చట్ట సవరణకు కేబినెట్‌ నోట్‌లు సిద్ధం

31 Jul, 2018 00:50 IST|Sakshi

ఏపీ, తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుపై హెచ్‌ఆర్‌డీ

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు

సాక్షి, న్యూఢిల్లీ: పునర్విభజన చట్ట ప్రకారం ఏపీ, తెలంగాణలలో వివిధ విద్యా, పరిశోధన సంస్థల ఏర్పాటుకు చేయాల్సిన చట్ట సవరణకు కేబినెట్‌ నోట్‌లు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. విభజన హామీల అమలు పై ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో ఆ శాఖ కౌంటర్‌ దాఖలు చేసింది. చట్ట ప్రకారం ఏపీలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యాసంస్థలు, ప్రస్తుతం వాటి పరిస్థితి వివరాలను అఫిడవిట్‌లో పొందుపరిచింది. ఏపీ, తెలంగాణల్లో గిరిజన విశ్వవిద్యాలయం, అనంతపురంలో కేంద్రీ య వర్సిటీల ఏర్పాటుకు సెంట్రల్‌ యూనివర్సిటీ యాక్ట్‌–2009, సవరణ బిల్లు–2016 సవరణకు సం బంధించి కేబినెట్‌ నోట్‌లు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయని తెలిపింది.

అనంతపురం జిల్లా జంతలూరులో సెంట్రల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని, కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం–2009ని సవరించే వరకు అనంతపురం సెంట్రల్‌ వర్సిటీకి చట్టపరమైన హోదా కల్పించేందుకు సొసైటీ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌–1860 కింద సొసైటీ ఏర్పాటు చేసి తాత్కాలిక తరగతుల ప్రారంభానికి ఆమోదం తెలిపిందని పేర్కొంది. విజయనగరం జిల్లాలో గిరిజన వర్సిటీ మొదటిదశ నిర్మాణానికి రూ.420 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక మంత్రి ఆమోదం తెలిపారని పేర్కొంది.

తిరుపతి ఐఐటీని 2015–16 విద్యాసంవత్సరంతో రేణిగుంటలోని చదలవాడ వెంకట సుబ్బ య్య ఇంజనీరింగ్‌ కాలేజీలో తాత్కాలిక తరగతుల్లో ప్రారంభించామని, తిరుపతికి సమీపంలోని మేర్లపాకలో శాశ్వత ప్రాంగణం నిర్మాణానికి రూ.1,074 కోట్ల నిధుల విడుదలకు  కేంద్ర కేబినెట్‌ అంగీకరించిందని తెలిపింది. తిరుపతి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ సంస్థను తాత్కాలికంగా శ్రీరామ ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రారంభించి రూ.109 కోట్లు విడుదల చేసినట్టు తెలిపింది.

నిట్‌ తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, రెగ్యులర్‌ డైరెక్టర్‌ నియామకంతోపాటు 2015లో వాసవీ ఇంజినీరింగ్‌ కళాశాలలో తాత్కాలిక తరగతులు ప్రారంభించామని, శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.460 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపింది. విశాఖ ఐఐఎంను ఆంధ్ర వర్సిటీలో తాత్కాలికంగా ప్రారంభించామని తెలిపింది. కర్నూలు జిల్లా జగన్నాథగట్టు దిన్నెదేవరపాడులో రూ.297 కోట్ల నిధులతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మానుఫ్యాక్చరింగ్‌ సంస్థ శాశ్వత భవనాల నిర్మాణానికి ఆర్థిక వ్యయ కమిటీ ఆమోదించిందని, కేబినెట్‌ ఆమోదానికి ముసాయిదా బిల్లు ప్రస్తుతం న్యాయ శాఖ పరిశీలనలో ఉందని తెలిపింది.  

మరిన్ని వార్తలు