బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చ

6 Mar, 2015 01:31 IST|Sakshi
బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చ

సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ అయింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ తొలి రోజున రాష్ట్ర గవర్నర్ చేసే ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాలను ఎదుర్కోవాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించింది. అలాగే ఇప్పటివరకు జారీ చేసిన నాలుగు ఆర్డినెన్స్‌లపైనా దృష్టి పెట్టింది. వాటర్‌గ్రిడ్ పథకం కింద పైపులైన్ నిర్మాణానికి భూ వినియోగదారుల హక్కుల సేకరణ, మార్కెట్ కమిటీల పునర్వ్యవస్థీకరణ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్‌లు తెచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఇవి జారీ అయిన 6నెలల్లోగా సంబంధిత బిల్లులకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
 
 దీంతో ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు ఏపీ పోలీస్ హౌసింగ్ సొసైటీని విభజించి తెలంగాణ పోలీస్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. కాగా, 11న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, విపక్షాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించింది. ఇక గజ్వేల్‌లో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న మార్గాలపై కేబినెట్ దృష్టిసారించింది. ఇతర రాష్ట్రాల్లో పన్నుల వసూళ్లను అధ్యయనం చేయాలని అభిప్రాయపడింది. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని సార థ్యంలో కీలక విభాగాల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించింది.

మరిన్ని వార్తలు