రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే..

15 Mar, 2018 03:10 IST|Sakshi

సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఢిల్లీలోని ప్రభుత్వ ప్రతినిధులకు కేబినెట్‌ హోదా

కేబినెట్‌ హోదా ఇవ్వడమన్నది ప్రభుత్వ విచక్షణాధికారానికి సంబంధించింది

ఇందులో రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరగలేదు

రేవంత్‌ వ్యాజ్యాన్ని కొట్టేయాలని హైకోర్టులో సీఎస్‌ ఎస్‌కే జోషి కౌంటర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాల దృష్ట్యా పలువురు సలహాదారులకు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు కేబినెట్‌ హోదా ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్‌ హోదా ఇవ్వడమన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారానికి సంబంధించిందని, కేబినెట్‌ హోదా ఇవ్వడమనే ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో అమలు చేస్తున్నదేనని వివరించింది. తమకున్న అధికార పరిధిలోనే కేబినెట్‌ హోదా ఇచ్చామని, సలహాదారులకు, చైర్మన్లకు కేబినెట్‌ హోదా ఇవ్వడమన్నది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినట్లు కాదని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా కేబినెట్‌ మంత్రులతో సమానమైన హోదాలో పలువురు సలహాదారులను నియమించుకుందని తెలిపింది. ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయోజనాలు, దురుద్దేశాలతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని, అందువల్ల రేవంత్‌కు జరిమానా విధిస్తూ ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని హై కోర్టును కోరింది. పలువురు సలహాదారులకు, కార్పొరేషన్ల చైర్మన్లకు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు కేబినెట్‌ హోదా ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్‌ చేస్తూ రేవంత్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిం దే. దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తు లు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌తో కూడిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి కౌంటర్‌ దాఖలు చేశారు. 

రాజ్యాంగ విరుద్ధం కాదు.. 
‘కేబినెట్‌ హోదా ఇవ్వడం ఏ రకంగానూ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఆయా రంగాల్లో నిపుణులు, అనుభ వజ్ఞులైన వ్యక్తులను సలహాదారులుగా, ప్రత్యేక ప్రతినిధులుగా, చైర్మన్లుగా నియమించుకుని వారికి కేబినెట్‌ హోదా ఇచ్చాం. తెలంగాణ రాష్ట్ర అవసరాలను, ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. కేబినెట్‌ హోదా పొందిన వారు మంత్రులు కారు. వారిని గవర్నర్‌ నియమించలేదు. మంత్రిమండలిలో వారు భాగస్వాములు కాదు. అధికార రహస్యాలను కాపాడతామని మంత్రుల్లా ప్రమాణం చేయలేదు. మంత్రు లు నిర్వర్తించే విధులను నిర్వర్తించడం లేదు. మంత్రిమండలి సమావేశాల్లో పాల్గొనడం లేదు. మంత్రులు నిర్వర్తించే విధులకు, కేబినెట్‌ హోదా పొందిన వారు నిర్వర్తించే విధులకు ఏ మాత్రం పొంతనే లేదు.

కేబినెట్‌ మంత్రుల సంఖ్య విషయంలో రాజ్యాంగం నిర్దేశించిన పరిమితి(15%) ఎక్కడా దాటలేదు. కాబట్టి కేబినెట్‌ హోదా విషయంలో రాజ్యాంగ నిబంధలనల ఉల్లంఘన జరగలేదు. 2014 జూన్‌ 2న తెలంగాణ అవతరించింది. ఆ రోజు నుంచి మంత్రిమండలి పనిచేస్తోంది. ఆ రోజుకి మంత్రి మండలి లేదన్న పిటిషనర్‌ వాదన సరికాదు. ప్రభుత్వ అవసరాల దృష్ట్యా ఎవరినైనా, ఎప్పుడైనా సలహాదారులుగా నియమించుకోవచ్చు. అసెంబ్లీ లేని సమయం లో, రాష్ట్రపతి పాలనలో మాత్రమే సలహాదారుల అవసరం ఉంటుందనుకోవడం సరికాదు. సలహాదారులు, ప్రత్యేక ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్మన్‌కు కేబినెట్‌ హోదా ఇవ్వడమన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణాధికారానికి సంబంధించింది. ప్రజా ప్రయోజనా లు లేని ఈ వ్యాజ్యాన్ని జరిమానాతో కొట్టేయాలి’ అని జోషి కౌంటర్‌లో వివరించారు. ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేసిన నేపథ్యంలో తిరుగు సమాధానం ఇచ్చేందుకు గడువు కావాలని రేవంత్‌ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వచ్చే బుధవారా నికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు