకర్‌గా చేశారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పద్మా దేవేందర్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్‌గా చేశారు. రెండోసారి గెలిచిన నల్లాల ఓదెలును చీఫ్‌విప్‌గా, విప్‌లుగా మరికొం దరు సీనియర్లను చేస్తున్నారు. మంత్రివర్గంలో స్థానం కల్పించడంతో పాటు ఉద్యోగుల వ్యవహారాలను అప్పగిస్తామని ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు కేసీఆర్ గతంలో బహిరంగసభల్లోనే వాగ్దానం చేశారు. ఇప్పుడాయనకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం కల్పించాలనుకుంటున్నారు. శాసనసభ, శాసనమండలి పదవులతో మంత్రివర్గంపై ఆశావహుల ఒత్తిడిని కేసీఆర్ కొంతవరకు తగ్గించుకోగలిగారు.  12 మందితో ఏర్పాటైన తెలంగాణ మంత్రివర్గంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు అవకాశం దక్కలేదు. మెదక్ (కేసీఆర్, హరీశ్‌రావు), కరీంనగర్ (ఈటెల రాజేందర్, కేటీఆర్) జిల్లాలకు రెండేసి మంత్రిపదవులు దక్కాయి. హైదరాబాద్‌లో నాయిని, టి.పద్మారావు, మహమూద్ అలీలకు ఇవ్వడం ద్వారా ముగ్గురికి అవకాశం కల్పించారు.

మిగిలిన రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుండి మంత్రివర్గంలో ఒక్కొక్కరికి అవకాశం దక్కింది. అయితే వరంగల్‌కు స్పీకర్, మెదక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవులు అదనంగా దక్కాయి. కాగా, మలిదశ విస్తరణలో ముందుగా మహబూబ్‌నగర్‌కు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో జలగం వెంకట్రావు ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా ఉండడంతో దీనిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అర్థం కావడం లేదు. కేసీఆర్‌కు చెందిన సామాజికవర్గం నుండి ఇప్పటికే మంత్రివర్గంలో ముగ్గురు (కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు) ఉన్నారు. మహబూబ్‌నగర్ నుండి జూపల్లి కృష్ణారావుకు తప్పనిసరిగా అవకాశం కల్పించే అవకాశం ఉంది. దీనితో ఆ సామాజికవర్గానికి మంత్రివర్గంలో సంఖ్య 4కు చేరుతుంది. అదే సామాజికవర్గానికి చెందిన జలగం వెంకట్రావుకు అవకాశం వస్తుందా అనేది అనుమానమే. వరంగల్ జిల్లా నుండి చందూలాల్, కొండా సురేఖ వంటి సీనియర్లు మంత్రివర్గంలో స్థానాన్ని ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్ నుండి సి.లక్ష్మా రెడ్డికి కూడా అవకాశం కల్పించనున్నారు. వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా అమాత్యపదవిని ఆశిస్తున్నారు. కరీంనగర్ నుండి కొప్పుల ఈశ్వర్‌కు అవకాశం ఇవ్వాల్సి ఉంది. నిజామాబాద్ నుండి గంపా గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డిలు ఆశిస్తుండగా వీరిలో ఒకరికి అవకాశం రానుంది. ఆదిలాబాద్‌లోని ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల్లో ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
 
 
 

మరిన్ని వార్తలు